పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో.. ఆ జిల్లా నేతలు కొత్త నినాదం అందుకున్నారు. తాను గెలిస్తే.. ఆ పదవి ఖాయం అంటూ ప్రచారం చేస్తున్నారు. మేమే అధికారంలోకి వస్తున్నాం, ఎంపీ సీటును మాకిస్తే.. మీకో గ్యారెంటీ ఇస్తామంటున్నారు. ఇంతకీ ఏంటా గ్యారెంటీ..? నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అర్వింద్, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అభ్యర్ధులుగా తలపడుతున్నారు. పసుపు బోర్డు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంశాలను ప్రచారాస్త్రాలుగా చేసుకుని ఇందూరు పార్లమెంట్ పై తమ పార్టీ జెండా ఎగురవేయాలని ప్రధాన పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఐతే పసుపు, షుగర్ ఫ్యాక్టరీ ప్రచారం ఈసారి వర్కవుట్ అవుతుందో లేదో అని.. గ్రహించిన కాంగ్రెస్ – బీజేపీ పార్టీలు కొత్త వ్యుహాన్ని అనుసరిస్తున్నాయి. మేనిఫెస్టో హామిలకంటే.. మా అభ్యర్ధిని గెలిపిస్తే.. మీ జిల్లాకు కేంద్ర మంత్రి పదవి ఖాయమంటూ భావోద్వేగాలను ప్రచారాస్త్రాలుగా వాడుకుంటున్నాయి బీజేపీ, కాంగ్రెస్. పార్లమెంట్ స్థాయి నియోజకవర్గ సమావేశాలు, బహిరంగ సభల్లో ఆ రెండు పార్టీలు కేంద్ర మంత్రి పదవి జపమే చేస్తున్నాయి. మా అభ్యర్ధిని గెలిపిస్తే.. మీకు కేంద్ర మంత్రి పదవి గ్యారెంటీ అంటూ ప్రజలకు పదేపదే చెబుతున్నారు. సిట్టింగ్ ఎంపీ అర్వింద్ రెండో సారి గెలిస్తే కేంద్ర మంత్రి పదవి పక్కా.. అంటూ ఆయన మద్దతు దారులు ప్రచారం చేస్తున్నారట. ఇటు కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి పదవి ఖాయమంటున్నారట ఆ పార్టీ నేతలు. ఎలా అంటే కేంద్రంలో వచ్చేది మా ప్రభుత్వమే అంటూ ఎవరికి వారు గొప్పలు చెబుకుంటున్నారట.
నిజామాబాద్ సిట్టింగ్ స్థానం కాపాడుకోవాలని.. బీజేపీ పట్టుదలతో ఉంది. పసుపు బోర్డు ఏర్పాటు చేశాం, పసుపుకు క్వింటా 20వేల ధర పలుకుతోందని తెగ ప్రచారం చేసుకుంటున్నారు బీజేపీ నేతలు. ఈసారి గెలిపిస్తే చక్కెర ఫ్యాక్టరీ పున:ప్రారంభించేందుకు బాండ్ పేపర్ రాసిస్తానంటున్నారట బీజేపీ అభ్యర్ధి అర్వింద్. ఆ పార్టీ నేతలు ఓ అడుగు ముందుకేసి..ఈసారి గెలిస్తే కేంద్ర మంత్రి పదవి ఖాయమని చెప్పేస్తున్నారట. కాంగ్రెస్ అభ్యర్ధి గెలిస్తే నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానంటూ చెబుతున్న జీవన్ రెడ్డి, మూత పడ్డ చక్కర కర్మాగారాలను పున ప్రారంభించేందుకు కసరత్తు ప్రారంభించామని హామీలు కురిపించేస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేతలు జీవన్ రెడ్డి ఎంపీగా గెలిస్తే.. కేంద్రమంత్రి అవ్వడం గ్యారెంటీ అంటూ జనాలను మరింతగా కాక పడుతున్నారు. ఇలా ఎవరికి వారు కేంద్ర మంత్రి పదవిని అస్త్రంగా చేసుకుని ప్రచారంలో సరికొత్త ఎత్తుగడ అనుసరిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్ధి మాత్రం ప్రశ్నించే గొంతుక అవుతానంటూ పాత పల్లవి అందుకుంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎత్తుకున్న కొత్త పల్లవి ఏ మేరకు పనిచేస్తుంది..? కేంద్రమంత్రి పదవి అస్త్రం అభ్యర్ధులకు ప్లస్ అవుతుందా..? ప్రశ్నించే గొంతుక నినాదం పార్లమెంట్ మెట్లు ఎక్కిస్తుందా.? అనే ప్రశ్నలకు సమాధానం రాబోయే కాలము….ఎన్నికల ఫలితమే.