Off The Record: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ పాత, కొత్త నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోందా..? అంటే.. పార్టీ వర్గాల నుంచి సమాధానం అవుననే వస్తోందట. లోకేష్ పాదయాత్ర జిల్లాలో ఎంటరవుతున్న టైంలో అధికారికంగా ఇంకా పసుపు కండువా కప్పుకోని కొత్త నేతల హడావుడి బాగా పెరిగిపోయిందట. ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డిలకు పార్టీ పరంగా ప్రాధాన్యత ఎక్కువైనట్టు చెప్పుకుంటున్నారు. మామూలుగా అయితే… చాలా కాలంగా ఉంటున్న నేతలు పాదయాత్ర ఏర్పాట్లు చూసుకోవాలి. కానీ ప్రస్తుతం అందుకు రివర్స్‌లో ఉన్నాయట జరుగుతున్న పరిణామాలు. పాత వాళ్ళకు బదులు కొత్త వారు లీడ్ తీసుకోవడంపై ఇప్పుడు నెల్లూరు టీడీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Read Also: Off The Record: తెలంగాణ పెద్దల సభలో ఆ రెండు ఖాళీల భర్తీ జరగదా.?
ఇంకా పార్టీలో చేరని ఆనం, కోటంరెడ్డిలకు అంతటి ప్రాధాన్యత ఇవ్వడం.. వాళ్ళు కూడా అంతా తామై వ్యవహరించడంపై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సోమిరెడ్డి, బీదా మస్తాన్ రావు, నారాయణ,లాంటి నేతలంతా ఉంటే.. వారిని కాదని పాదయాత్ర పెత్తనమంతా కొత్త వారిదేననే రీతిలో వ్యవహారం నడుస్తోందని, ఇది ఇబ్బందికరమైన అంశమేనని అంటున్నారు పార్టీ నాయకులు. ఏర్పాట్లు చూడ్డానికి ఇంకెవ్వరూ లేరా..? కనీసం సభ్యత్వం కూడా తీసుకోనివారిని అప్పుడే అంత నెత్తిన ఎక్కించుకుంటే…పాత నేతలకు ప్రాధాన్యత లేదన్న తప్పుడు సంకేతాలు వెళ్తాయికదా అని మాట్లాడుకుంటున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. ప్రస్తుతం నెల్లూరులో ఉన్న పరిస్థితి చూస్తుంటే పాత వాళ్లంతా సర్దేసుకుని.. కొత్తోళ్ళు పార్టీని హ్యాండోవర్ చేసుకుంటున్నారా..? అనేలా ఉందట. అయితే అన్నీ ఆలోచించే పార్టీ అధినాయకత్వం ఈ స్థాయిలో కొత్తవారికి.. ఇంకా పార్టీలో చేరని వారికి ప్రాధాన్యత ఇచ్చిందనేది మరో చర్చ. గతంలో వివిధ సందర్భాల్లో జరిగిన వ్యవహారాలతో పాటు.. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నేతల పనితీరే దీనికి ప్రధాన కారణం అంటున్నారు.
Read Also: Off The Record: తెలంగాణలో పవన్‌ని బీజేపీ పూచికపుల్లతో సమానంగా చూస్తోందా.?
గతంతో పోల్చుకుంటే వైసీపీ నెల్లూరులో బలపడిందని చెబుతున్నారు.. అదే సమయంలో అధికార పార్టీ నేతల మధ్య గ్యాప్ కూడా ఉంది. ఇన్ని లోటు పాట్లున్నా.. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ కనీసం పోటీ ఇవ్వలేకపోయిందంటున్నారు. అందుకే పాత వారిని నమ్ముకుంటే కష్టమేనన్న భావనతో అధినాయకత్వం కూడా కొత్త వారికే ప్రాధాన్యతనిస్తోందనే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం ప్రస్తుతానికి గుంభనంగానే ఉన్నా… రాబోయే రోజుల్లో రచ్చ అవ్వొచ్చన్న అంచనాలు ఉన్నాయి. పైకి కనిపించకున్నా… పాత నేతలు లోలోపల తెగ ఫీలైపోతున్నట్టు తెలిసింది. టీడీపీ అధినాయకత్వం దీన్ని ఎలా డీల్ చేస్తుందో చూడాలి.