Off The Record: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్‌ని మార్చబోతున్నారన్న వార్త పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. గడిచిన కొద్ది రోజులుగా మార్పు మాట వినిపిస్తున్నా… అంత కచ్చితమైన సమాచారం ఏదీ లేదు. కానీ… ఇప్పుడు మాత్రం మేటర్ వేరుగా ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. ఇటీవల జరిగిన సిడబ్ల్యుసి సమావేశం తర్వాత పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది అధిష్టానం. అందుకు అనుగుణంగా తెలంగాణలో కూడా త్వరలోనే మార్పులు చేర్పులు ఉంటాయని, కచ్చితంగా ఇన్ఛార్జ్‌ని మారుస్తారన్న చర్చ మొదలైంది. అలాగే ప్రక్షాళన కూడా భారీ స్థాయిలోనే ఉంటుందని చెప్పుకుంటున్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంపై హైకమాండ్ దృష్టి పెట్టిందని, అందుకు అనుగుణంగానే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌లు, ప్రధాన కార్యదర్శులను మార్చాలని విధాన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చాలామంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్‌మున్షీ వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్నారట. అధికార పార్టీకి రాష్ట్ర బాధ్యురాలిగా ఉన్న నేత వ్యవహరించే శైలి ఇది కాదన్నది వాళ్ళ అభిప్రాయం.
Read Also: Deputy CM Pawan Kalyan: ఓజీ.. ఓజీ కాదు.. శ్రీశ్రీ.. శ్రీశ్రీ.. అనండి..
పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయడంలో దీపా విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. ఎన్నికల టైంలో కొంతమందికి పట్టుబట్టి టికెట్లు ఇప్పించారని, ఇప్పుడు కూడా క్యాబినెట్ విస్తరణ అనగానే…. ఎప్పటికప్పుడు తనకు నచ్చిన కొన్ని పేర్లను తెర మీదికి తెస్తున్నారంటూ సీనియర్ లీడర్స్ నారాజ్‌గా ఉన్నట్టు సమాచారం. గతంలో ఇదే అంశాన్ని బాహాటంగానే చెప్పేశారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అధికార పార్టీని నడిపే తీరు ఇది కాదంటూ చురకలు కూడా అంటించారాయన. ఆ తర్వాత దీపా జగ్గారెడ్డికి ఫోన్ చేసి వివరాలు కనుక్కోవడం వేరే సంగతి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రయత్నించిన నాయకుల్ని పిలిచి మరీ పదవులు కట్టబెట్టడం వెనక ఉద్దేశం ఏంటన్న టాక్ నడుస్తోంది పార్టీలో. పటాన్‌చెరు నియోజకవర్గంలో నీలం మధును దీపానే ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఆ నియోజకవర్గంలో పార్టీ ఓటమికి కారణమైన వ్యక్తిని తీసుకువచ్చి ఎంపీ టికెట్ ఇవ్వడం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
Read Also: Telangana: జనవరి 3న ఉమెన్ టీచర్స్ డేగా సావిత్రి భాయి జయంతి..
పార్టీ కీలక పదవుల్లో ఉన్న ఒకరిద్దరు నేతలు కూడా ఈ వ్యవహారాన్ని అధిష్టానం దగ్గర ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు తెలిసింది. ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఓ ఎమ్మెల్సీ వ్యవహారాన్ని కూడా గుర్తు చేస్తూ… అలా నష్టం చేస్తున్న వాళ్ళందర్నీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ వెనకేసుకుని వస్తున్నారని చెప్పినట్టు సమాచారం. అదే సమయంలో అధిష్టానం కూడా పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారించడంతో… అతి త్వరలోనే మార్పు ఉండవచ్చంటున్నారు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే… సంక్రాంతి తర్వాత తెలంగాణకు కొత్త ఇన్ఛార్జ్ రావచ్చంటున్నాయి పార్టీ వర్గాలు. కొత్త నాయకుల రేస్‌లో చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో పార్టీకి పవర్ వచ్చి ఏడాది పూర్తయింది. ఇక ముందు ముందు పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయ పరచాల్సిన అవసరం చాలా ఉంది. ప్రభుత్వం చేసే పనుల్ని జనంలోకి తీసుకెళ్లడం, నాయకత్వాన్ని సమన్వయ పరచడం లాంటి అంశాలు చాలా కీలకం కాబట్టి సూపర్ సీనియర్స్‌నే తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్‌గా నియమించాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరి పేరు ఫైనల్ అవుతుందో చూడాలి మరి.