డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునీకరణ పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.20.77 కోట్లతో చేపట్టనున్న ఈ ఆధునీకరణ పనులు కోనసీమ కొబ్బరి రైతులకు పెద్ద ఊరట కలిగించనున్నాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కోనసీమ కొబ్బరి రైతుల కన్నీరు తనను కదిలించిందన్నారు. 45 రోజుల్లో సమస్య పరిష్కారానికి యాక్షన్ ప్లాన్‌తో వస్తామని చెప్పిన తాము.. 35 రోజుల్లోనే శంకరగుప్తం డ్రెయిన్ ఆధునీకరణకు అడుగులు వేశామని తెలిపారు. ముక్కోటి పర్వదినాన ఈ సమస్యకు పరిష్కారం చూపడం ఆనందంగా ఉందన్నారు.
Also Read: AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల.. రేపటి నుంచి ఏపీలో 28 జిల్లాలు!
రైతుల ఆవేదనను మనసుతో విని తక్షణమే నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అలాగే శంకరగుప్తం డ్రెయిన్ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. డ్రెయిన్ ఆధునీకరణతో వందలాది కొబ్బరి రైతులకు ఉపశమనం కలుగుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు.