Off The Record: మంత్రి మాటంటే ఆ ఉన్నతాధికారికి లెక్కేలేదు. ఆమెకు తెలియకుండానే ఆ శాఖలో పనులన్నీ జరిగిపోతున్నాయట. మంత్రి సిఫారసు లేఖలకు కూడా కనీస విలువ ఇవ్వడం లేదట సదరు అధికారి. తెలంగాణ అటవీ శాఖ మంత్రి వర్సెస్ ఆ శాఖ అతి ముఖ్యమైన అధికారిగా సాగుతున్న పంచాయితీ చివరికి ముఖ్యమంత్రి కోర్ట్‌కు చేరినట్టు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖకు తెలియకుండానే ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఈ విషయాన్ని ఇప్పటికే కొండా సురేఖ సీఎం దృష్టికి తీసుకువెళ్ళినట్టు చెప్పుకుంటున్నారు. అయినా ఆ అధికారిలో మార్పు రాకపోగా సిబ్బంది బదిలీల విషయంలోనూ ఇష్టానుసారంగా వ్యవహరించారని, మంత్రి సంతకం చేసిన జీవోను సైతం పక్కన బెట్టి 2018 జీవో ఆధారంగా ఉద్యోగులను బదిలీ చేసినట్టు సమాచారం. ఈ ట్రాన్స్‌ఫర్స్‌లో కూడా భారీగా అవినీతి జరిగిందన్న ఫిర్యాదులు వస్తున్నాయట. మంత్రి వర్సెస్ ఆఫీసర్‌గా జరుగుతున్న పంచాయితీపై అటవీశాఖలో పెద్ద చర్చే జరుగుతోందని అంటున్నాయి సచివాలయ వర్గాలు.
Read Also: INDIA Bloc: ఇండియా కూటమి కీలక నిర్ణయం.. ఉభయ సభల్లో రగడ తప్పదా?
ఆ అటవీ శాఖ ఉన్నతాధికారికి సచివాలయంలోని ఓ ముఖ్య అధికారి అండదండలు ఉన్నాయని, ఇప్పటికే రకరకాల ఫిర్యాదులు ఉన్నా.. చర్యలు తీసుకోకుండా సచివాలయంలోని ఆ పెద్ద అడ్డుపడుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ తలబిరుసు అటవీశాఖ ఉన్నతాధికారి స్థానంలో వేరొకరిని నియమించాలని మంత్రి సురేఖ సిఎంకు విన్నవించినా.. అతనికంటే సమర్ధులు అస్సలు లేరంటూ సచివాలయంలోని పెద్ద.. సిఎంను సైతం పక్కదారి పట్టిస్తున్నారన్నది అధికార వర్గాల్లో నడుస్తున్న టాక్. రిటైర్‌మెంట్‌కు దగ్గర్లో ఉన్న ఆ అటవీశాఖ ఆఫీసర్.. నేను ఉన్నన్ని రోజులు నేను చెప్పిందే ఫైనల్ అంటూ కింది స్థాయి ఉద్యోగులు, అధికారులకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. ఆయన తన మార్క్ కోసం 2018లో జారీ చేసిన జీవో ఆధారంగా ఉద్యోగులను బదిలీ చేయడంతో ప్రస్తుతం వాళ్ళంతా కోర్ట్‌కు వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. పాత జీవో ప్రకారం బదిలీలు వద్దని మంత్రితో పాటు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా చెప్పినా పట్టించుకోకుండా.. పాత జీవో 18 ఆధారంగానే ట్రాన్స్‌ఫర్స్ చేసేశారట.
Read Also: Bandi Saroj Kumar: చిరంజీవిని చిరంజీవి అనే పిలుస్తా.. గారు అని పిలవను!
ఉద్యోగుల పనితీరు, గ్రేడింగ్ ఆధారంగా ట్రాన్స్‌ఫర్స్ ఉండాలన్న నిబంధనను ఏ మాత్రం పట్టించుకోకుండా ఇష్టానుసారం జరిగిన వ్యవహారాల్లో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారినట్టు ఉద్యోగ వర్గాలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. గ్రేడింగ్ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు జరిగిన విషయాన్ని ఆలస్యంగా తెలుసుకుని అవాక్కయ్యారట మంత్రి. తాము పాత జీవోకు సవరణలు చేసి జారీ చేసిన దాన్ని కాదని సదరు ఉన్నతాధికారి ఇలా వ్యవహారించడంపై మంత్రి సీరియస్ అయినట్టుగా తెలిసింది. దీంతో పాటు ఇద్దరు, ముగ్గురు అటవీశాఖ అధికారులను డిప్యూటేషన్‌పై పంపించాలని ఆదేశించినా ఆయన ఇప్పటివరకు మంత్రి మాటను పట్టించుకోలేదని సమాచారం. ఈ పరిణామాలతో మంత్రి ఆ ఉన్నతాధికారిపై సిఎం రేవంత్‌కు ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న కొండా సురేఖ… ప్రభుత్వానికి ఇబ్బంది రాకూడదని సర్దుకుపోతుంటే… ఆ ఉన్నతాధికారి అతి చేస్తూ మంత్రి సహనానికి పరీక్ష పెడుతున్నారన్న చర్చ జరుగుతోంది అటవీశాఖలో. ఈ వివాదాన్ని సీఎం ఎలా పరిష్కరిస్తారోనని చూస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు.