రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖా మాత్యులుగా పొన్నం ప్రభాకర్ సోమవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. మొదటగా మంత్రి తన ఛాంబర్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు మంత్రి పొన్నంకు ఆశీర్వచనాలు అందించారు. మంత్రి పొన్నం.. మొదటగా ఆర్టీసీ ఫైల్ పై రూ. 375 కోట్ల నిధులు విడుదల చేస్తూ మొదటి సంతకం చేశారు. మంత్రితో రవాణా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వాణీ ప్రసాద్ సంతకం చేయించారు. ఆర్టీసీకి మూడవ త్రైమాసిక బడ్జెట్ కింద పలు రాయితీలకై రూ. 375 కోట్ల నిధులు మంత్రి పొన్నం విడుదల చేశారు. అలాగే కరోనా సమయంలో మృతి చెందిన రవాణా శాఖ ఉద్యోగి పండు బాబు కుటుంబానికి రూ.1 లక్ష పరిహారంకు సంబంధించిన ఫైల్ పై మంత్రి సంతకం చేశారు. ప్రిన్సిపాల్ సెక్రటరీతో పాటుగా ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్ ఉన్నారు.
Read Also: Congress: పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇంఛార్జులు వీరే..
అనంతరం మంత్రి పొన్నంను కలిసి పలువురు మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, కవంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం, మాజీ ఎంపీలు మదియాష్కి మైనంపల్లి హనుమంతరావు, బలరాం నాయక్ అంజన్ కుమార్ యాదవ్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పిసిసి ఉపాధ్యక్షులు మల్లు రవి, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎసిసి సెక్రటరీలు రోహిత్ చౌదరి, విష్ణునాథ్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్ ను.. హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
Read Also: Rashmi Gautham: రష్మీ పెళ్లి.. ముహూర్తం ఎప్పుడంటే.. ?