Pawan Kalyan: “ఇప్పటి వరకు అనకాపల్లి బెల్లం గురించే విన్నాం.. కానీ ఇప్పుడు అనకాపల్లి గుడ్డు గురించి వింటున్నా.. ఐదు శాఖల మంత్రి, డిప్యూటీ సీఎం, ప్రభుత్వ విప్ ఇచ్చినా కిలోమీటర్ రోడ్డు కూడా వేయించుకోలేక పోయారు..” అంటూ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. అనకాపల్లి వారాహి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి గెలవాలనే ఆకాంక్ష కూటమి సభలకు వస్తున్న స్పందనే నిదర్శనమన్నారు. దశాబ్దకాలం ఒక్క ఎమ్మెల్యే లేకుండా పార్టీని నడపడం మీ భవిష్యత్ కోసమేనని పవన్ ప్రజలనుద్దేశించి అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అవ్వాలని కోరుకుంటే ప్రధాని ఇస్తారని.. ఆయనను అడిగే సాన్నిహిత్యం తనకు ఉందన్నారు. అమ్మ ఒడిలో కోతలు పెట్టి ప్రభుత్వం మోసం చేసిందని ఆయన విమర్శలు గుప్పించారు.
Read Also: CM Jagan: చంద్రబాబుకు కడుపు మంట.. కొనకనమిట్ల మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్
ముఖ్యమంత్రి ఒక స్కాం స్టర్.. సీఎం ఒక లిక్కర్, ఇసుక వ్యాపారి.. దోపిడీ చేయనమే ఆయన విధానమని విమర్శించారు. కేంద్ర నాయకత్వం అభ్యర్ధన మేరకు అనకాపల్లి ఎంపీ సీటును వదులుకున్నామన్నారు. జనసేన తరపున బలమైన ప్రాతినిధ్యం అసెంబ్లీ రాబోతోందన్నారు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ భూములను ముక్కలు చేసి రియల్ ఎస్టేట్‌కు ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని ఆయన ఆరోపించారు. కోడిగుడ్డు ప్రభుత్వం కావాలో ప్రజా ప్రభుత్వం కావాలో ఆలోచించాలన్నారు. ముఖ్యమంత్రి అయ్యే నాయకత్వ బలం లేదు.. ఈ ఎన్నికల్లో పోరాడదామన్నారు. తాను ముఖ్యమంత్రి అవ్వాలనే మీ కోరిక.. నూకాలమ్మ తల్లి ఆశీర్వాదంతో త్వరలోనే నెరవేరాలని ఆశిస్తున్నానన్నారు. మేనిఫెస్టో ప్రకటించడమే కాదు దాని అమలు కోసం అసెంబ్లీలో పోరాడతానన్నారు. రాష్ట్రంలో సర్వెంట్ లీడర్ షిప్ అంటే ఏమిటో చూపిస్తామన్నారు. తాను మాటిస్తే పీక తెగిపోయిన వెనక్కి తగ్గనన్నారు.
సాగునీటి వ్యవస్థను ఈ ప్రభుత్వం దెబ్బ తీసిందని.. రైతులు కన్నీళ్లు తుడిచే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ మహిమో.. కాంట్రాక్టుల ఎఫెక్టో కానీ తిరుమల వెంకన్న ప్రసాదాల తయారీకి అనకాపల్లి బెల్లాన్ని దూరం చేశారన్నారు. మేం అధికారంలోకి వస్తే అనకాపల్లి బెల్లంకు అంతర్జాతీయ గుర్తింపు సాధిస్తామన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగికి పెన్షన్ అనేది పెద్ద కొడుకు లాంటిదని.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపు సీపీఎస్‌కు సానుకూల పరిష్కారం చూపిస్తామన్నారు. కొత్త జిల్లాల్లో కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతుంటే.. ప్రభుత్వం మాత్రం భూములు దోపిడీ, అద్దెలు రూపంలో నిధులు కొట్టేస్తున్నారని పవన్ ఆరోపించారు.
Read Also: CM YS Jagan: వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బరోడా మోడల్ చెత్త శుద్ధి కేంద్రం అనకాపల్లిలో అభివృద్ధి చేస్తామన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కోసం నిధులు కేటాయించడంలో ప్రభుత్వం విఫలమైందని.. క్రిమినల్ గవర్నమెంట్‌ను ఈడ్చి రాష్ర్ట సరిహద్దుల అవతల పడేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసులు సహకారంతోనే వైజాగ్ పోర్టుకు డ్రగ్స్ వచ్చాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు. జనం ప్రేమను చూసిన తర్వాత వచ్చిన జ్వరం పారిపోయిందన్నారు. టిడ్కో ఇళ్లను అనర్హులకు కట్టబెట్టారని ఆయన ఆరోపణలు చేశారు. నూకాలమ్మ తల్లి జాతరను రాష్ర్ట పండుగగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చెత్త పన్ను తొలగించమని చంద్రబాబుని అడుగుతానన్నారు. హక్కులు కాలరాసే ఎవరినైనా తుంగలో తొక్కడం ఖాయమన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కోడి గుడ్డు మంత్రి బినామీల భరతం పడతామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం బలంగా నిలబడతామని, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయడం ద్వారా కాపాడుకోవాలనేది మా ఆకాంక్ష అని ఆయన చెప్పారు. ఢిల్లీ వెళ్లేందుకు ఉక్కుపోరాటం చేస్తున్న కార్మిక సంఘాలు ముందుకు రాలేదన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ తన ఒక్కడి వల్ల అవ్వదని.. అందరూ కలిసి రోడ్డెక్కితే కాపాడుకోగలమన్నారు.