Off The Record: సింహపురి పాలిటిక్స్ ఎప్పటికప్పుడు హాట్ హాట్‌గా రగులుతూనే ఉంటాయి. ప్రతిపక్షం తమలపాకుతో ఒకటంటే… అధికార పార్టీ తలుపు చెక్కతో నాలుగు అనడం ఇక్కడ రివాజుగా ఉండేది. అయితే…ఇప్పుడా పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ప్రత్యేకించి టీడీపీ ఈసారి అధికారంలోకి వచ్చాక మొత్తం తేడాగా కనిపిస్తోందని అంటున్నారు. ఏం జరుగుతున్నా… మాకెందుకులేబ్బా.. ఈ యవ్వారాలు, కామ్‌గా పనేదో మేం చేసుకుని అమరావతికి వెళ్ళిపోతున్నారట జిల్లాకు చెందిన మంత్రులు. దీంతో వైసీపీ దూకుడు స్టేట్‌మెంట్స్‌కు కౌంటర్స్ వేసే వాళ్ళే కరవయ్యారంటున్నారు లోకల్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్ర కేబినెట్‌లో నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా….. జిల్లాకు వచ్చేసరికి తమ నియోజకవర్గం తప్ప… మిగతా వ్యవహారాల జోలికి పోవడం లేదట. వైసీపీ వైపు నుంచి మాటల తూటాలు పేలుతున్నా… వీళ్ళు మాత్రం, పేల్చుకుంటే పేల్చుకోనివ్వండయ్యా…. ఆ సౌండ్స్ ఏవీ మనకు వినపడటం లేదనుకోండయ్యా అంటున్నారట. ఆనం అప్పుడప్పుటూ… జగన్ టార్గెట్‌గా కాస్త సౌండ్ చేస్తున్నా… జిల్లా రాజకీయాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదని ఇక్కడి టీడీపీ నాయకులే మాట్లాడుకుంటున్న పరిస్థితి.
Read Also: Off The Record: పోసానికి క్షవరం అయ్యాకగాని వివరం తెలిసి రాలేదా?
జిల్లా వైసీపీ నేతలకి కౌంటర్స్ ఎందుకివ్వలేకపోతున్నారని అంటే…. వాళ్ళ నోటికేడపోతామబ్బా…. అని సన్నిహితులతో అంటున్నట్టు సమాచారం. పైగా… మరో యాంగిల్‌లో తనది జగన్, సజ్జల స్థాయి అని ఫీలవుతూ వాళ్ళ మాటలకు మాత్రమే రియాక్ట్ అవడం నెల్లూరు టీడీపీ నాయకులకు మింగుడుపడటం లేదట. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇటీవల ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలే చేశారు. కానీ… వాటి మీద జిల్లా టీడీపీ వైపు నుంచి ఏ ఒక్కరూ స్పందించలేదు. వాళ్ళ వైఖరి మన దాకా వస్తే చూద్దాంలే అన్నట్టుగా ఉందన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. ఆనం రామనారాయణరెడ్డి ఉంటే… అమరావతి, లేదంటే ఆత్మకూరు నియోజకవర్గంలోని తన గెస్ట్ హౌస్‌కే పరిమితం అవుతున్నారట. ఇక రాజధాని అమరావతి వ్యవహారాల్లో కీలకంగా ఉన్న మరో మంత్రి పొంగూరు నారాయణ కూడా నెల్లూరు సిటీ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవుతున్నారుతప్ప జిల్లా మొత్తం నాదని అనుకోవడం లేదంటున్నారు. ఇక్కడి వైసీపీ నాయకులు ఏం మాట్లాడినా… దాంతో నాకేం సంబంధం లేదన్నట్టుగా ఉంటున్నారట నారాయణ. వారానికి రెండు రోజులు నెల్లూరులో ఉంటున్నా…. పక్క నియోజకవర్గాల వైపు కూడా తొంగి చూడడం లేదన్న విమర్శలున్నాయి. జిల్లాలోని వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని తూర్పారబడుతున్నా…. నోరు ఉండే మంత్రులు స్పందిస్తారులే… మనకెందుకు ఆ రొచ్చు అన్నట్టుగా ఆయన వ్యవహారం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వాటికి సొంతగా కృష్ణారెడ్డి మాత్రమే కౌంటర్ ఇస్తున్నారు తప్ప.. టిడిపి జిల్లా అధ్యక్షుడుగానీ మంత్రులుగానీ.. ఇతర నాయకులు ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేసేందుకు రౌడీ షీటర్స్ స్కెచ్ వేశారన్న వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాని విషయంలో కర్టసీకి కూడా జిల్లా మంత్రులు స్పందించలేదు.
Read Also: Waze App: ట్రాఫిక్ చలాన్ నుంచి తప్పించుకోవాలా? ఈ ఒక్క యాప్ఇ న్‌స్టాల్ చేసుకోండి..
ఆ సందర్భంలో మంత్రి నారాయణ నెల్లూరులోనే ఉన్నారు. అయినా నో రియాక్షన్. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మినహా ఎవ్వరూ కోటంరెడ్డి వ్యవహారంలో మాట్లాడలేదు. అలాగే… గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు అంటూ… నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు తప్ప… మంత్రులుగా ఉన్న వాళ్ళిద్దరూ ఇక్కడ మాట్లాడటం లేదు. అందుకు కారణాలపై మాత్రం ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది జిల్లాలో. వైసీపీ వాళ్ళ నోట్లో నోరు పెట్టడం, వాళ్ళతో అనిపించుకోవడం ఎందుకన్న వైఖరితో ఇద్దరు మంత్రులు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో అధికారం ఉండి కూడా నెల్లూరులో వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చే వాళ్ళు కరవయ్యారంటూ తెగ ఫీలవుతున్నారట జిల్లా టీడీపీ కార్యకర్తలు.