ఆ కాంగ్రెస్ ఎంపీ… బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేతో ఎందుకు భేటీ అయ్యారు? అధికారిక కార్యక్రమం అయ్యాక ప్రైవేట్ మీటింగ్ మతలబేంటి? ఎమ్మెల్యే కారు దిగేస్తారని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? ఎంపీ టూర్ కాంగ్రెస్‌లో కోల్డ్‌వార్‌ని బయటపెట్టిందా? ఎవరా ఎంపీ, ఎమ్మెల్యే? వాళ్ళ మీద రూమర్స్ ఎందుకు మొదలయ్యాయి? నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ అయ్యాక తొలిసారి గద్వాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి కూడా అటెండ్ అయ్యారు. ప్రోగ్రామ్ అయ్యాక…. మల్లు రవి ఎమ్మెల్యేతో కలిసి గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరిత ఇంటికి వెళ్ళారు. అయితే… కాంగ్రెస్ ఎంపీ మల్లు రవితో అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ కావడం, ఆయనతో పాటు సరిత ఇంటికి వెళ్ళడం చర్చనీయాంశంగా మారాయి . ఎమ్మెల్యే విజయుడు కాంగ్రెస్‌లో చేరేందుకే మల్లుతో భేటీ అయ్యారని, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి ఆదేశాలతోనే విజయుడు మల్లు రవితో మంతనాలు జరిపారని గద్వాల జిల్లాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం ఇటు కాంగ్రెస్‌లో కూడా చిచ్చు పెడుతోందట. మల్లు, విజయుడు భేటీపై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ వర్గం మండిపడుతోంది.అయితే దీనిపై స్పందించిన ఎమ్మెల్యే విజయుడు … ఎంపీని కలిసి తన నియోజకవర్గ అభివృద్ధికి సహకరించమని కోరానే తప్ప ఇందులో వేరే ఉద్దేశ్యాలు లేవన్నారు. ఎంపీ జోగులాంబ అమ్మవారి దర్శనానికి వెళ్తూ …తనను కూడా రమ్మని అడిగేసరికి ఆయన కారులో వెళ్లానని, మధ్యలో సరిత ఇంటి దగ్గర కారు ఆపి టీ తాగి వెళ్దామంటే, ఓకే చెప్పాను తప్ప ఇందులో రాజకీయాలు లేవన్నారు. కానీ… ఈ ఎపిసోడ్‌తో… ఇప్పటికే అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌కు, ఎంపీ మల్లు రవికి మధ్య నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు తారా స్థాయికి చేరినట్లు చెప్పుకుంటున్నారు.
అలంపూర్ లో సంపత్ కుమార్ వర్గం చేసిన ఘాటు విమర్శలే ఇందుకు నిదర్శనమని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ క్రమ శిక్షణ కమిటీ చైర్మనే స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో భేటీ కావడం , ఆయన్ను కార్లు కూర్చోబెట్టుకోని, కాంగ్రెస్ నేతల ఇళ్ళకు తీసుకుపోయి సన్మానాలు చేయడాన్ని ఎలాంటి క్రమశిక్షణ గా చూడాలని ప్రశ్నిస్తోంది సంపత్ కుమార్ వర్గం. అటు అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న ప్రచారం వెనక కూడా కొందరు కాంగ్రెస్ నేతల హస్తమే ఉన్నట్టు అనుమానిస్తున్నారట. మల్లు, సంపత్ వర్గాల మధ్య విభేదాల క్రమంలో ఈ ప్రచారం ప్రాధాన్యం సంతరించుకుంది. నియోజక వర్గంలో బీఆర్‌ఎస్ నాయకుల పనులను , పైరవీలను ఎంపీ మల్లు రవి చేస్తున్నారని, కొందరితో టచ్ లో ఉంటూ తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారని మండిపడుతోంది సంపత్ కుమార్ అండ్ టీం. ఈ క్రమంలోనే తాజాగా విజయుడితో మల్లు రవి భేటీ కావడం అలంపూర్ కాంగ్రెస్‌లో దుమారం రేపింది. నియోజక వర్గంలోకి ఎంపీ వస్తే ఎవరూ వెళ్లొద్దని తన అనుచరులకు అల్టిమేటం జారీ చేశారట సంపత్. ఎంపీకి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్స్ కూడా ఆయనే పెట్టించినట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద అలంపూర్ కాంగ్రెస్‌లో మారుతున్న పరిణామాలు చినికి చినికి గాలివానలా మారుతుందా…. లేక చిరు జల్లులతో ఆగిపోతుందా అన్నది చూడాలి.