వైనాట్ పులివెందుల. అసెంబ్లీ ఎన్నికల టైంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నినాదం ఇది. సరే… ఎన్నికలైపోయాయి. కూటమి కనీవినీ ఎరుగని విజయం సాధించింది. అయినా సరే…. పార్టీ పెద్దల మనసు నుంచి వైనాట్ పులివెందుల అన్న మాట చెరిగిపోలేదా? జగన్ అడ్డాలో ఎట్టి పరిస్థితుల్లో బలప్రదర్శన చేయాల్సిందేనని డిసైడయ్యారా? ఈసారి మహానాడును పులివెందులలో నిర్వహించాలన్న ఆలోచన ఉందా? ఆ విషయమై పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? కడప పాలిటిక్స్ అనగానే వైఎస్ కుటుంబం గుర్తుకు రావడం కామన్. జిల్లా రాజకీయాల మీద అంతలా పట్టు బిగించింది ఆ ఫ్యామిలీ. అటు టీడీపీ విషయానికి వస్తే…గడిచిన పాతికేళ్ళలో నామ మాత్రపు సీట్లకే పరిమితం అయింది ఆ పార్టీ. 2004లో పది స్థానాలకు గాను రెండు సీట్లలోనే గెలిచింది తెలుగుదేశం. 2009లో ఒకే ఒక్క స్థానం దక్కింది. 2014లో కూడా రాజంపేటలో మాత్రమే టిడిపి ఎమ్మెల్యే విజయం సాధించారు. ఇక 2019లో అయితే… మొత్తం 10కి 10 సీట్లు దక్కించుకుని క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. కానీ…. 2024 ఎన్నికలకు వచ్చేసరికి మొత్తం తిరగబడింది. ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు సీట్లను కైవసం చేసుకుంది కూటమి. టిడిపి ఐదు, బిజెపి, జనసేన చెరో సీట్లో గెలిచాయి. వైఎస్ కుటుంబానికి అంత పట్టున్న, వాళ్ళ సొంత జిల్లాలోనే… వైసీపీని కట్టడి చేయగలగడం.. తెలుగుదేశం పార్టీలో జోష్ తెచ్చిందట. వైసీపీ అధినేత అడ్డాలో ఏడు సీట్లు గెలిచిన ఊపులో… మరో బలప్రదర్శనకు సిద్ధమవుతోంది. తెలుగుదేశం ఆవిర్భవించాక ఇప్పటిదాకా ఎప్పుడూ కడప జిల్లాలో మహానాడు నిర్వహించలేదు. అందుకే ఇప్పుడు ఆ జిల్లాను కొల్లగొట్టిన ఊపులో ఈసారి కడపలో మహానాడు పెట్టాలన్నది టీడీపీ అధిష్టానం ప్లాన్. కడప జిల్లాలో మహానాడు నిర్వహించాలని ఇప్పటికే పొలిట్‌బ్యూరో నిర్ణయం తీసుకుంది. కానీ… ఇప్పుడు అంతకు మించి అన్న మాటలు వినిపిస్తుండటంతో ఉత్కంఠ రేగుతోంది. మొదట కడపలో మహానాడు నిర్వహణకు స్థల పరిశీలన కూడా చేశారు పార్టీ నాయకులు. కానీ… ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి అసలు జగన్ అడ్డా పులివెందులలోనే మహానాడు పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారట. అందుకోసం అనువైన స్థలం ఉంటే చెప్పండని స్థానిక పార్టీ నేతలకు సూచించినట్టు సమాచారం.
ఉమ్మడి కడప జిల్లాలో కూటమి ఏడు స్థానాలు దక్కడంతో… అదే స్థాయిలో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత కూడా ఇచ్చింది. రాయచోటి ఎమ్మెల్యేకి మంత్రి పదవి, కూటమి పార్టీలకు చెందిన మరో ముగ్గురికి ప్రభుత్వ విప్ పదవులు దక్కాయి. అలాగే… రాయలసీమలోని టీడీపీ కార్యకర్తలకు భరోసా కల్పించాలంటే… కడప జిల్లాలో అయితేనే కరెక్ట్‌గా ఉంటుందని అనుకున్నారట పార్టీ పెద్దలు. అధికారంలో ఉన్నాం…. కడప జిల్లాలో నిర్వహించబోతున్నాం… కొడితే గట్టిగానే కొట్టాలన్న టార్గెట్‌తో పులివెందుల వైపు చూస్తున్నట్టు సమాచారం. మహానాడు ప్రాంగణం కోసం ఇప్పటికే కడప నగరంలోని నాలుగు అనువైన ప్రాంతాలను పరిశీలించిన జిల్లా నేతలు అధిష్టానానికి నివేదికలు పంపారట. కానీ… వాటితో సంతృప్తి చెందని పార్టీ పెద్దలు పులివెందుల విషయాన్ని కూడా చూడమని చెప్పినట్టు తెలుస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో ఇక్కడ పార్టీ పండగ చేసి సత్తా చాటాలని అనుకుంటున్నారట. పులివెందులలో గట్టిగా నిర్వహించగలిగితే… వైసీపీని ఛాలెంజ్ చేయడంతో పాటు… రాయలసీమలోని పార్టీ కేడర్‌లో నైతిక స్థైర్యాన్ని నింపవచ్చన్న ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. అలా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టాలనుకుంటున్నారట. అందుకే బలప్రదర్శన వేదికగా కడపను ఎంచుకోవాలా? లేక పులివెందులకు షిఫ్ట్ అవ్వాలా అన్న మీమాంసలో ఉన్నట్టు తెలిసింది. ఏది ఏమైనా… వైసిపి అడ్డాలో తమ సత్తా చాటాలని గట్టిగా భావిస్తోంది టీడీపీ. ఫైనల్‌గా కడప అవుతుందా? పులివెందులలో నిర్వహించి సంచలనం రేపుతారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.