Sachin Pilot: ఈ లోక్ సభ ఎన్నికల ఫలితాలు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ప్రజలు తిరస్కరించినట్లు కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఆరోపించారు. అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించొద్దని వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలపై భారతీయ జనతా పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సుమారు 200 స్థానాలు వచ్చాయి. అప్పుడు రాజీవ్ గాంధీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరగా.. ప్రజల తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చిందని తిరస్కరించారు. దాంతో అప్పుడు రెండో అతి పెద్ద పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ పిలుపు వచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుత ఎన్నికల ఫలితాలు బీజేపీ, ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా వచ్చాయని కాంగ్రెస్ నేత సచిన్ ఫైలెట్ వెల్లడించారు.
Read Also: NDA Meeting Modi 3.0: ఎన్డీయే పక్ష నేతగా మోడీ.. ఆమోదించిన నితీష్, చంద్రబాబు
ఇక, 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 197 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది.. కానీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్టీ మాత్రం రాకపోవడంతో.. రెండో స్థానంలో జనతాదళ్ 143 స్థానాలు దక్కించుకుంది. అప్పుడు వీపీ సింగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, 2024 ఎన్నికల్లో 293 సీట్లతో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్టీని సాధించింది. ఈ కూటమిలోని ప్రధాన పార్టీ బీజేపీ 240 స్థానాల్లో విజయం సాధించింది. గత రెండుసార్లు కమలం పార్టీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్(272) దాటినప్పటికి.. ఈసారి మాత్రం ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. బీజేపీ తర్వాత స్థానంలో రెండో అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ (100) ఉంది.