Pawan Kalyan: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. అయితే, జనసేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పవన్.. వారిపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు.. నేను సంపూర్ణమైన రైతును కాను.. కానీ, కష్టాల్లో ఉన్న రైతుల బాధ అర్ధం చేసుకునే మానవతా వాదిని అన్నారు.. అన్నీ తెలుసనంటున్న వైసీపీ నేతలు రైతులకేం చేశారు అని నిలదీశారు పవన్.. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయారు.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పర్యటించామని.. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టానికి ప్రభుత్వాన్ని విమర్శించడం మా ఉద్దేశ్యం కాదన్నారు.. కానీ రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు అధికారులెవ్వరూ వెళ్లలేదు.. తరుగు పేరుతో రైతులను దోచేస్తున్నారు.. రైతు తాను పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి 60 కిలో మీటర్ల మేర ప్రయాణం చేయాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రులు.. ఎమ్మెల్యేలు.. వ్యవసాయ అధికారులు సరిగా స్పందించి ఉంటే ఈ స్థాయి నష్టం ఉండేది కాదని రైతులు అంటున్నారని తెలిపారు పవన్ కల్యాణ్.. నేను వస్తున్నానంటే గోనె సంచులు ఇచ్చారని తెలిపారు.. బంగారాన్ని కుదవ పెట్టి వ్యవసాయం చేస్తోన్న రైతులకు నష్టం వాటిల్లుతున్నా పట్టించుకోకుంటే ఎలా..? అని మండిపడ్డారు.. మంత్రులు వచ్చి సాయం చేయకపోగా రైతులను అనుచిత వ్యాఖ్యలతో దుర్భాషలాడుతున్నారన్న ఆయన.. గిట్టుబాట ధర అడిగితే.. న్యాయం చేయమని అడిగితే.. కేసులు పెడుతున్నారని రైతులు బాధ పడుతున్నారన్నారు.. మేం కష్టపడి పని చేస్తుంటే క్రిమినల్స్‌గా చూస్తారా అంటూ రైతులు ఆవేదన చెందుతున్నారని.. తమ గోడును వెల్లబోసుకున్నారని తెలిపారు.
పావలా వడ్డీ రుణాలు ఇస్తే.. మేం నలుగురికి అన్నం పెడతామంటున్నారు రైతులు.. కానీ, వ్యవసాయ శాఖ అస్సలు పని చేయడం లేదని రైతులే చెబుతున్నారని తెలిపారు పవన్.. వైసీపీ ప్రభుత్వం తమని జలగల్లా పీడిస్తున్నారని రైతులు అంటున్నారు. రైస్ బౌల్ లాంటి ఏపీలోని రైతులకు ఇలాంటి పరిస్థితా అనే బాధ కలిగించిందన్నారు.. చివరి ధాన్యపు గింజ కొనుగోలు చేసేంత వరకు రైతులకు అండగా ఉంటాం.. రైతు కన్నీరు పెడితే రాష్ట్రం సుభిక్షంగా ఉండదని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్..
కాగా, పవన్ కి 10 పంటలు చూపిస్తే వాటిలో కనీసం 5 పంటల్ని కూడా గుర్తుపట్టలేడంటూ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేసిన విషయం విదితమే.. రాజమండ్రిలో పవన్ పర్యటన గురించి మాట్లాడిన మంత్రి కాకాణి.. రైతులు పంటలు ఎలా పండిస్తారో కనీస అవగాహన కూడా పవన్ కి లేదని విమర్శించారు. చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ రైతుల వద్దకి వస్తున్నారనే కారణంతో తాము ధాన్యం కొనుగోలు చేయడం లేదని చెప్పుకొచ్చిన ఆయన.. తమకి వ్యవసాయం అందులో బాధలు గురించి పూర్తిగా తెలుసు కాబట్టే కొనుగోలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అలానే టీడీపీ హయాంలో రైతులకు ఆనవాయితీగా ఇచ్చే ఇన్‌పుట్ సబ్సిడీని కూడా అప్పట్లో ఎగ్గొట్టారని మంత్రి కాకాణి ఫైర్ అయిన విషయం విదితమే.