Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు విజయవాడ చేరుకోనున్నారు.. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు పవన్.. అక్కడ నుంచి నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు పవన్.. కాగా, రేపటి నుంచి కృష్ణా జిల్లాలో నాల్గో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభంకానున్న విషయం విదితమే.. అవనిగడ్డ బహిరంగ సభతో కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర ప్రారంభం కానుంది.. అవనిగడ్డలోని వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ క్రీడా ప్రాంగణంలో మధ్యహ్నం 3 గంటలకు బహిరంగ సభ జరగనుంది. ఇక, కృష్ణా జిల్లాల్లో ఐదు రోజుల పాటు వారాహి యాత్ర సాగనుంది.. మచిలీపట్నంలో అక్టోబర్ 2, 3 తేదీల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు పవన్.. 2వ తేదీన కృష్ణా జిల్లా జనసేన నేతలతో సమావేశం కానున్నారు.. 3వ తేదీన జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారు. 4వ తేదీన పెడన, 5వ తేదీన కైకలూరు నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ పర్యటించబోతున్నారు.. దీనికి సంబంధించిన ఏర్పాట్లలో మునిగిపోయారు జనసేన పార్టీ శ్రేణులు.
Read Also: Wagner Group: కిరాయి సైనిక దళానికి కొత్త లీడర్
వారాహి విజయయాత్ర కోసం సమన్వయకర్తలను నియమించింది జనసేన.. అవనిగడ్డ నియోజకవర్గానికి పోతిన వెంకట మహేష్, తాతంశెట్టి నాగేంద్ర, మండలి రాజేష్.. పెడన నియోజకవర్గానికి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, అమ్మిశెట్టి వాసు, చిల్లపల్లి శ్రీనివాస్, కైకలూరు నియోజకవర్గానికి ముత్తా శశిధర్, చనమల్ల చంద్రశేఖర్‌ను సమయన్వయకర్తలుగా నియమించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇక.. టీడీపీ, బీజేపీ, జనసేన కలయికతో ఈసారి వారాహి యాత్ర సాగుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. ఈ యాత్ర తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారతాయన్న ఆయన.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసికట్టుగా పని చేస్తాం అన్నారు. టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం త్వరలో జరుగుతుందని వెల్లడించారు. కాగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే మూడు విడతలుగా వారాహి విజయయాత్రను పూర్తి చేశారు.. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు విశాఖలో వారాహి యాత్ర నిర్వహించిన ఆయన ఇప్పుడు కృష్ణా జిల్లాలో వారాహి విజయయాత్రకు సిద్ధమయ్యారు.