Off The Record: ఎన్నికల ఏడాదిలో గెలుపు గుర్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టబోతోందట వైసీపీ అధినాయకత్వం. ఎక్కడెక్కడ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చాలి? ఎవరెవరికి తిరిగి టిక్కెట్లివ్వాలన్న దిశగా ఆల్రెడీ కసరత్తు మొదలైందట. ఈ క్రమంలోనే.. కొందరు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు సైతం సెకండ్ ఛాయిస్ ఉండబోదంటున్నారు. కుల బలాల లెక్కల్ని చూసుకుని మరికొందరి సీట్లు మారే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. అలాంటి నియోజకవర్గాల్లో కర్నూలు లోక్‌సభ సీటు ఉన్నట్టు తెలిసింది. ఇక్కడ ఎంపీగా డా.సంజీవ్ కుమార్ వున్నారు. ఈసారి ఆయన్ని మార్చే యోచనలో ఉందట వైసీపీ అధినాయకత్వం. కర్నూల్ పార్లమెంట్ సీటుకు వాల్మీకి సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని బరిలో దింపితే ఎలా ఉంటుందన్న ఆలోచన పార్టీ నాయకత్వానికి వచ్చిందట. ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో వాల్మీకుల ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. మిగిలిన సెగ్మెంట్స్‌లో కూడా ఓట్లు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నాయి. అందుకే ఈసారి ఖచ్చితంగా కుల సమీకరణల్ని లెక్కలోకి తీసుకుని అభ్యర్థి ఎంపిక ఉంటుందంటున్నారు.
Read Also: Off The Record: పొంగులేటికి ఎందుకు క్లారిటీ రాలేదు? ఇంకెన్నాళ్లీ సాగదీత..!
వాల్మీకి సామాజిక వర్గానికి టిక్కెట్ ఇవ్వాలన్న నిర్ణయమే ఫైనల్ అయితే…ఎంపీ సీటుకు రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరామ్, కర్నూలు మేయర్ బివై రామయ్య పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ఇద్దరిలో ఎవరైతే మేలన్న దిశగా తర్జభర్జన పడుతున్నారట. మేయర్ రామయ్య వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షునిగా కూడా ఉన్నారు. జిల్లాలోని వాల్మీకులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ముందు ఆయన పేరే గట్టిగా వినిపిస్తోందట. మంత్రి గుమ్మనూరు జయరామ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నా…ఆయన్ని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. అవి మైనస్ అయ్యే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారట పార్టీ పెద్దలు. ఇద్దరూ పార్టీకి విధేయులే గనుక వ్యక్తిగత పరిస్థితుల్ని కూడా పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం ఉంటుందని అంటున్నారు. జయరామ్‌కు వివాదాస్పదుడన్న పేరు ఉంది. అదే టైంలో రామయ్య మేయర్‌గా ఎన్నికై నిండా రెండేళ్ళు కాలేదు. మరి… ఆయన్ని అంత త్వరగా ఆ పదవి నుంచి తప్పిస్తారా అన్న అనుమానాలు సైతం ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ ఇద్దరిలో ఒకర్ని ఎంపిక చేస్తారా? లేక ఎన్నికల నాటికి అదే సామాజికవర్గానికి చెందిన మరో నాయకుడి తెల మీదికి తెస్తారా అన్నది చూడాలి.