2007 September 24 is Special Day For Team India: 2007 వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్‌లోనే బంగ్లాదేశ్‌తో చేతిలో ఓడిన భారత జట్టు.. మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అదే ఏడాది టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన జట్టులో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ వంటి సీనియర్ ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని యువ భారత జట్టుపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ ప్రపంచంలో మేటి జట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లను ఓడించడమే కాకుండా.. ఫైనల్ చేరి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయాన్ని సాధించి యావత్ ప్రపంచాన్ని ధోనీ సేన విస్మయానికి గురిచేసింది. నేటితో ఆ మహఘట్టానికి 17 ఏళ్లు పూర్తయింది. పొట్టి ఫార్మాట్ ఆరంభ ప్రపంచకప్‌ను గెలుచున్న టీమిండియాకు నేడు వెరీ స్పెషల్ డే.
ఎంఎస్ ధోనీ, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, రాబిన్ ఉతప్ప, రోహిత్ శర్మ, ఎస్ శ్రీశాంత్,ఆర్పీ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ వంటి యువ ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ రంగంలోకి దిగారు. లీగ్ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో మ్యాచ్ రద్దు రద్దయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ టై కాగా.. బౌల్ అవుట్‌లో విజయం సాధించిన టీమిండియా తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించింది. తర్వాతి రౌండ్‌లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలను ఓడించి.. సెమీఫైనల్‌లోకి దూసుకెల్లింది. సెమీఫైనల్‌లో అప్పటి టాప్ టీమ్ ఆస్ట్రేలియాతో తలపడింది. హేమాహేమీలు ఉన్న ఆస్ట్రేలియా.. అనుభవం లేని యువ భారత జట్టుపై సులువుగా గెలిచి ఫైనల్స్ వెళ్తుందని అందరూ భావించారు. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. అప్పట్లో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న ఆసీస్ జట్టును ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది.
2007లో ఇదే రోజున (24 సెప్టెంబర్) జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్‌లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్స్ కోల్పోయి 157 పరుగులు చేసింది. గాయంతో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మ్యాచ్‌కు దూరం కాగా.. యూసఫ్ పఠాన్ ఓపెనర్‌గా వచ్చాడు. ఒక ఫోర్, ఒక సిక్సర్ కొట్టిన యూసఫ్ (15) క్రీజులో ఎక్కువసేపు నిలవలేదు. రాబిన్ ఉతప్ప (8) కూడా అవుట్ అయ్యాడు. సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ (14), కెప్టెన్ ఎంఎస్ ధోనీ (6) అవుట్ కావడంతో.. ఓపెనర్ గౌతమ్ గంభీర్ భారత జట్టును ఆదుకున్నాడు. 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 75 పరుగులు బాదాడు. ఇన్నింగ్స్ చివర్లో రోహిత్ శర్మ (30) ధాటిగా ఆడాడు.
Also Read: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన ఐశ్వర్య.. ఫొటోలు వైరల్!
ఛేదనలో మొహమ్మద్ హఫీజ్ (1), కమ్రాన్ అక్మల్ (0) అవుట్ అవవడంతో పాకిస్తాన్ తడబడింది. ఈ సమయంలో ఇమ్రాన్ నజీర్ (33), యూనిస్ ఖాన్ (24) జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరితో పాటు షోయబ్ మాలిక్ (8) కూడా పెవిలియన్ చేరడంతో.. మిస్బా ఉల్ హక్ (43) ఒంటరి పోరాటం చేశాడు. దాయాది జట్టు గెలవాలంటే చివరి ఓవర్‌కు 13 పరుగులు అవసరం కాగా.. జోగిందర్ శర్మకు కెప్టెన్ ధోనీ బంతిని ఇచ్చాడు. జోగిందర్ వేసిన మొదటి బంతే వైడ్ కాగా.. అనంతరం డాట్ బాల్ వేశాడు. రెండో బంతిని మిస్బా నేరుగా స్టాండ్స్‌లో పంపాడు. దీంతో సమీకరణం నాలుగు బంతుల్లో 6 పరుగులుగా మారింది. మూడో బంతిని మిస్బా స్కూప్ షాట్ ఆడగా.. బాల్ గాల్లోకి లేచింది. షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న శ్రీశాంత్.. బంతిని అద్భుతంగా ఒడిసిపట్టాడు. పాక్ చివరి వికెట్ కోల్పోవడంతో భారత్ ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.