Off The Record: పిల్లి సుభాష్ చంద్రబోస్.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి, ప్రస్తుతం వైసీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్. పార్టీ పరంగా కీలకమైన పదవిలో ఉన్నా… ఈ మధ్యకాలంలో ఆయన తీరు రొటీన్‌కు భిన్నంగా ఉందట. ఇన్నాళ్ళు ఏ విషయాన్నయినా.. నెమ్మదిగా, సున్నితంగా డీల్ చేసే బోస్..ఇప్పుడు కొత్త పంధా ఎంచుకున్నారనే ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి, 2019లో మండపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారాయన. గత ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి చెల్లుబోయిన వేణుకు అవకాశం ఇచ్చింది పార్టీ. అయితే ఈసారి అక్కడ నుంచి తన కుమారుడు సూర్యప్రకాష్‌ని బరిలో దింపాలన్న ఆలోచనతో కొత్త రాజకీయానికి తెరదీశారట బోస్.. ప్రత్యక్షంగా ఎక్కడా ఆయన చెప్పనప్పటికీ అనుచరులతో ఆత్మీయ సమావేశాలు పెట్టించేశారు. ఆ మీటింగ్‌లో ఎప్పుడూ లేనిది.. మంత్రి వేణు పై ఫైర్ అయిపోయారు బోస్ అనుచరులు. వలస నేతలకు అవకాశం ఇవ్వకూడదని మనసులో మాటను అధిష్టానానానికి డైరెక్ట్‌గానే చేరవేశారు. ఇంత జరుగుతున్నా బోస్ మాత్రం రామచంద్రపురంలో ఏమవుతోందో తనకు తెలియదని, తెలుసుకున్నాక మాట్లాడతానని సింపుల్ గా అంటున్నారట. కొంతకాలంగా పిల్లికి, చెల్లుబోయిన కి మధ్య నియోజకవర్గంలో ఆధిపత్య పోరు నడుస్తోంది. పిల్లి అనుచరులను పూర్తిగా పక్కన పెట్టేశారు మంత్రి. దాంతో ఇక తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారట బోస్.
గతంలో యానాం మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ కాకినాడలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎవరో తొలగించారు. దాని వెనక సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి హస్తం ఉందన్నది మల్లాడి వర్గం ఆరోపణ. యానాం ఎన్నికల సమయం నుంచి మల్లాడికి, ద్వారంపూడికి గ్యాప్ వచ్చింది. అంతకు ముందు జడ్పీ సమావేశంలో సుభాష్ చంద్రబోస్ ,ద్వారంపూడి కొట్టుకున్నంత పని చేశారు.. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య కూడా పెద్దగా మాటల్లేవు. ఇటీవలి బీసీల సమావేశంలో ఆ పాత వ్యవహారాలను తెర మీదకు తీసుకువచ్చారు పిల్లి. మల్లాడి ప్లెక్సీలు చింపేయడం మన జాతికి జరిగిన అవమానమని, కాకినాడలో వాటిని చూసి కొందరు తట్టుకోలేకపోయారని, బీసీలు అంత చేతకాని వారు కాదని, ఇటువంటి చేష్టలు మళ్లీ చేస్తే అంతకు పది రెట్లు స్పందిస్తామని అటాక్ చేసేశారు… అటు మంత్రి విశ్వరూప్ కి, పిల్లికి కూడా పంచాయతీ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.. అమలాపురం మున్సిపల్ ఎన్నికల సమయంలో కుడిపూడి చిట్టబ్బాయి కోడలుని విశ్వరూప్ కావాలని ఓడించారని, అప్పటినుంచి ఇద్దరికీ చెడిందనే టాక్ ఉంది. మొత్తానికి పిల్లి సుభాష్‌చంద్రబోస్ పార్టీ పెద్దలకు… తన మనసులో మాటను రీ సౌండ్ వచ్చేలానే చెప్పారు. ఇప్పటివరకు విధేయతతో ఉన్నప్పటికీ… చేతగానివాడిలా పక్కన పెట్టేస్తే ఏం చేయాలో తనకు తెలుసని సంకేతాలు ఇచ్చేశారన్నది లోకల్ టాక్. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న పిల్లి ఇప్పుడు సొంత నియోజకవర్గంలో సమావేశాలు, పార్టీలో ప్రత్యర్థులపై విమర్శలతో హీట్ పెంచేశారు. మరి వైసీపీ పెద్దలు పిల్లికి ఏ విధంగా గంట కట్టి దారికి తెచ్చుకుంటారో చూడాలి.