AR Rahman: సంగీత రంగంలో అద్భుతమైన విజయాలను సాధించిన ఎ.ఆర్. రెహమాన్ తన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2009లో స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమాకు రాసిన జయహో పాటకు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. అలాగే బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో కూడా మరో ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నారు. భారతదేశాన్ని గ్లోబల్ మ్యూజిక్ మ్యాప్‌పై నిలిపిన రెహమాన్, ఎన్నో అవార్డులు, గౌరవాలను అందుకున్నారు. ఇది ఇలా ఉండగా, ప్రపంచ సంగీత ప్రియులను విశేషంగా అలరించిన భారతీయ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ తాజాగా అనారోగ్యానికి గురయ్యారు. ఆకస్మిక అనారోగ్య సమస్యతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ప్రాథమికంగా అందిన వివరాల ప్రకారం, ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో వైద్యులు యాంజియోగ్రఫీ పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. అందిన సమాచారం మేరకు రెహమాన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. రెహమాన్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలను ఆసుపత్రి యాజమాన్యం ఈ మధ్యాహ్నం అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. అభిమానులు, సంగీత ప్రియులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
Read Also: Minister Amit Shah: చిన్నారి పాటకు మంత్రముగ్ధుడైన కేంద్ర హోంమంత్రి.. బహుమానంగా ఏమిచ్చారంటే?
ఎ.ఆర్. రెహమాన్ కెరీర్ పరంగా ఎంతో విజయవంతంగా కొనసాగుతున్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకున్నాయి. 29 ఏళ్ల వివాహ బంధానికి తెరదించిన సంగతి విధితమే. రెహమాన్ భార్య సైరా బాను, 2024లో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. ఆమె న్యాయవాది వందనా షా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.