Off The Record: ఏపీ రాజకీయాల్లో పవన్, పేర్ని నాని ఎపిసోడ్ ఎప్పుడూ ఆసక్తికరమే. పవన్… ప్రభుత్వంపై చేసే ప్రతి విమర్శకు పేర్ని నాని కౌంటర్ ఇస్తారు. మంత్రిగా ఉన్నా లేకున్నా నాని మాత్రం పవన్ పైమాటల దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు. పార్టీపరంగా పవన్ విమర్శలకు కౌంటర్ ఇవ్వటం పేర్నినాని కీలక బాద్యతల్లో ఒకటిగా మారిపోయింది. ఏడాదిగా పవన్, పేర్ని నాని మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పవన్ చెప్పు చూపించి వైసీపీ నేతలను కొడతా అనటం ఆ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. చివరికి రెండు చెప్పులూ చూపించి పేర్ని నానినే తిరిగి గట్టిగా కౌంటర్ ఇచ్చేశారు. అప్పటికే నాని మీద రుసరుసలాడుతున్న బందర్ జనసైనికులు సైతం చెప్పులెత్తేశారు. పేర్ని నాని ఫొటోకి చెప్పుల దండలు వేయటం మొదలు సోషల్ మీడియాలో పోస్టులు, మీమ్స్‌తో పేర్ని అవినీతి అంటూ క్యాంపైన్ నడిపిస్తున్న పరిస్థితి ఉంది.
పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని విమర్శలు చేయటం ఇదే మొదటిసారి కాదు. నాలుగేళ్ళుగా ఎపిసోడ్ నడుస్తూనే ఉంది. పవన్ చేసిన ప్రతి విమర్శకు పేర్ని కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. పవన్ మాట్లాడిన ప్రతిసారి పేర్ని ఏం కౌంటర్ ఇస్తారా అనేంత ఆసక్తిగా వీరి ఎపిసోడ్ మారింది. ఇక పవన్ కూడా జగన్, ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే పేర్నిని కూడా ఎక్కడా వదల్లేదు. జనసేన ఆవిర్భావ సభ కూడా బందరులో పెట్టారు పవన్. పలు సందర్భాల్లో బందరు వెళ్ళి నానిపై విమర్శలు చేశారు పవన్. పవన్ పై వైసీపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, నేతలు కూడా విమర్శలు చేసినా అవి పేర్ని నాని స్థాయిలో ఉండవనేది పార్టీలో ఇంటర్నల్ టాక్. దీంతో కాపు సామాజిక వర్గంలో పేర్ని నానిపై కొంత మేర వ్యతిరేకత పెరిగిందన్నది పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ.
పేర్ని నాని ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీపట్నంలో సుమారు 65వేలదాకా కాపు ఓటు బ్యాంకు ఉంది. దీంతో ఆ వర్గం ఓట్లలో వ్యతిరేకత పెరిగితే ఆ ప్రభావంపై ఎన్నికల ఫలితంపై పడుతుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. 1999 నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా మచిలీపట్నం నుంచి పోటీ చేసిన పేర్ని నాని మూడు సార్లు గెలిచారు. 1999, 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. నియోజకవర్గంలో 2 లక్షల వరకు ఓటర్లు ఉండగా కాపులు 65 వేలు, గౌడ 30వేలు, పల్లెకారులు 18వేలు, యాదవ 15 వేలు, ఎస్సీఎస్టీ 40 వేల వరకు ఓటింగ్ ఉంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి దాదాపు 34 వేల ఓట్లు రావడంతో టీడీపీ ఓడిపోయింది. నాడు ఓట్ల చీలికతో నాని గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయగా పేర్ని నాని 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన విడివిడిగా పోటీ చేస్తే జనసేనకు 18 వేల ఓట్లు వచ్చాయి. దీంతో పేర్ని నాని టీడీపీపై 5వేల 932 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు ఇదే ఆసక్తికరంగా మారింది. పేర్నిని టార్గెట్ చేస్తున్న జనసైనికుల్లో ఎక్కువ మంది కాపులే. మరి 2009 పునరావృతం అవుతుందా? 2014 ఫలితాలు వస్తాయా అన్నది ఆసక్తికరంగా ఉంది.
పేర్ని నాని మాత్రం మచిలీపట్నం కేంద్రంగా జగన్ సర్కారు హయాంలో జరిగిన అభివృధ్ధి పనులు, సంక్షేమ పథకాలే అండగా వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని ధీమాగా చెబుతున్నారట. బీసీ, ఎస్సీ ఎస్టీల ఓటు బ్యాంకుతో పాటు పథకాలు తీసుకుంటున్న లబ్దిదారులు, కాపు సామాజిక వర్గం నుంచి స్వతహాగా తనకు పడే ఓటు బ్యాంకుతో వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని పేర్ని తన సన్నిహితులతో అంటున్నారట. పవన్, తాను ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులమైనా పార్టీల పరంగా, సిద్ధాంతాల పరంగా, తాను విమర్శలు చేస్తున్నానే తప్ప వ్యక్తిగత విమర్శలు చేయడం లేదని సన్నిహితులతో అంటున్నారట. తాను పోటీకి దూరంగా ఉండి తన కుమారుడు కిట్టును బరిలోకి దింపాలని భావిస్తున్న పేర్ని నాని తన అనుభవాన్ని కుమారుడు, పార్టీ గెలుపుకు వచ్చే ఎన్నికల్లోఉపయోగించటానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారనేది బందర్ వాయిస్.