NTV Telugu Site icon

Off The Record: అక్కడ బీఆర్ఎస్, బీజేపీలకు కాంగ్రెస్ షాక్ ఇవ్వనుందా..?

Otr Bjp

Otr Bjp

Off The Record: అక్కడ బీఆర్ఎస్, బీజేపీలకు కాంగ్రెస్‌ షాకులిస్తోందా? ఒకదానివెంట ఒకటిగా ఇంకా ఇవ్వడానికి స్కెచ్చేస్తోందా? ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేసిన ఓ బలమైన వర్గం మీద ఫ్రష్‌గా ఫోకస్‌ పెట్టిందా? ఆ వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తే…. ఏం జరుగుతుందో లోక్‌సభ ఎన్నికల్లో జ్ఞానోదయం అయిందా? ఇప్పుడు ఎక్కడ కొత్తగా ప్యాచ్‌ వర్క్‌ మొదలుపెట్టింది హస్తం పార్టీ? ఆ ఎఫెక్ట్‌ ప్రతిపక్షాల మీద ఎలా ఉండబోతోంది?

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేకంగా దృష్టి పెడుతోందట తెలంగాణ పీసీసీ. గత ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో…వచ్చే .. స్థానిక సంస్థల ఎలక్షన్స్‌లోనైనా.. సత్తా చాటాలన్న టార్గెట్‌ పెట్టుకుని వర్కౌట్‌ చేస్తున్నట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని బల్లగుద్ది చెప్పినా…ఆదిలాబాద్ ఎంపీ సీటు ఓడిపోవడంతో చాలా రోజులపాటు ఇంచార్జ్‌ మంత్రి సైతం జిల్లాకు రాలేదు. అంత షాకిచ్చాయట ఆ ఫలితాలు. దాన్నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ… పార్టీ పటిష్టతకు ఆదివాసీలు అవసరం అని గుర్తించారట కాంగ్రెస్‌ పెద్దలు. అందులో భాగంగానే ఆదివాసీ హక్కుల ఉద్యమాలకు సారధ్యం వహించిన నాటి నేతలపై కన్నేసినట్టు తెలిసింది. మాజీ ఎంపీ సోయం బాపూరావును చేర్చుకోవడం అందులో భాగమేనంటున్నారు. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగి, బీజేపీ తరపున ఒకసారి ఎంపీ అయి…గత ఎన్నికల్లో బోథ్‌ అసెంబ్లీ సీటుకు పోటీ చేసి ఓడిపోయిన సోయం… కాషాయ పార్టీకి బైబై చెప్పేసి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఓటమి తర్వాత కొన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉన్న బాపూరావ్‌… ఆ తర్వాత తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షపదవి నుంచి సైతం తప్పుకున్నారు. ఇక ఆయన సైలెంటైపోయారనుకుంటున్న టైంలో… సడన్‌గా… కాంగ్రెస్ ఆఫీస్‌లో కనిపించారు మాజీ ఎంపీ.

వాస్తవానికి సోయం బాపూరావ్‌ ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ.. ఇప్పుడు ఆ పార్టీ అధిష్టానం గట్టిగా వర్కౌట్‌ చేయడంతో… మారిపోయారని అంటున్నారు. ఆయనతో పాటు… బీఆర్ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సైతం హస్తం గూటికి చేరిపోయారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్వయంగా వీళ్ళని పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి జిల్లాలో ఆదివాసీల ఓట్లు ఎక్కువ. పైగా ఎస్టీ, ఎస్సీ రిజర్వు నియోజకవర్గాలు ఐదు ఉన్నాయి. మరో ఐదు జనరల్ సెగ్మెంట్స్‌ ఉన్నా… అన్నింటిలోఆదివాసీల ఓట్లే కీలకం. ఈ విషయంలో కాస్త ఆలస్యంగా రియలైజ్‌ అయిన కాంగ్రెస్‌ పెద్దలు రేపటి స్థానిక ఎన్నిక ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారట. సోయం, ఆత్రం రాక ఆదివాసీ వర్గాలను తమ వైపు తిప్పుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని పార్టీ పెద్దలు లెక్కలేస్తున్నారట. ఎస్టీ జాబితా నుంచి లంబడాలను తొలగించాలనే ఉద్యమానికి సారధ్యం వహించారు సోయం బాపురావ్. ఆ సమయంలో హక్కుల ఉద్యమంలో కలిసి పనిచేశారు ఆత్రం సక్కు. అయితే బీజేపీలో కొనసాగిన కాలంలో క్రమంగా ఆదివాసీ హక్కులపోరాట సమితికి దూరం అవుతూ వచ్చారు సోయం. తుడుం దెబ్బ సైతం వివిధ కారణాలతో కునారిల్లుతోంది. అయితే… ఉద్యమ నేత ఎవరంటే… సోయం బాపూరావేనన్న ఫీలింగ్‌ ఇప్పటికీ ఆదివాసీల్లో అలాగే ఉందని అంటున్నారు.

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు, జిల్లా ఇంచార్జ్‌ మంత్రి సీతక్క, గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆత్రం సుగుణ ఆదివాసీలే. ఇక ఇప్పుడు సోయం బాపూరావు, ఆత్రం సక్కు చేరికతో…. జిల్లాలోని ఆదివాసీ ముఖ్యులందర్నీ ఒక్క తాటి మీదికి తెచ్చినట్టు అవుతుందని, స్థానిక ఎన్నికల్లో సత్తా చూపించవచ్చని కాంగ్రెస్‌ పెద్దలు లెక్కలేస్తున్నట్టు తెలిసింది. జిల్లాలో ఆదివాసీ నాయకత్వం బలంగా లేకపోవడం, కేడర్‌కి దిశా నిర్దేశం చేయగల సత్తా ఉన్న వాళ్ళ లోపం వల్లే లోక్‌సభ సీటు గెలవ లేకపోయామన్నది కాంగ్రెస్‌ ముఖ్యల ఆలోచనగా చెప్పుకుంటున్నారు. అందుకే స్థానిక ఎన్నికల నాటికి ఆ లోపాలన్నిటినీ సరిదిద్దాలనుకుంటున్నారట. ఐకత్య లోపించడం ,క్షేత్ర స్థాయిలో సరిగ్గా పనిచేయకపోవడం వల్లనే సీటు కోల్పోయామనే బాధ జిల్లా ఇన్ఛార్జ్‌ మంత్రి సీతక్కకు సైతం ఉందంటున్నారు. మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కీలక నేతలను చేర్చుకోవాలని నిర్ణయంలో భాగంగానే ఇద్దరికి లైన్‌ క్లియరైనట్టు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు ఉమ్మడి జిల్లాలో వివిధ పార్టీల్లో కీలకంగా ఉన్న ఆదివాసీ నాయకుల మీద కూడా దృష్టి పెట్టిందట కాంగ్రెస్‌ అధిష్టానం. వీళ్ళ రాకతో పార్టీకి ఊపు వస్తుందా… లేక పాత నాయకులు నారాజ్‌ అవుతారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.