తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పటికప్పుడు వాళ్ళ కోసమే ఆగుతోందా..? ఏం చేయాలో… ఎలా డీల్ చేయాలో అర్ధం అవకపోవడమే అసలు సమస్యా? ఒకే కుటుంబం నుంచి ఇద్దర్ని కేబినెట్‌లోకి తీసుకోవడం సాధ్యమేనా..? ఎన్నాళ్ళని వాళ్ళిద్దరి పేరుతో నానుస్తారు? ఫైనల్‌గా బ్రదర్స్ లొల్లిని కాంగ్రెస్ అధిష్టానం ఎలా డీల్ చేయబోతోంది? ఎవరా సోదరులు? వాళ్ళ వల్ల పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటి? కరవమంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోపం అన్నట్టు తయారైందట తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. మరీ ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ విషయంలోతీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. అసలే సోషల్ జస్టిస్ అంటున్న పార్టీ … ఇప్పుడు ఈ తలనొప్పి భారాన్ని ఎలా తగ్గించుకోబోతోందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు. తెలంగాణ కేబినెట్ విస్తరణ ప్రస్తావన వచ్చినప్పుడల్లా… ప్రధానంగా జరిగే చర్చ రెడ్లలో ఎవరికి ఛాన్స్ అనేదే. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి కోసం సీఎం రేవంత్ పట్టుబడుతున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు వినిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల టైంలో హామీ ఇచ్చారు కాబట్టి… దాన్ని నిలబెట్టుకోమని అంటున్నారట రాజగోపాల్ రెడ్డి. కానీ… విస్తరణలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికే చాన్స్ ఉండవచ్చంటున్నారు. అలాగే… కుటుంబంలో ఒకరికే పదవి అని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అలా చూస్తే… రాజగోపాల్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే కేబినెట్‌లో ఉన్నారు. దీంతో ఇప్పుడు విస్తరణ ప్రక్రియలో ఎటు చూసినా ప్రధానమైన చర్చ… కోమటిరెడ్డి బ్రదర్స్ చుట్టూనే తిరుగుతోందట. బ్రదర్స్‌లో ఎవరో ఒకరికే కేబినెట్ బెర్త్ ఇవ్వాలన్న చర్చ పార్టీ ఢిల్లీ పెద్దల మధ్య జరిగినట్టు సమాచారం.
ఈ పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించే అవకాశం ఉందా అని మాట్లాడుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. పార్టీ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్‌కు సన్నిహితంగా ఉండే రాజగోపాల్ రెడ్డి… మంత్రి పదవి కాకుండా మరో పోస్ట్‌కు అంగీకరిస్తారా అన్నది ఇక్కడ క్వశ్చన్. ఆయన అంత ఈజీ గా.. ఒప్పుకుంటారా..! అన్నది ఒక ప్రశ్న అయితే… ఇప్పటికే కేబినెట్‌లో ఉన్న ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి రాజగోపాల్‌రెడ్డికి ఇచ్చే పరిస్థితి ఉంటుందా అన్నది ఇంకో క్వశ్చన్. ప్రస్తుతం మంత్రి వెంకటరెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డికి మధ్య కెమిస్ట్రీ బాగానే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఆయన్ని రేవంత్ వదులుకోకపోవచ్చంటున్నారు. దీనికి తోడు… నల్గొండ జిల్లాలో ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి..వెంకటరెడ్డి ఉండగా… మళ్ళీ రెడ్లకే అవకాశం ఇస్తే… మిగిలిన సామాజిక వర్గాల నుండి వ్యతిరేకత పెరుగుతుందన్న అంచనాలున్నాయి. ఉమ్మడి జిల్లాలో బీసీ..ఎస్టీల ప్రాబల్యం ఎక్కువ. ఆ సామాజిక వర్గాలకు గనుక పదవి ఇస్తే.. వాళ్ళకు ఊతం ఇచ్చినట్టు అవుతుందన్న వాదన సైతం ఉంది. బీసీల నుండి బీర్ల ఐలయ్య ఇప్పటికే విప్‌గా ఉన్నారు. ఎస్టీల్లో బాలు నాయక్ సీనియర్. సామాజిక వర్గం కూడా కలిసి వస్తుంది కాబట్టి ఆయన ఆశతో ఉన్నారు. ఇలా ఇటు సామాజిక వర్గాల లొల్లి…అటు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇంటి పోరు మధ్య కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి పరిష్కారం చూపబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.