Off The Record: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న టైంలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. మిత్రులు శత్రువులు అవుతున్నారు. శతృవులు మిత్రులు అవుతున్నారు. బీజేపీ- జనసేన బంధం కూడా ఇలాగే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో పవన్‌కళ్యాణ్ లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయబోమన్నంతగా బిల్డప్ ఇస్తున్న బీజేపీ.. తెలంగాణకు వచ్చేసరికి ఆయన్ని పూచిక పుల్లతో సమానంగా తీసిపారేస్తోందట. గరికపాడు చెక్‌పోస్ట్‌కు అవతలే నీతో దోస్తీ తప్ప ఇవతల పనిలేదని నేరుగానే చెప్పేస్తున్నారు కమలనాధులు. ఏపీలో పొత్తు ఉన్నంత మాత్రాన తెలంగాణలో అది కంటిన్యూ అవ్వాలన్న రూలేమీ లేదన్నట్టుగా ఉంది వ్యవహారం. ఈసారి తెలంగాణలో పోటీ చేయాలని పవన్ అనుకుంటున్నా…అది మాకు సంబంధంలేని మేటర్ అన్నట్టుగా ఉందట బీజేపీ నేతల వైఖరి. అది గమనించే…తన సొంత ప్రయత్నాల్లో ఉన్నారు జన సేనాని. కొన్ని నియోజక వర్గాలకు ఇన్ఛార్జ్‌లను ప్రకటించింది పార్టీ. తెలంగాణలో నాలుగు పార్లమెంట్, 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని అనుకుంటోందట జనసేన.
జన సేనతో పొత్తు ఆంధ్రలో ఉంటుంది కానీ తెలంగాణలో కాదని నేరుగానే చెప్పారు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా.. మేం సింగిలే తప్ప మింగిల్ అయ్యేది లేదని తేల్చేశారు. దీంతో.. బీజేపీ మిత్ర ధర్మం ఇలాగే ఉంటుందా అని వెటకారాలు చేస్తున్నారట రాజకీయ ప్రత్యర్థులు. గతంలో కూడా రెండు పార్టీల మధ్య ఇలాంటి వ్యవహారమే జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని డివిజన్లు కావాలని అడిగింది జనసేన. బీజేపీ మాత్రం ససేమిరా అంది. అయినా ఆ బంధం అలా కొనసాగుతూ వచ్చింది. తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో brs అభ్యర్థికి మద్దతు ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇక తాజాగా తెలంగాణ జన సేన నేతలతో భేటీ అయినా… పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని తెలిసింది. అంటే సింగిల్‌గానే ముందుకు వెళ్ళాలని డిసైడైనట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా బీజేపీ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు పవన్. పొత్తు అంటారు… ప్రచారం చేస్తానంటే వద్దంటారని అప్పట్లోనే అన్నారాయన.
పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే…కలిగే లాభ నష్టాల విషయంలో టిఎస్ కాషాయ దళానికి కన్ఫ్యూజన్ ఉందట. ఆంధ్రా నుంచి వచ్చి స్థిరపడ్డ వారి విషయంలో పాజిటివ్‌గానే ఉన్నా… మరి కొందరు దాన్ని వివాదం చేసే అవకాశం ఉందని లెక్కలు వేసుకుంటున్నారట. ఇదంతా చూస్తున్న వాళ్ళు మాత్రం బీజేపీ లెక్కలు మరీ ఇంత నిర్దాక్షిణ్యంగా ఉంటాయా అని గుసగుసలాడుతున్నారు. నేను గిల్లితే గిల్లిచ్చుకోవాలి, గిచ్చితే గిచ్చిచ్చుకోవాలన్న ప్రకాష్‌రాజ్ డైలాగ్‌ని గుర్తు చేసుకుంటూ… బీజేపీకి మూడొచ్చి పొత్తు పెట్టుకోమంటేనే పెట్టుకోవాలి తప్ప అవతలి వాళ్ళ మూడ్స్‌తో పని లేదని సెటైర్స్ వేసుకుంటున్నారట.