మంత్రి విడుదల రజిని కార్యాలయంపై రాళ్ల దాడి:
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గుంటూరులో ఆదివారం అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. విద్యానగర్‌లోని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని నూతన పార్టీ ఆఫీస్‌పై టీడీపీ-జనసేన కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. దీంతో కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి.. గుంపును చెదరగొట్టారు. కొంతమంది టీడీపీ-జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మంత్రి విడుదల రజిని కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఉంది. ఇటీవలే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జిగా మంత్రి విడదల రజిని నియమితులయ్యారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని నూతన కార్యాలయం ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉంది.
ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం:
ఏపీలోని ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్, బొలెరో వాహనం ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదం బేస్తవారపేట మండలం శెట్టిచెర్ల అడ్డరోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది.
అవినీతిరహిత, పారదర్శక పాలన అందజేస్తాం:
నా శాఖలైన నీటిపారుదల, పౌర సరఫరాల శాఖలో అవినీతి రహిత, పారదర్శకంగా, జవాబుదారితనంతో పాలన అందజేస్తామని నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘తెలంగాణ ప్రజలకు నూతన శకం మొదలైంది. ప్రజలందరికీ హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 60 ఏళ్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటం తర్వాత 2014 కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేసింది. ప్రజలకు రాష్ట్రం వచ్చింది కానీ దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ ప్రభుత్వం రావడంతో ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్రం రాలేదు. పదేళ్ల నిర్బందాలు, నియంత పాలనను పారద్రోలి ప్రజలు మళ్ళీ ఒక ప్రజాస్వామ్య పాలనకు అంకురార్పణ చేశారు. ప్రజా పాలన మొదలు కావడంతో స్వేచ్ఛగా బతుకుతున్నారు. రాష్ట్రములో ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. సచివాలయంలో ప్రజలు స్వేచ్ఛగా వచ్చి వారి విజ్ఞప్తులను అందజేస్తున్నారు’ అని ఉత్తమ్ పేర్కొన్నారు.
మసీదుల్లో, దర్గాల్లో రాముడి నామస్మరణ చేయండి:
రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముందు సంఘ్ పెద్ద విజ్ఞప్తి చేసింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు ఇంద్రేష్ కుమార్.. మసీదులు, దర్గాలు, మదర్సాల నుండి పవిత్రోత్సవం రోజున ‘శ్రీ రామ్, జై రామ్, జై జై’ అని నినాదాలు చేయాలని ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేశారు. వచ్చే నెల 22వ తేదీన అయోధ్యలో రామ్‌లాలా జీవిత దీక్ష, ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ‘రామ్ మందిర్, రాష్ట్ర మందిర్-ఎ కామన్ హెరిటేజ్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఇంద్రేష్ కుమార్ ఈ విషయాలు చెప్పారు. భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలు, హిందూయేతరులలో దాదాపు 99 శాతం మంది ఈ దేశానికి చెందినవారేనని ఇంద్రేష్ కుమార్ చెప్పారు.
33వ అంతస్తునుంచి పడి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి:
బెంగళూరులోని ఓ బిల్డింగ్ 33వ అంతస్తు నుంచి పడి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందాడు. శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు తన స్నేహితుడి ఫ్లాట్‌పై నుంచి కింద పడిపోయాడు. మృతుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన దివ్యాంశు శర్మగా గుర్తించారు. కేఆర్ పురంలోని పష్మీనా వాటర్‌ఫ్రంట్ అపార్ట్‌మెంట్‌లోని ఆమె స్నేహితురాలు మోనికా ఫ్లాట్‌లో ముగ్గురు స్నేహితులు కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోబోతున్నారని పోలీసులు తెలిపారు.
గాజాలో 35 మంది పాలస్తీనియన్లు హతం:
కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే గాజాపై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. సెంట్రల్ గాజాలో ఆదివారం ఇజ్రాయెల్ సైన్యం భారీ వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 35 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. చాలా భవనాలు కూడా భారీగా దెబ్బతిన్నాయి. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేసింది. గాజాలోని రెండవ అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్‌లో హమాస్ స్థానాల కోసం ఇజ్రాయెల్ దళాలు వెతుకుతున్నాయని మిలటరీ తెలిపింది. ఇంతలో ఆ దేశం పౌర ప్రాంతాల్లో హమాస్ ఉగ్రవాదుల రహస్య స్థావరాలను ధ్వంసం చేయడం గురించి తెలుసుకున్నాడు. సెంట్రల్ గాజాలోని జ్వీదా ప్రాంతంలో 13 మంది మరణించారు.. డజన్ల కొద్దీ ఇతరులు గాయపడ్డారు. సెంట్రల్ డీర్ అల్-బలాహ్‌లోని అల్-అక్సా ఆసుపత్రి అధికారులు ఆదివారం 35 మృతదేహాలను కనుగొన్నట్లు ధృవీకరించారు.
బంఫర్ ఆఫర్ కొట్టేసిన మృణాల్ ఠాకూర్:
మృణాల్ ఠాకూర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అదికొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. మొదటి సినిమానే అమ్మడుకు మంచి టాక్ ను అందించింది. ప్రస్తుతం యూత్ మృణాల్ కు బాగా కనెక్ట్ అవుతున్నారు. దాంతో దర్శక, నిర్మాతలు కూడా ఈ అమ్మడును హీరోయిన్ పెట్టాలని డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మృణాల్ చేతిలో అర డజనుకుపై సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే వార్త ఇండస్ట్రీలో కోడై కూస్తుంది. ప్రముఖ డ్యాన్సర్, నిర్మాత, డైరెక్టర్, హీరో రాఘవ లారెన్స్ సరసన జోడిగా నటించబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి. రాఘవా లారెన్స్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ ఫిల్మ్ తెరకెక్కనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం:
ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే తన కెరీర్‌లో చివరి టెస్టు ఆడేందుకు సిద్దమైన వార్నర్.. వన్డే క్రికెట్‌కు సైతం రిటైర్మెంట్ ప్రకటించాడు. 2023 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఈ తరుణమే ఆటకు ముగింపు పలకడానికి సరైన సమయంగా భావిస్తున్నట్లు వార్నర్ తెలిపాడు. తన నిర్ణయం వల్ల కొత్త వారికి అవకాశాలు లభిస్తాయన్నాడు. అయితే పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆస్ట్రేలియాకు ఓపెనర్ అవసరమైతే మాత్రం తాను అందుబాటులో ఉంటానని దేవ్ భాయ్ తెలిపాడు.
స్థిరంగా బంగారం ధరలు:
బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త. ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు.. న్యూ ఇయర్ వేళ స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశీయ మార్కెట్లో నేడు (జనవరి 1) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,550 ఉండగా.. స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 63,870గా ఉంది. ఆదివారం కూడా పసిడి ధరలు స్థిరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈరోజు వెండి ధర కూడా స్థిరంగా ఉంది. సోమవారం దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 78,600లుగా ఉంది.