Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, రాజధాని అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన పవన్.. రాష్ట్ర ప్రజల్లో ప్రాంతీయ, కుల భావాల కంటే రాష్ట్రం పట్ల అనుబంధం పెరగాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల్లో తమ రాష్ట్రం పట్ల ఉన్న భావన స్పష్టంగా కనిపిస్తోందని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రాష్ట్రం కంటే కులాలపై ఎక్కువ చర్చ జరుగుతోందని వ్యాఖ్యానించారు.
అసలు మావిగన్ పేరు వినడానికి చిరాకుగా ఉందని ఫైర్ అయ్యారు పవన్.. రాజధాని అమరావతి మీద వైసీపీ ఆరోపణలు చేస్తోంది.. కానీ, వారు పెట్టిన ఆ పేరు వినాలంటేనే చిరాకుగా ఉంటుంది.. మూడు జిల్లాలను కలిసి రాజధాని కావాలంటున్నారు అని దుయ్యబట్టారు.. ప్రస్తుత రాజధాని కనీసం అమరావతికి పరిమితం.. గత ముఖ్యమంత్రి చెప్పేది మూడు జిల్లాలు కలిపి మూడు రాజధానులుగా ఇంకా పెద్దగా అవుతుంది అని ఎద్దేవా చేశారు.. మీకు అమరావతి నచ్చలేదు.. ముూడు రాజధానులు కావాలా.. అయితే, పాలసీ పై మాట్లాడండి.. చంపేస్తాం.. నరికేస్తాం అంటే.. ఇక్కడ ఎవరూ భయపడరని వాళ్లు తెలుసుకోవాలి అని సూచించారు.. గత సీఎం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి రాజధాని అంటున్నారు.. మొత్తం రియల్ ఎస్టేట్ లు అమ్ముకోవచ్చు అని వారి కుట్రలు అని ఆరోపించారు..
అమరావతి రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలకు పైగా భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేసిన ఆయన, వారి త్యాగం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ అమరావతి తమ రాజధాని అనే భావన కలగాలని, ‘జై ఆంధ్రా’ అనే నినాదం రాష్ట్ర ఐక్యతకు ప్రతీకగా నిలవాలని పేర్కొన్నారు. రాజధాని అంశంపై భిన్నాభిప్రాయాలు ఉంటే విధానపరంగా చర్చించుకోవచ్చని, కానీ బెదిరింపులు, హింసాత్మక వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి హానికరమని పవన్ అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై మాట్లాడాలనుకుంటే పాలసీల పరంగా చర్చించాలని, వ్యక్తిగత విమర్శలు లేదా బెదిరింపులు చేయడం సరైన పద్ధతి కాదన్నారు.
గత ప్రభుత్వ హయాంలో మూడు ప్రాంతాలను కలిపి రాజధాని అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయని పేర్కొన్న పవన్, అలాంటి ఆలోచనలకు రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయి ఏకాభిప్రాయం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికే అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని విస్తృత స్థాయిలో అంగీకారం లభించిన నేపథ్యంలో, దానిని ముందుకు తీసుకెళ్లడంపైనే దృష్టి పెట్టాలని సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై విమర్శలు చేసిన పవన్, రౌడీయిజం, గూండాయిజం తరహా రాజకీయాలకు ఎవరూ భయపడరని అన్నారు. ప్రజాస్వామ్యంలో చర్చలు, వాదోపవాదాల ద్వారా సమస్యలకు పరిష్కారం వెతకాలని, బెదిరింపులతో రాజకీయాలు చేయడం మంచిది కాదని స్పష్టం చేశారు. అమరావతి అంశంపై కొత్త వివాదాలు సృష్టించకుండా, రైతుల ఆశయాలను గౌరవిస్తూ రాజధాని అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
