పోలవరం నిర్మాణ పనుల్లో కీలక ఘట్టానికి ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు శ్రీకారం చుట్టారు. 2020 తర్వాత వచ్చిన వరదల కారణంగా దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి పనులను ప్రారంభించారు. ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టర్ మెగా ఇంజనీరింగ్ సంస్థ ఆధ్వర్యంలో జర్మనీకి చెందిన బావర్ కంపెనీ డివాల్ నిర్మాణ పనులను చేపడుతోంది. పాత డయాఫ్రం వాల్‌కు 6 మీటర్ల ఎగువన కొత్త నిర్మాణం చేపట్టనున్నారు. ఈ డయాఫ్రం వాల్ కోసం ప్రభుత్వం రూ.990 కోట్లు వ్యయం చేయనుంది.
2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంతో ముందడుగులో వేస్తున్న ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. సెంట్రల్ సాయిల్-మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ ప్రతిపాదించిన టీ-5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో నదీ గర్భంలో కొత్త డయాఫ్రమ్‌వాల్ నిర్మాణాన్ని ప్రాజెక్టు అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు. గ్యాప్-2లో దెబ్బతిన్న పాత వాల్‌కు సమాంతరంగా 6 మీటర్ల ఎగువన కొత్త వాల్ నిర్మాణం ప్రారంభమైంది. రూ.990 కోట్ల వ్యయంతో నదీగర్భంలో కనిష్టంగా 10 నుంచి 93.5 మీటర్ల లోతుతో 1.5 మీటర్ల మందంతో కొత్త డివాల్ నిర్మాణంను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంతో సబ్ కాంట్రాక్ట్ సంస్థ బావర్ పనులు ప్రారంభించింది. గతంలోనూ ఇదే సంస్థ డివాల్ నిర్మాణ పనులను చేపట్టింది. వాల్ నిర్మాణానికి అవసరమైన గైడ్ వాల్ ఏర్పాటుతో పాటు భారీ యంత్రసామాగ్రి ఇప్పటికే పోలవరంలో సిద్దంగా ఉండటంతో పనుల్లో వేగం పెరగనుంది.
Also Read: Daggubati Purandeswari: ఎన్టీఆర్‌ది మరణం లేని జననం.. రాజకీయాల్లో కొత్త చరిత్ర రాశారు!
వాస్తవానికి డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు జనవరి రెండవ తేదీనే ప్రారంభం కావాల్సి ఉండగా.. కాంక్రీట్ మిక్స్, డిజైన్ అనుమతుల్లో కొంత జాప్యం జరగడంతో రెండు వారాలు పనులు ఆలస్యమైంది. 16వ తేదీన డిజైన్ మిక్స్ అనుమతులు రావడంతో పనులను ప్రారంభించినట్టుగా ప్రాజెక్టు సీఈ స్పష్టం చేశారు. క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంతో అధికారులు, కాంట్రాక్టు సంస్థ ముందుకు వెళుతున్నాయి.