Off The Record: BRS బహిష్కరణ వేటు వేశాక పొలికల్ క్రాస్ రోడ్స్‌లో నిలబడ్డారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాజకీయ భవిష్యత్‌పై సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. అతి సర్వత్రా అన్నట్టు ఇప్పుడు అవసరానికి మించిన మంతనాలు ఆయన్ని కన్ఫ్యూజన్‌లోకి నెట్టేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. బీఆర్‌ఎస్ విషయంలో క్లారిటీ వచ్చిన వెంటనే…అనుచరులు, సహచరులు, అభిమానులతో మాట్లాడి తదుపరి కార్యాచరణ ఉంటుందని అన్నారు మాజీ ఎంపీ. అనుకున్నట్టుగానే చర్చోప చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేశాక కూడా ఎందుకు రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. అడుగు ముందుకేయకుండా ఏ శక్తులు అడ్డుకుంటున్నాయని ఆయన అనుచరులే మాట్లాడుకుంటున్న పరిస్థితి. పొంగులేటి తనను తాను ఎక్కువగా ఊహించుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందా అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి.
Read Also: Kishan Reddy: ప్రధాని టీ అమ్మిన రైల్వే స్టేషన్కు కిషన్ రెడ్డి.. వెళ్లింది అందుకోసమా..!
శ్రీనివాసరెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించారు ఆ పార్టీ నేతలు. ముఖ్యులు కొందరు ఆయన ఇంటికి వెళ్ళి మరీ మంతనాలు జరిపి వచ్చారు. కానీ..ఆ భేటీ ఆయన మీద ఏ ప్రభావం చూపలేకపోయింది. మరో వైపు మాజీ ఎంపీ అనుచరులు మాత్రం కాంగ్రెస్ లోకి వెళ్ళడం బెటరని చెబుతున్నారట. మరి కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఆహ్వానించిందా? లేదా? ఒకవేళ ఆహ్వానం అందినా ఆయనే ఇంకా తేల్చుకోలేకపోతున్నారా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయంలో రకరకాల విశ్లేషణలు ఉన్నాయి. ఓవైపు పొంగులేటితో పాటే బీఆర్‌ఎస్ నుంచి బహిష్కరణ వేటుపడ్డ జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లోకి వెళదామని కేడర్‌కు క్లారిటీ ఇచ్చేశారట. ఇంత కాలం అవుతున్నా మాజీ ఎంపీ మాత్రం ఎటూ తేల్చుకోలేక సతమతం అవడానికి కారణాలు ఏంటని వెదికే వారు సైతం ఉన్నారు. ఆయన నిజంగానే… ఇప్పటికీ గందరగోళంలో ఉన్నారా? లేక క్లారిటీ వచ్చాక కూడా కావాలనే గుంభనంగా ఉన్నారా అన్న చర్చలు సైతం జరుగుతున్నాయి. మొత్తంగా శ్రీనివాసరెడ్డి ఇప్పటికైనా తేల్చుతారా, ఇంకా నాన్చుతారా అన్న విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. అందుకే… ఇనుమును నానబెట్టడమంటే ఇదేనని సెటైర్లు పడుతున్నాయి.