Police Case: తాడిపత్రిలో టపాసులు కాల్చినందుకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులపై కేసు నమోదు అయ్యింది.. తాడిపత్రిలో గురువారం రాత్రి కాలేజీ గ్రౌండ్‌లో టపాసులు పేల్చారు జేసీ అభిమానులు.. అయితే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాత్రి తన ఇంటి వద్ద కార్యకర్తలతో మాట్లాడుతుండగా టపాసులు అక్కడికి వచ్చి పడ్డాయట.. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరులు.. దీంతో.. టపాసులు కాల్చవద్దని జేసీ ప్రభాకర్ రెడ్డికి సూచించారు పోలీసులు.. ఇక, జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు మల్లికార్జున రెడ్డితో పాటు మరికొందరిపై 286, 290 r/w 34 ఐపీసీ సెక్షన్లు, 9 (B) (1) (b) ఎక్స్ ప్లోజివ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే, టపాసులు కాల్చినా.. కేసు నమోదు చేయడం ఏంటి? అంటూ జేసీ అనుచరులు, టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.. ఉద్దేశ్యపూర్వకంగానే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫిర్యాదు చేశారని.. తప్పుడు కేసులు తమపై బనాయించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. వేధింపులు, కేసులతో తమను అడ్డుకోలేరంటున్నారు.