రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రేషన్ బియ్యం కేసు విచారణలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్‌పేట పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీసులలో పేర్కొన్నారు. ఈ కేసులో జయసుధకు ఇప్పటికే కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసు విచారణకు సహకరించాలని కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని నివాసానికి పోలీసులు వెళ్లగా.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో డోర్‌కి నోటీసులు అతికించారు.
అధికార దుర్వినియోగానికి పాల్పడి.. పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యంను పక్కదారి పట్టించారని వైసీపీ నేత పేర్ని నానిపై కేసు నమోదైంది. ఆయన భార్య జయసుధ పేరిట నిర్మించిన గోదాముల్లో పౌరసరఫరాల శాఖ నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. గోదాము మేనేజర్ బేతపూడి మానస్ తేజను ముందు పెట్టి ఈ కుట్ర అమలు చేశారు. అధికారుల పరిశీలనలో 3,708 బస్తాలు తగ్గినట్టు తేలింది. గోదాములు పేర్ని నాని భార్య జయసుధ పేరుతో ఉండటంతో పోలీసులు కేసు ఆమెపై కూడా కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం తగ్గడంపై 2 దఫాలుగా రూ.1.70 కోట్లు పేర్ని నాని చెల్లించారు.