Off The Record: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో.. ఇక లోక్‌సభ ఎలక్షన్స్ మీద ఫోకస్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ముఖ్యంగా జాతీయ పార్టీలు ఈ విషయంలో ఓ అడుగు ముందున్నట్టు తెలిసింది. అలాగే ఆయా పార్టీల తరపున పోటీ చేయాలనుకుంటున్న కొందరు నేతలు కూడా పని మొదలుపెట్టినట్టు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి.. సంగారెడ్డిలో ఓడిపోయిన జగ్గారెడ్డి, విజయశాంతి లోక్‌సభ బరిలో ఉండాలనుకుంటున్నట్టు తెలిసింది. గతంలో మెదక్ లోక్‌సభ సీటు నుంచి ఎంపీగా గెలిచారు విజయశాంతి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా…. ఈసారి ఆమె మెదక్ లోక్‌సభ బరిలో దిగే ప్రయత్నాల్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అటు మల్కాజిగిరి అసెంబ్లీ సీటుకు పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హన్మంతరావు ఈసారి అదే లోక్‌సభ సీటు నుంచి పోటీ చేయవచ్చంటున్నారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన సీఎం అయినందున మైనంపల్లికి లైన్ క్లియర్ అయినట్టేనా? లేక మరో అభ్యర్థి ఎవరైనా తెరమీదికి వస్తారా అన్న చర్చ జరుగుతోంది.
భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. ఈ సీటు కోసం.. ఎల్బీనగర్లో ఓడిపోయిన మధు యాష్కీ, రేవంత్ సన్నిహితుడు చామల కిరణ్ పోటీలో ఉన్నట్టు సమాచారం. ఇక ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ లీడర్ మల్లు రవి నాగర్‌కర్నూల్ ఎంపీ సీటును ఆశిస్తున్నారట. అసలాయన అసెంబ్లీకే పోటీ చేయాలని అనుకున్నా… అధిష్టానం నో అనడంతో లోక్‌సభ మీదే ఆశలు పెట్టుకున్నట్టు తెలిసింది. అటు కాషాయ పార్టీలో సైతం ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్య నేతలు పోటీ చేసినా…అందులో ఎక్కువ మంది ఓడిపోయారు. గెలిచిన 8మందిలో పెద్దగా అనుభవం లేనివారే ఆరుగురు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సీనియర్స్‌కు లోక్‌సభ టిక్కెట్లపై చర్చ మొదలైందట. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీకి కొన్ని నియోజక వర్గాలలో పోటీ చేసేందుకు చెప్పుకోతగ్గ నేతలు కూడా లేరు. కానీ.. ఇప్పుడు పరిస్థితి మెరుగ్గానే ఉందంటున్నారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేస్తారని తెలిసింది. మహబూబ్‌నగర్‌లో డీకే అరుణకు ఛాన్స్ రావొచ్చంటున్నారు. అయితే ఈ సీటు తనకు కావాలని జితేందర్ రెడ్డి అడిగే అవకాశం ఉందట.
కరీంనగర్ అసెంబ్లీ సీటుకు పోటీ చేసి ఓడిపోయిన ఎంపీ బండి సంజయ్ ఈసారి కరీంనగర్ లోక్‌సభ సీటు కోసం పోటీపడే అవకాశం ఉన్నట్టు తెలిసింది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు కూడా అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. వారంతా లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి ఆయా సీట్లు ఆశిస్తున్నన్నట్టు చెబుతున్నాయి తెలంగాణ బీజేపీ వర్గాలు. ఇలా రెండు జాతీయ పార్టీల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అనేక మంది అభ్యర్థులు లోక్‌సభ సీట్లు ఆశిస్తున్నారు. ఆశించడం వరకు బాగానే ఉన్నా…. ఎమ్మెల్యేలుగా ఓడిపోయినవారికి తిరిగి ఎంపీ సీట్లు ఇస్తారా అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. వాళ్ళు ఆశిస్తున్న చోట వేరే బలమైన అభ్యర్థులు లేకుంటే వేరే సంగతి గానీ… పోటీకి వస్తే పరిస్థితులు మారవచ్చన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. చివరికి రేస్‌లో ఎవరు ఉంటారో చూడాలి.