Off The Record: సమకాలీన రాజకీయాల్లో మాట్లాడేవాడే మొనగాడు. పలుకుల కేసరికే.. ఓట్లు ఉసిళ్ల పుట్టలాగా వస్తాయి. మరి.. అలాంటప్పుడు నాలుక ఎంత జాగ్రత్తగా ఉండాలి? తూలనాడటంలో తులం అటుఇటైనా తేడా కొట్టేస్తది. గత లోక్ సభ ఎన్నికలప్పుడు ఆవేశంలో కేసీఆర్ ఒక్కమాట జారినందుకే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. హిందూగాళ్లు బొందుగాళ్లు అన్న ఒక్క డైలాగ్ రెండు సీట్లను ఉల్టాపల్టా చేసేసింది. నాడు కరీంనగర్‌లో ప్రచారం సందర్భంగా.. రామజన్మ భూమి ఏందివయా.. రావణ జన్మభూమి, శూర్పణఖ జన్మభూమి అంటూ ఉంటాయా.. అని స్పీచ్ దంచేశారు కేసీఆర్. ఆ ఒక్కమాటతో ఉత్తర తెలంగాణలో పార్టీకి గత్తర లేచినంత పనైంది. ఇంకేముంది.. కరీంనగర్‌తో పాటు నిజామాబాద్ కూడా బెడిసికొట్టింది. ఆ రెండు స్థానాలను బీజేపీ ఎగరేసుకుపోయింది. కరీంనగర్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్న వినోద్ కుమార్ నీరుగారి పోయారు. దాదాపు 90వేల మెజారిటీతో బండి సంజయ్ విజయభేరీ మోగించారు. భూకంపం పుట్టిస్తా.. అని కేసీఆర్ తరచుగా అంటుంటారు.
నిజమే…. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆయన కరీంనగర్‌లో పుట్టించిన భూంకపం.. దాని తాలూకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నిజామాబాద్‌లో చూపించాయి. కరడుగట్టిన హిందూవాదులున్న ఇందూరులో హిందూగాళ్లు బొందుగాళ్లు అన్న డైలాగ్ కారుకింద డైనమేట్‌లా పేలింది. నిజామాబాద్ లోక్ సభ సెగ్మెంటులో ధర్మపురి అర్వింద్ కవితపై 70వేల పైచిలుకు మెజారిటీతో కాషాయ జెండా ఎరగేశారు. సారు.. కారు.. పదహారు.. నినాదం ఒక్కమాటతో తేడా కొట్టేసింది. అదే డైలాగుని పట్టుకుని బీజేపీ గోదావరిని ఈది పడేసింది. ఇటు ఆంతరంగికుడు, ఆత్మీయుడు వినోద్ కుమార్, అటు కన్న కూతురు కవిత.. ఇద్దరూ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఆ డైలాగ్ ఎఫెక్ట్ అక్కడితో ఆగలేదు. 2020లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా ప్రభావం చూపించింది. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీలో సెగ రేపింది. గ్రేటర్ ఎన్నికల్లో హిందూవాదం మెయిన్ ఫ్యాక్టర్ కావడంతో.. ఇక లాభం లేదని నష్టనివారణ చర్యలకు దిగాల్సి వచ్చింది. మా రాముడు రాముడు కాదా.. మా భద్రాద్రి భద్రాద్రి కాదా అని అన్నారు. అందుకు మోడీ సమాధానం చెప్పిన తర్వాత హిందూ ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. అయినా సరే, డామేజీ కంట్రోల్ కాలేదు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సగానికి సగం సీట్లు కొట్టేసింది.
ఇప్పుడు కూడా అలాంటి తొట్రుపాటే సీటు కిందికి నీళ్లు తెస్తుందా అన్న చర్చ జరుగుతోంది పార్టీలో. చంద్రబాబు అరెస్టుపై తెలంగాణలో సెటిలైన సీమాంధ్రులు, టీడీపీ మద్దతుదారులు నిరసనలు తెలిపారు. దానిపై స్పందించిన కేటీఆర్ ఏపీ రాజకీయాలతో తెలంగాణకు ఏం సంబంధం అని మండిపడ్డారు. ఏం చేసుకోవాలన్నా… వెళ్లి ఏపీలో చేసుకోండని ఉచిత సలహా ఇచ్చారాయన. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు కేటీఆర్. అందుకు సమాధానంగా సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు ఘాటైన పోస్టులు పెట్టారు. నాడు ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా ఆందోళనలు జరగలేదా అని ప్రశ్నించారు. పైపెచ్చు టీఆర్‌ఎస్ జాతీయ పార్టీగా మారి బీఆర్‌ఎస్ అని పేరు పెట్టుకున్నాక కూడా ఇంకా ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అని అంటారెందుకంటూ లాజిక్‌లు లాగారు. పరిస్థితి చేయి దాటి పోతోందని గ్రహించిన కారు పార్టీ పెద్దలు నష్ట నివారణగా ఇంకో లైన్ అందుకోవాల్సి వచ్చింది. కేటీఆర్ స్వయంగా ఎన్ని వివరణలు ఇచ్చినా.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందన్న విశ్లేషణలున్నాయి. అదే క్రమంలో ఏపీ రోడ్లను, తెలంగాణ రోడ్లను పోలుస్తూ చాలా సభల్లో కేసీఆర్ డామేజ్ కంట్రోల్ చేయాల్సి వస్తోంది. జగన్ పాలనని విమర్శిస్తే టీడీపీ అభిమానులు చల్లబడతారని.. ఈ లైన్ అందుకున్నారట కేసీఆర్. అంతమాత్రాన జగన్ సపోర్టర్స్ ఈ మాటల్ని ఉపేక్షిస్తారనుకుంటే పొరపాటే. ఏది ఏమైనా… కీలక స్థానంలో ఉన్న నేతలు ఒక్క మాట బ్యాలెన్స్ తప్పినా… పరిణామాలు ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవాలని బీఆర్‌ఎస్ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ప్యాచ్ వర్క్ ఎంత వరకు పనిచేస్తుందో చూడాలి.