బీఆర్ఎస్-ధూంధాం! ఈ రెండు మాటలన్ని విడదీసి చూడలేం! ఉద్యమం కాలం నుంచి పదేళ్ల ప్రభుత్వం వరకు! పోరాటంలో అది ధూంధాం! సర్కారులో అది సాంస్కృతిక సారథి! ఇప్పుడా డప్పుచప్పుడు ఏమైంది? పాట ఎందుకు ఆగిపోయింది? గొంగడి కప్పుకుని గజ్జె కట్టేదెవరు? చిర్రా చిటికెన పుల్లతో డప్పు వాయించేదెవరు? ఎగిరి దుంకిన ఆ రోజులెక్కడ? సాయిచంద్ మృతి సరే! మరి రసమయి శ్రుతి ఏది? టీఆర్‌ఎస్ అయినా.. బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందినా, ఆ పార్టీ డప్పుచప్పుడుగా, వెన్నుదన్నుగా నిలబడ్డది ధూంధాం టీమే! రసమయి బాలకిషన్ నుంచి మొన్న చనిపోయిన సాయిచంద్ వరకు గులాబీ పార్టీ కోసం గోచీగొంగడి భుజాన వేసుకుని ఆడిన వారు చాలామందే ఉన్నారు. అసలు ఆ పార్టీ మీటింగ్ అంటనే ధూంధాం.. ఆటాపాటా అన్నట్టుగా ఉండేది. ఉద్యమంలో ఉన్నప్పుడు ఆ టీంకి ఉన్న క్రేజే వేరు. రాష్ట్రా సాధన నుంచి ఎన్నికల్లో గెలుపు వరకు అందులోని కళాకారులంతా కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వంలోకి వచ్చాక ఆ ధూంధాం కాస్తా సాంస్కృతిక సారథిగా మారిపోయింది. దానికి బాస్ రసమయి బాలకిషన్. ఆయనకి కేబినెట్ ర్యాంక్ హోదా! అయితే ఉద్యమం టైంలో పాటలన్నీ ప్రత్యేక రాష్ట్ర కాంక్షను చాటుతూ సాగాయి. స్టేట్ డివైడయ్యాక ఆ పాటలన్నీ కాలంచెల్లిపోయాయి. అందుకే ధూం ధాం గొంతుక నుంచి పునర్ నిర్మాణ పాటలు జాలువారాలని బాస్ కేసీఆర్ ఆదేశించడంతో పల్లవులు.. చరణాలన్నీ సర్కారువారి పాటగా మారాయి.
పథకాలు, వాటి వల్ల కలిగే లాభాలు, భవిష్యత్ చిత్రాలు.. ఇలా ధూంధాం పాట రూపం మార్చుకుంది. ఇందులో కళాకారులు ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగుల్లాంటివారు. వాళ్లకు నెలనెలా జీతాలు. అలవెన్సులు. వారికో ఆఫీసు. అలా పదేళ్లు సాంస్కృతిక సారథిలో కాళాకారులు బీఆర్ఎస్ కోసం ఆడిపాడి అలరించారు. ఎమ్మెల్యేగా ఉన్న రసమయి తాను పాటలు తగ్గించి తన వారసుడిగా సాయిచంద్‌కి మైక్ అందించారు. కేసీఆర్ కూడా సాయిచంద్ పాటను ఎంజాయ్ చేసేవారు. ఇలా పదేళ్లపాటు వారి ఆటాపాటా జోర్‌దార్‌గా సాగింది. జిల్లా మీటింగ్ అయినా గల్లీ మీటింగ్ అయినా, భారీ బహిరంగసభ అయినా సాయించందే ముందుండి నడిపేవారు. రసమయి నామ్‌కే వాస్తే ఉండేవారు. సిచ్యువేషన్ డిమాండుని బట్టి రసమయి గొంతెత్తేవారు. సాయిచంద్ యాక్టివ్‌నెస్ చూసి కేసీఆర్ ముచ్చటపడి.. ఆయనకో కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కూడా ఇచ్చారు. అలా ప్రభుత్వంలో పదేళ్లపాటు సారథి టీం ఆటను పాటను పార్టీకోసం ధారపోసింది. కట్ చేస్తే.. పార్టీకి లాయల్‌గా ఉండి, కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న సాయిచంద్ హఠాన్మరణం! ఈలోగా ఎన్నికలు రావడం.. పార్టీ అధికారాన్ని కోల్పోవడం.. ఇలాంటి పరిణామాల మధ్య ధూంధాం కళ తప్పింది. కళాకారులు తలోదిక్కు వెళ్లిపోయారు. ఒక్కొక్కరు పార్టీకి దూరమవుతూ వచ్చారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో వారి లోటు కొట్టొచ్చినట్టుగా కనిపిచింది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్.. ఏ కార్యక్రమం చేపట్టినా కళాకారుల ఆటపాట లేకుండానే పని కానిస్తోంది.
సరే, సాయిచంద్ అంటే లేరు. మరి ఇన్నాళ్లూ సారథిగా ఉన్న రసమయి ఎందుకు సైలెంట్ అయ్యారు? రెండుసార్లు మానకొండూరు ఎమ్మెల్యేగా గెలిచారు. పైగా బహిరంగ సభల్లో ఆయన క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. అలాంటి కళాకారుడు పార్టీకి ఇటు నియోజకవర్గ కార్యకర్తలకు అందుబాటులో ఎందుకు లేరు?అసలు తెలంగాణ ధూమ్ ధాం వ్యవస్థాపకుడే ఆయన. అలాంటి వ్యక్తి సైలెంట్ మోడ్‌లోకి ఎందుకు వెళ్లిపోయారు? అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో.. అదీ కేసీఆర్ పాల్గొన్న బహిరంగ సభల్లో తప్ప ప్రచారం మొత్తం పార్టీ నేతలతో టచ్ మీ నాట్ అన్నట్టుగానే ఉన్నారు. అంతర్గతంగా నిర్వహించే మీటింగ్‌లకు కూడా అటెండ్ అవ్వడం లేదట. మండల పార్టీ అధ్యక్షులు ఫోన్లు చేసినా స్పందించడం లేదట. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి తన ఆటాపాటతో ఊపు తేవాల్సిన సమయంలో రసమయి శ్రుతి కలపకపోవడానికి కారణమేంటి? అందరిలోనూ ఇవే సందేహాలు. పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచే రసమయి పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగింది. ఓ ఎంపీ ద్వారా కమల తీర్ధం పుచ్చుకుంటారని అప్పట్లో అనుకున్నారు. కానీ ఎందుకో చర్చలు ముందుకు జరగలేదు. కొంతకాలం వేచిచూద్దాం అనే ధోరణిలో రసమయి ఉన్నట్టు సమాచారం.