Lok Sabha Elections 2024: ఏడో దశ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. ఇందులో భాగంగానే అందరికంటే ముందు నుంచే ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్న ప్రధాని పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. అందులో భాగంగానే నేడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాసత్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని అశోక్‌నగర్ తో పాటు దక్షిణ 24 పరగణాల జిల్లాలోని బరుయ్‌పూర్‌లో జాదవ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు. అలాగే, తొలిసారి కోల్‌కతాలో రోడ్ షో కూడా చేయనున్నారు. మహానగరంలోని శ్యాంబజార్ ఫైవ్ పాయింట్ దగ్గర నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి సాయంత్రం 4 గంటలకు రోడ్ షో ప్రారంభమై సిమ్లా స్ట్రీట్‌లోని స్వామి వివేకానంద నివాసం దగ్గర ముగుస్తుందని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ తెలిపారు.
కాగా, స్వామిజీ వివేకనంద ఇంటికి వెళ్లి ఆయన విగ్రహానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నివాళులు ఆర్పించనున్నారు. అయితే, రోడ్ షో ప్రారంభానికి ముందు బాగ్‌బజార్‌లోని తల్లి శారదా ఇంటిని కూడా ఆయన సందర్శించనున్నారు. ఈ కార్యక్రమం దాదాపు 40 నిమిషాల పాటు ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. రోడ్ షో థీమ్‌ను ‘బంగాలీర్ మోనే మోడీ’ అంటే ‘బెంగాలీల మదిలో మోడీ’ అని ఉంచారు. కోల్ కతాలో రోడ్ షో అనంతరం ఇవాళ (మంగళవారం) రాత్రికి రాజ్ భవన్ లో ప్రధాని బస చేస్తారు. దీని తర్వాత రేపు (బుధవారం) దక్షిణ 24 పరగణాస్‌లోని మధురాపూర్‌లో మోడీ మరో ఎన్నికల ర్యాలీలో పాల్గొననున్నారు.