Off The Record: ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఇన్నాళ్ళు వర్గ విబేధాలకు కేరాఫ్‌గా ఉన్న హిందూపురం విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది వైసీపీ అధినాయకత్వం. సీఎం జగన్ ఆశీస్సులతో నిన్నటిదాకా హవా నడిపిన ఎమ్మెల్సీ ఇక్బాల్ కు చెక్ పడింది. అంతకు మించి ఇప్పటిదాకా అస్సలు ఎవ్వరూ ఊహించని, చర్చలో కూడా లేని మహిళకు ఏకంగా నియోజకవర్గం పగ్గాలు ఇచ్చింది పార్టీ నాయకత్వం. దీంతో ఇక్బాల్ వర్గం ఉలిక్కిపడగా వ్యతిరేక వర్గీయులు మాత్రం పండగ చేసుకుంటున్నారట. ఇంకా చెప్పాలంటే దసరా, దీపావళి కలిపి చేసుకున్నంత హ్యాపీగా ఉన్నారట.
వైసీపీకి మొదటి నుంచి కొరకరాని కొయ్యగా మారింది హిందూపురం నియోజకవర్గం. 2019 ఎన్నికలకు ముందు ఇక్కడ నవీన్ నిశ్చల్ మాత్రమే లీడర్ గా ఉండే వారు. సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు స్థానికంగా ఆయనే సరైన అభ్యర్థి అనుకున్నారు అంతా. తర్వాత…. మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ రాజకీయాల్లోకి రావడం, ఆయనకు హిందూపురం వైసీపీ టికెట్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. దీంతో స్థానిక వైసీపీలో వార్ మొదలైంది. స్థానికులం…. మమ్మల్ని కాదని అసలు కర్నూలు జిల్లా నుంచి ఎన్నికలకు ముందు ఒక నాయకుడిని తీసుకొచ్చి.. రుద్దితే ఎలాగంటూ రివర్స్ అయ్యారు హిందూపురం వైసీపీ లీడర్స్. ఫలితంగా గత ఎన్నికల్లో బాలకృష్ణ ముందుకంటే ఎక్కువ మెజార్టీతో గెలిచారు.
ఎన్నికల్లో ఓడినా… ఇక్బాల్‌కు హిందూపురం వైసీపీ బాధ్యతలతో పాటు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చింది పార్టీ నాయకత్వం. తర్వాత నవీన్ నిశ్చల్ తో పాటు ఇంకా రెండు వ్యతిరేక గ్రూపులు ఏర్పడ్డాయి.అదంతా చినికి చినికి గాలి వానలా మారి కొట్టుకునే దాకా వెళ్ళింది. ఈ ఆధిపత్య పోరు.. పర్సనల్ వ్యవహారాలతో చౌళూరు రామకృష్ణారెడ్డి హత్య జరిగింది. ఇందులో ఇక్బాల్ అనుచరులు ఉన్నారని ప్రచారమవడంతో అధిష్టానం హిందూపురం పై ఫోకస్ చేసింది. ఇదే సమయంలో ఇక్బాల్ ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని.. వైసీపీలోని అన్ని గ్రూపులు మూకుమ్మడిగా చెబుతూ వచ్చాయి. దీంతో అధిష్టానం ప్రత్యామ్నాయ మార్గం వైపు చూడాల్సి వచ్చిందట. ఈ క్రమంలోనే తెర మీదికి వచ్చారు దీపిక. హిందూపురం వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉన్న వేణుగోపాల్ రెడ్డి భార్య దీపిక. ఆమెది కురుబ సామాజికవర్గం కాగా…భర్త రెడ్డి.. దీంతో రెండు కులాలకు దగ్గర కావచ్చన్న ప్లాన్‌తో దీపికకు నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చేసిందట వైసీపీ అధినాయకత్వం. ఈ మార్పులో హిందూపురంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ వ్యతిరేక వర్గీయులు ఆనందంగా ఉన్నారట.
అసలు ఇక్బాల్‌ను హిందూపురం ఇన్ఛార్జ్‌గా ఎందుకు తప్పించారంటే.. అందుకు స్వయంకృతమే కారణమంటున్నాయి పార్టీ వర్గాలు. మొదటి నుంచి సీఎం జగన్ ఇక్బాల్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన్ని ఎంత మంది వ్యతిరేకించినా అధిష్టానం సపోర్ట్ చేస్తూ వచ్చింది. అంత చేసినా… అన్ని వర్గాలను కలుపుకుని పోవడంలో ఎమ్మెల్సీ విఫలమయ్యారన్న ప్రచారం ఉంది. ఆయన రాజకీయ నాయకుడిగా కంటే… పోలీస్ ఉన్నతాధికారిగానే వ్యవహరిస్తుంటారన్నది లోకల్ టాక్. రాజకీయాలు వేరు.. పోలీస్ శాఖ వేరు అన్నది ఆలస్యంగా తెలుసుకున్నా….అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయిందట. ఇక హిందూపురం పాలిటిక్స్ పరంగా ఇక్బాల్ శకం ముగియడంతో… ఇప్పుడు అందరి చూపు కురుబ దీపిక మీదికి మళ్ళింది. హఠాత్తుగా ఆమె తెరమీదికి రావడానికి సామాజిక సమీకరణలు ఒక కారణం అయితే…కుటుంబసభ్యులకు అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయట. మిగతా నేతలు ఇక్బాల్ బెడద పోయిందని హ్యాపీగా ఉన్నా… తమకు పదవి రాలేదన్న బాధతో ఉన్నారట. నవీన్ నిశ్చల్, చౌళూరు రామకృష్ణారెడ్డి సోదరి వంటి వారు ఆ లిస్ట్‌లో ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడు అధిష్టానం వాళ్ళందర్నీ ఎలా సంతృప్తి పరిచి దీపికకు సహకరించేలా చేస్తుందన్నది చూడాలి. మొత్తంగా…హిందూపురం వైసీపీలో నాలుగున్నరేళ్ళ నుంచి నలుగుతున్న వివాదానికి అధిష్టానం చెక్ పెట్టగలిగింది. సినీ నటుడు బాలకృష్ణ మీద అభ్యర్థిని సిద్ధం చేసింది. పార్టీలోని అన్ని వర్గాలను కలుపుకునిపోయి బాలయ్యను ఢీ కొట్టడమే ఇప్పుడు దీపిక ముందున్న అసలు సవాల్.