*నేడు సీఎల్పీ సమావేశం.. ఏకాభిప్రాయం వస్తే వెంటనే ప్రమాణ స్వీకారం!
ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసిన కాంగ్రెస్ పార్టీ సీఎం ఎంపికపై కసరత్తు చేస్తోంది. పార్టీ తరపున గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలతో కూడిన శాసనసభా పక్షం ఇవాళ ఉదయం 9.30 గంటలకు ఇక్కడి ఓ హోటల్‌లో సమావేశం కానుంది. సీఎల్పీ సమావేశాన్ని సమన్వయం చేసేందుకు నాయకత్వం నియమించిన పార్టీ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు డీకే శివకుమార్, దీపా మున్షీ, అజయ్ కుమార్, కే.మురళీధరన్, జార్జి భేటీ కానున్నారు. సీఎల్పీ సమావేశంలో సీఎంగా ఎవరిని నియమించాలనే దానిపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రధానంగా అభిప్రాయాలు సేకరించనున్నారు. కానీ కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం ఎవరి అభిప్రాయం వారిదే తుది నిర్ణయాధికారం అధిష్టానానికి అప్పగించి ఏకగ్రీవ తీర్మానం చేస్తారు. సోమవారం జరిగే సీఎల్పీ సమావేశంలోనూ ఏఐసీసీ పరిశీలకులకు ఎవరి అభిప్రాయం ఉందో వారికే నిర్ణయాధికారం అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయనున్నట్లు సమాచారం. మెజారిటీ సభ్యుల అభిప్రాయం, ఏకగ్రీవ తీర్మానాన్ని ఏఐసీసీ పరిశీలకులకు పంపనున్నారు. వాటిని పరిశీలించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటే నేడు సాయంత్రం కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయని పార్టీలోని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటే సంప్రదింపులు జరపాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. సోమవారం సాయంత్రం లేదా ఈ నెల 6న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్నారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడిగా పార్టీకి మంచి విజయాన్ని అందించిన రేవంత్ రెడ్డిని సీఎంగా అధిష్టానం ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి తర్వాత సీఎల్పీ మాజీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా రేసులో ఉన్నారు. నిజానికి సోనియాగాంధీ జన్మదినం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. అయితే ఈ నెల 9వ తేదీ వరకు ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యమైతే కేంద్రంలోని అధికార బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌లు కలిసి హార్స్ ట్రేడింగ్‌కు పాల్పడే అవకాశం ఉందని భావించిన అధిష్టానం.. వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ తమిళసైన్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మణిరావు ఠాక్రే గవర్నర్‌ను కోరారు. సోమవారం రాజ్‌భవన్‌లో ఆమెను కలిసిన నేతలు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అనంతరం డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌తో తమ కూటమిలో 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పారు. సోమవారం సీఎల్పీ సమావేశం జరుగుతుందని, పార్టీ ప్రక్రియను అనుసరించి సీఎం ఎవరనేది నిర్ణయం తీసుకుంటామన్నారు.
*ఎన్నికల్లో ఓటమి పాలైన ఆరుగురు మంత్రులు.. వారు ఎవరంటే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ పదేళ్ల తర్వాత అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగిన వారిలో ఆరుగురు ఈ సారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆరుగురు మంత్రులపై గెలిచిన అభ్యర్థులందరూ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్ ఓటమి పాలయ్యారు. ఖమ్మం నియోజకవర్గంలో పువ్వాడ అజయ్ పై తుమ్మల నాగేశ్వర్ రావు, నిర్మల్ లో ఇంద్రకరణ్ రెడ్డిపై మహేశ్వర్ రెడ్డి, ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ పై అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వనపర్తి నియోజకవర్గంలో నిరంజన్ రెడ్డి. పాలకుర్తిలో దయాకర్‌రావుపై మేఘారెడ్డి, యశస్వినిరెడ్డి, మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్‌గౌడ్‌పై యెన్నం శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందారు. నిర్మల్‌లో మాత్రమే ఇంద్రకరణ్ రెడ్డిపై మహేశ్వరరెడ్డి బీజేపీ తరపున గెలిచారు.
ఎర్రబెల్లి దయాకర్ విజయాలకు బ్రేక్
పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎర్రబెల్లి దయాకర్‌రావు ఈసారి ఓటమి పాలయ్యారు. ఆరుసార్లు విజయాలు సాధిస్తూ వస్తున్న ఎర్రబెల్లి ఈసారి మాత్రం బోల్తాపడ్డారు. ఆయనపై కాంగ్రెస్ నుంచి తొలి సారిగా పోటీ చేసిన యశస్విని రెడ్డి విజయం సాధించారు. ఇది ఇలా ఉంటే ఎన్నికల ప్రచారం ప్రారంభమైన నాటి నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని తిరుగుతూ ప్రచారం చేసినా మంత్రి ఎర్రబెల్లిని ప్రజలు ఆదరించలేదని ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టం అయింది. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలోనే ఆయన తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి చేసినప్పటికీ అనుచరులు చేసిన ఆగడాల వల్ల, మంత్రి దయాకర్ రావు పైన స్థానికంగా వ్యతిరేకత ఏర్పడింది. అదే కాంగ్రెస్ పార్టీకి ఓటుబ్యాంకుగా మారింది. అలాగే ఎన్నికల బరిలోకి దిగిన యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డి ఎన్నారై కాగా, ఆమెకు స్థానికంగా ఉన్న పేరు కూడా ఆమెకు ప్లస్ అయినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఇప్పటి వరకు మెజారిటీ ఎన్నికలలో ఓటమి ఎరుగని నేతగా, మాస్ లీడర్ గా గుర్తింపు పొందిన ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పరాజయం పాలయ్యారు.
సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఆయనపై టీ మేఘారెడ్డి విజయం సాధించారు. ఆమె కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న నిరంజన్‌రెడ్డి 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత 2018లో నిరంజన్‌రెడ్డి గెలిచారు. అనంతరం కేసీఆర్ కేబినెట్‌లో వ్యవసాయశాఖ మంత్రి అయ్యారు. ఆది నుంచి వనపర్తిలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. దీని కారణంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ హవా కొనసాగినా ఇక్కడ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తూ వచ్చాడు. గతంలో కాంగ్రెస్ లీడర్ చిన్నారెడ్డి నాలుగు సార్లు విజయం సాధించారు. చివరకు ఆయన 2018లో ఓడిపోయారు. బీఆర్‌ఎస్‌లో ఉంటూ రాజకీయం చేసిన మేఘారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు.
పువ్వాడ అజయ్‌కు షాక్
ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు చేతిలో అజయ్ ఓటమి పాలయ్యారు. నువ్వా-నేనా అన్నట్లు ప్రస్తుత ఎన్నికల్లో ఇద్దరు తలపడ్డారు. కచ్చితంగా ఈ సీటు గెలుస్తామనే పువ్వాడ ఆది నుంచి ధీమాగా కాంగ్రెస్ జోష్‌లో ఆయనకు ఓటమి తప్పలేదు. బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మూడోసారి పోటీ చేశారు. ఖమ్మం సీటుపై ఆది నుంచి టార్గెట్ చేసిన కాంగ్రెస్.. అదే జోరును కొనసాగించింది. కాంగ్రెస్‌లో తుమ్మల బలమైన నేత కావడం కూడా ఆ పార్టీకి కలిసొచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తనవైపు తిప్పుకోవడంలో తుమ్మల సక్సెస్ అయ్యారు. ఇద్దరూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో పొలిటికల్ వార్ ఆసక్తి కనబరిచింది. గతంలో తుమ్మల పాలేరు నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా ఓడితే పొలిటికల్‌గా డ్యామేజ్ అయ్యే అవకాశం లేకుంటే ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రయత్నించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి 40 ఏళ్ల రాజకీయాలకు ఘనంగా వీడ్కోలు పలకాలనే ఉద్దేశంతో పనిచేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెప్పి కూడా ప్రచారానికి వెళ్లారు. అదే ఆయనకు కలిసివచ్చిందని చెప్పుకోవచ్చు.
కొప్పుల ఈశ్వర్ ఓటమి
ధర్మపురిలో పోటీ చేసిన కొప్పుల ఈశ్వర్ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ విజయం సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ హోరాహోరీగా సాగింది. ఇప్పుడు గెలిచిన అడ్లూరి లక్ష్మణ్‌పై కొప్పుల ఈశ్వర్ అతి తక్కువ మార్జిన్ అంటే 441 ఓట్లతో విజయం సాధించారు. లక్ష్మణ్ హైకోర్టులో కేసు వేశారు.
శ్రీనివాస్ గౌడ్ హ్యాట్రిక్ మిస్
మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటమి పాలయ్యారు. గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఉంటూ రాజకీయ రంగ ప్రవేశం చేసిన శ్రీనివాస్ గౌడ్ ఉద్యమం
సమయంలో చురుగ్గా ఉన్నారు. అదే 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించి మంత్రి పదవిని తెచ్చిపెట్టింది. 2018 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్‌పై విజయం సాధించారు. కానీ తరచూ వివాదాల్లో ఆయనకు మైనస్ అయింది. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పలేదు.
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి
నిర్మల్ నియోజకవర్గంలో పోటీ చేసిన ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి విజయం సాధించి బీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. గతంలో కూడా మహేశ్వర్ రెడ్డి రెండోస్థానంలో నిలిచారు. నాలుగు సార్లు విజయం సాధించిన ఇంద్రకరణ్ రెడ్డి ఈసారి ఎదురు దెబ్బ తగిలింది. ఇంద్రకరణ్ రెడ్డి 2014లో బీఎస్పీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే తాజాగా మారిన రాజకీయ పరిణామాలతో బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి గెలుపొందారు.
*విద్యార్థులకు అలెర్ట్.. ఈరోజు స్కూల్స్ బంద్..!
ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. ఇవాళ ఏపీ వ్యాప్తంగా స్కూల్స్ కు సర్కార్ సెలవులు ప్రకటించింది.. అందుకు కారణం కూడా భారీ వర్షాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ తుఫాను నేపథ్యంలో స్కూళ్లకు ఇవాళ సెలవు ప్రకటిస్తూ ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.. ఈ తుఫాన్ ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. గత రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి.. నెల్లూరు నుంచి కాకినాడ వరకు ఉన్న కోస్తా జిల్లాలలో తుఫాను ప్రభావం అధికంగా ఉన్నందున ఆయా జిల్లాలలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని విద్యాశాఖ కమిషనర్ సురేష్ ఆదేశాలు జారీ చేశారు. మిగతా జిల్లాలలో తీవ్రతను బట్టి కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సూచనలు చేశారు.. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అలెర్ట్ గా ఉండాలని అధికారులు సూచించారు.. ప్రకాశం జిల్లాలు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇవాళ, రేపు కూడా స్కూల్స్ లేవని సర్కార్ తెలిపింది.. ఇకపోతే ఈ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అటు తుఫాను నేపథ్యంలో ఏపీ ప్రజలు అలర్ట్ గా ఉండాలని సీఎం జగన్ కూడా అధికారులను అలర్ట్ చేశారు.. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు..
*తెలంగాణ ఎన్నికల్లో భారీ మెజార్టీ ఎవరిదో తెలుసా?
భారీ మెజార్టీకి మారుపేరు హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత రెండుసార్లు సిద్ధిపేట నుంచి భారీ మెజార్టీతో హరీష్ రావు గెలుపొందారు. అయితే ఈసారి హరీష్ రావు వెనకపడిపోయారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థిగా కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కెపి వివేకానంద నిలిచారు. వివేకానంద 85 వేల 576 ఓట్ల మెజార్టీ సాధించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొత్తం 6,99,783 ఓట్లు ఉండగా.. డిసెంబర్ 30న జరిగిన పోలింగ్‌లో 4,01,667 ఓట్లు పోలయ్యాయి. కెపి వివేకానంద మొత్తంగా లక్షా 87 వేల 999 ఓట్లు సాధించగా.. కూన శ్రీశైలం గౌడ్‌కు లక్షా 2 వేల 423 ఓట్లు పోలయ్యాయి. లక్షా 1554 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి కొలను హన్మంత రెడ్డికి వచ్చాయి. వివేకకు ఇంతటీ మెజార్టీ ఎందుకు వచ్చిందంటే.. ఆయన చేసిన మంచి పనులే అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. వివేకానంద నిత్యం ప్రజలందరికి అందుబాటులో ఉంటూ.. ఏ కార్యకర్త పని మీద తన దగ్గరకు వచ్చినా కాదనకుండా చేశారనే నమ్మకం ఇక్కడి ప్రజలలో నెలకొంది.
*తెలంగాణ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన జనసేన అభ్యర్థులు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించింది. సీపీఐతో కలిసి 65 స్థానాలను గెలుచుకొన్న కాంగ్రెస్.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని సాధించింది. బీఆర్‌ఎస్ 39 సీట్లు గెలవగా.. బీజేపీ 8 స్థానాల్లో, ఎంఐఎం 7 స్థానాల్లో గెలిచింది. ఇక ఎనిమిది స్థానాల్లో పోటీచేసిన జనసేన.. అన్ని స్థానాల్లోనూ ఓటమి పాలైంది. జనసేన అభ్యర్థులు అందరూ డిపాజిట్‌లు కోల్పోయారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేసింది. పొత్తులో భాగంగా 11 స్థానాల్లో పోటీ చేయాలని జనసేన తొలుత భావించినా.. ఆ తర్వాత 8 స్థానాల నుంచి పోటీ చేసింది. కూకట్‌పల్లి, తాండూరు, కోదాడ, నాగర్ కర్నూల్, ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వారావుపేట నియోజకవర్గాల నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. జనసేన తరఫున పలు నియోజకవర్గాలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, కూకట్‌పల్లిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రచారం చేశారు. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. కూకట్‌పల్లి అభ్యర్థి మూమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్‌కు 39,830 ఓట్లు రాగా.. మిగిలిన అన్ని స్థానాల్లో 5 వేల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.
*పీవీ నరసింహారావు రికార్డును అధిగమించిన శ్రీధర్ బాబు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుపై 30 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మంథని నియోజకవర్గంలో 2,36,442 మంది ఓటర్లు ఉండగా.. 1,95,632 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీధర్ బాబుకు 1,01,796 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధుకు 71,732 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ అభ్యర్థి చందుపట్ల సునీల్ రెడ్డికి 5,642 ఓట్లు రాగా.. బీఎస్పీ అభ్యర్థి నారాయణ రెడ్డికి 2,878 ఓట్లు పోలయ్యాయి. మంథని నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు రికార్డును శ్రీధర్ బాబు అధిగమించారు. మంథని నుంచి 1957, 1962, 1967, 1972 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు పీవీ నర్సింహారావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇదే మంథని నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 1999, 2004, 2009, 2018, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
*నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్ డిసెంబర్ 4 నుంచి ప్రారంభమై డిసెంబర్ 22 వరకు కొనసాగుతుంది. 19 రోజుల పాటు జరిగే ఈ సెషన్‌లో మొత్తం 15 సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్ గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సెషన్ మొదటి రోజునే ‘క్యాష్ ఫర్ క్వెరీ’ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు సంబంధించిన ఎథిక్స్ కమిటీ నివేదిక సమర్పించబడుతుంది. ఈ నివేదికలో మహువాను సస్పెండ్ చేయాలని సిఫార్సు చేయబడింది. ఈ నివేదికను లోక్‌సభ ఆమోదిస్తే మొయిత్రా సభ్యత్వం ముగుస్తుంది. అంతే కాకుండా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనేక బిల్లులను ప్రవేశపెట్టవచ్చు. శీతాకాల సమావేశాల్లో తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు బిల్లు, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుతో సహా 7 కొత్త బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టవచ్చు. ఇది కాకుండా, IPC, CRPC, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ప్రతిపాదిత చట్టాలను కూడా ప్రవేశపెడతారు. శీతాకాల సమావేశాల్లో, ఇండియన్ జస్టిస్ కోడ్ బిల్లు-2023, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్ బిల్లు-2023, ఇండియన్ ఎవిడెన్స్ బిల్లు-2023తో సహా వివిధ బిల్లులను కూడా చర్చించవచ్చు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మూడు రాష్ట్రాల్లో ఘోర పరాజయంతో నిరాశ చెందిన విపక్షాలు ఏకమై బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తాయని తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలపై కూడా ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారు. ఈ సమయంలో సెషన్ గందరగోళంగా మారవచ్చు.
*జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 రిజిస్ట్రేషన్ కు ఈరోజే లాస్ట్ డేట్..అప్లై చేసుకోండి..
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ కు 2024 సెషన్ 1 పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈరోజే లాస్ట్ డేట్.. దరఖాస్తు చేసుకోని విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.ac ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.. డిసెంబర్ 4 వ తేదీలోపు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ అప్లికేషన్ ఫామ్ లో ఏవైనా మార్పులు చేయాలనుకుంటే jeemain.nta.ac వెబ్ సైట్ లో కరెక్షన్ విండో డిసెంబర్ 6వ తేదీన ఓపెన్ అవుతుంది. ఇకపోతే డిసెంబర్ 8 వ తేదీ వరకు కరెక్షన్స్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్స్ 2024 సెషన్ 1 పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్ జనవరి రెండవ వారంలో విడుదల అవుతాయి.. ఇక అడ్మిట్ కార్డులను మూడు రోజుల ముందు విడుదల చేస్తారు. JEE మెయిన్స్ సెషన్ 1 పరీక్షను జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య నిర్వహిస్తారు.. జేఈఈకి ఎలా అప్లై చేసుకోవాలో మరోసారి చూద్దాం..
ముందుగా JEE మెయిన్ 2024 అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ను ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న JEE మెయిన్ 2024 సెషన్ 1 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
రిజిస్ట్రేషన్ వివరాలను నమోదు చేసి, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
తరువాత మీ రిజిస్టర్డ్ అకౌంట్ లోకి లాగిన్ కావాలి.
అక్కడ కనిపించే దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆ తరువాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
మీ అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని భద్రపర్చుకోండి..
ఈ పరీక్షల గురించి మరింత సమాచారం కొరకు.. NTA హెల్ప్ డెస్క్ నంబర్ 011-40759000/ 011- 6922770 లకు కాల్ చేయవచ్చు. లేదా jeemain@nta.ac.in. కు మెయిల్ చేయవచ్చు.. ఈరోజు సాయంత్రం వరకే సమయం త్వరగా అప్లై చేసుకోండి..