*పెండింగ్ బిల్లులపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు..!
తెలంగాణలో పెండింగ్ బిల్లుల వ్యవహారంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గత కొద్దిరోజులుగా విభేదాలు కొనసాగుతునే ఉన్నాయి. పలు బిల్లులను గవర్నర్ పాస్ చేయలేదని తెలంగాణ సర్కార్ ఏకంగా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. మొత్తం 10 బిల్లులకు గాను.. గవర్నర్ కేవలం మూడు బిల్లులకు మాత్రమే ఆమోదం తెలిపారు. రెండు బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా.. మరో రెండు బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ అడిగారు.. మిగిలిన మూడు బిల్లుల్లో ఒక బిల్లును గవర్నర్ తమిళిసై తిరస్కరించింది. మరో రెండు బిల్లులపై అదనపు వివరణ కోసం తిరిగి తెలంగాణ సర్కార్ కే పంపించారు. దీంతో గవర్నర్ తీరుపై ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే, ఈ క్రమంలో తాజాగా పెండింగ్ బిల్లులపై గవర్నర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికి వ్యతిరేఖం కాదు అని ఆమె అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్లులను వెనక్కి పంపడంపై నా అభ్యంతరాలను క్లియర్ గా తెలిపాను అన్నారు. వెనక్కి పంపిన బిల్లులపై స్పీకర్ కు వివరాలు కావాలని అడిగాను.. మూడు బిల్లులకు నేను, ఆమోదం తెలిపాను అని గవర్నర్ అన్నారు. తెలంగాణ ప్రజలతోనే నేను ఉన్నాను అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. అకాల వర్షాల వల్ల తెలంగాణ ప్రజలు ఇబ్బందులు బాధకలిగించాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను చూస్తుంటే బాధేస్తోంది అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రభుత్వం మరింత మెరుగ్గా ప్రజలకు రక్షణగా ఉండాల్సింది. ప్రజాప్రతినిధులు ప్రజలకు అండగా ఉండాలి- రిమోట్ ఏరియా ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు అని ఆమె పేర్కొన్నారు. వర్షాలపై కొన్ని రాజకీయ పార్టీలు నాకు మెమోరాండం ఇచ్చాయి.. హైదరాబాద్ జల్పల్లి ఏరియా వర్షాలు వల్ల పూర్తిగా ఎఫెక్ట్ అయింది.. నీట మునిగిన ప్రజలకు ప్రభుత్వం అండగా ఉండాలి.. నేను ప్రభుత్వాన్ని నివేదిక అడిగాను- రాగానే కేంద్రానికి పంపుతా.. ఫ్లడ్ ఎఫెక్ట్ అయిన ప్రాంతాల్లో నేను త్వరలో పర్యటిస్తాను అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
*తెలంగాణలో భారీ వర్షాలు, వరదల నష్టంపై హైకోర్టులో విచారణ
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నష్టంపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానంలో డాక్టర్ చెరుకు సుధాకర్ పిటిషన్ దాఖలు చేశారు. వర్షాలకు 41 మంది మృతి, 1.59లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. పలు మరణాలను నివేదికలో ప్రస్తావించలేదని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు అని న్యాయవాది ఆరోపించారు. రాష్ట్రంలో విషజ్వరాల నియంత్రణ కోసం తగిన చర్యలు చేపట్టడం లేదని లాయర్ అన్నాడు. రెండు రోజుల్లో మరిన్ని వివరాలతో మరో నివేదిక ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం తరపున లాయర్ పేర్కొన్నారు. విషజ్వరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గల్లంతైన వారిని గుర్తించేందుకు తీసుకున్న చర్యలు తెలపాలని ప్రభుత్వాన్ని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం చెప్పింది. భూపాలపల్లి జిల్లాలోని మృతుల వివరాలు కూడా వెల్లడించాలని వెల్లడించింది. షెల్టర్లు, ఇతర సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్లు ఇచ్చారా లేదా అనేది నివేదించాలని హైకోర్టు తెలిపింది. విద్యుత్, ఇంటర్నెట్, ఫోన్ వంటి వ్యవస్థల పునరుద్ధరణ చర్యలు గురించి వివరించాలని హైకోర్టు తెలిపింది. వరద బాధితులకు మనోధైర్యం ఇచ్చేందుకు తీసుకున్న చర్యలు.. కడెం ప్రాజెక్టు పరిసర ప్రజల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. భారీ వర్షాలు, వరదల నష్టంపై విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి వెల్లడించారు.
*ఇది విశాఖకు ఆణిముత్యంగా మిగిలిపోతుంది.. 8 వేల మందికి ఉద్యోగాలు..
విశాఖపట్నానికి ఇనార్బిట్ మాల్ ఆణిముత్యంగా మిగిలిపోతుందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన.. కైలాసపురం వద్ద ఇనార్బిట్ మాల్‌కు శంకుస్థాపన చేశారు.. రూ. 600 కోట్లతో 17 ఎకరాల స్థలంలో ఇనార్బిట్ మాల్‌ను నిర్మించేందుకు సిద్ధమైంది కె.రహేజా గ్రూపు.. మొత్తం 17 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మూడు దశల్లో ఇనార్బిట్ మాల్ విస్తరణ చేయనున్నారు.. ఈ రోజు తొలి దశ పనులకు సీఎం వైఎస్ జగన్ భూమి పూజ నిర్వహించనున్నారు. రూ.600 కోట్ల వ్యయంతో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణం కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇనార్బిట్ మాల్ విశాఖకు ఆణిముత్యంగా మిగిలి పోతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, 13 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద మాల్ వస్తోంది.. 8 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు సీఎం వైఎస్ జగన్.. ఫేజ్ 2లో రెండున్నర ఎకరాల్లో ఐటీ టవర్, కన్వెన్షన్ సెంటర్ రాబోతున్నాయి.. మూడు వేల మందికి ఐటీలో ఉద్యోగాలు లభిస్తాయన్న ఆయన.. ఆదానీ డేటా సెంటర్, భోగాపురం ఎయిర్ పోర్ట్, మూలపేటలో సీ పోర్ట్ ఇవన్నీ ఉత్తరాంధ్రలో రూపు రేఖలు మారుస్తాయన్నారు. ఒబారాయ్, మైఫేర్, రహేజా గ్రూప్‌లు ఆతిథ్య రంగంలో లగ్జరీ రిసార్ట్స్ ప్రారంభించనున్నాయని వెల్లడించారు. హిందూపురంలో 15 వేల ఉద్యోగాల కల్పన కోసం చేపట్టిన ప్రాజెక్టుకు సహకరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులతో వస్తున్న రహేజాకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం ఉంటుందని.. అన్ని విధాలుగా సహకారం అందిస్తామి స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్. మరోవైపు.. జీవీఎంసీ పరిధిలో 136 కోట్ల రూపాయలతో 50 అభివృద్ధి పనులను ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
*పవన్ కళ్యాణ్ చంద్రబాబు విష కౌగిలిలో చిక్కుకుపోయారు..
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై ఏపీ దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ విరుచుకుపడ్డారు. తాను ఏం చేసినా భాజాభజంత్రీలు కొట్టే మీడియా ఉందన్న ధైర్యం చంద్రబాబుది అంటూ మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎమ్ కార్డులా మార్చాడని అప్పుడు ప్రధానమంత్రి స్వయంగా చెప్పారని.. చంద్రబాబు గురించి వంద పుస్తకాలు రావచ్చని ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కొడుకు మాలోకమంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా దర్శి యువగళమా.. గరళగళమా అన్నది తనకు తెలియటం లేదన్నారు. పవన్ కళ్యాణ్‌ని చూస్తే జాలేస్తోందని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. చిరంజీవి కుటుంబంపై చంద్రబాబు చేసిన కుట్రలు అందరికి తెలుసని.. కాపులని తొక్కడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదన్నారు. రంగా హత్య నుంచి ముద్రగడ కుటుంబాన్ని వేధించే వరకు కాపులని అడుగడుగునా చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు విష కౌగిలిలో చిక్కుకుపోయారని.. పవన్ స్టార్ నుంచి ప్యాకేజ్ స్టార్‌గా మారిపోయాడన్నారు. పార్టీ పెట్డిన ధ్యేయమే వైఎస్ జగన్‌ని గద్దె దించడమే అని పవన్ అంటున్నాడని.. పవన్‌పై ప్రేమ ఉంటే ప్యాకేజ్ ఇవ్వలేదని ఏనాడైనా చంద్రబాబు చెప్పాడా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు విష కౌగిలి నుంచి పవన్ బయటపడాలని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
*ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ప్రవేశపెట్టిన అమిత్ షా
ఢిల్లీ పరిపాలన సేవల నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్‌కు అప్పగించేలా కేంద్రం తీసుకుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన బిల్లును అధికార పక్షం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన ‘ ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటొరీ ఆఫ్ ఢిల్లీ- 2023’ (The Government of National Capital Territory of Delhi Bill- 2023) బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఓవైపు మణిపూర్ అంశంలో ఉభయసభల్లోనూ ప్రతిష్టంభన కొనసాగుతుండగా.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. ఢిల్లీకి సంబంధించిన ఏ చట్టాన్నైనా రూపొందించే అధికారాన్ని లోక్‌సభకు రాజ్యాంగం కల్పించిందని అన్నారు. అంతేకాకుండా చట్టాన్ని తీసుకొచ్చే అధికారం కేంద్రానికి ఉందని సుప్రీం కోర్టు కూడా గతంలో స్పష్టం చేసిందని చెప్పారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఢిల్లీ ప్రభుత్వం బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని.. ఈ బిల్లును తీసుకొచ్చేందుకు అనుమతించాలని స్పీకర్‌ను కోరారు. బిల్లుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ బిల్లును తీసుకురావడాన్ని సమాఖ్య విధానంపై దాడిగా కాంగ్రెస్ అభివర్ణించింది. ‘దిల్లీ సర్వీసెస్ బిల్లు’ అప్రజాస్వామికమని, సమాఖ్య విధానానికి విరుద్ధమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్ విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఈ బిల్లును తీసుకొచ్చారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. దేశంలో సమాఖ్య విధానంపై దాడి ఆమోదయోగ్యం కాదని, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఎంపీ మనోజ్ ఝా మండిపడ్డారు. ఇవాళ ఈ ఢిల్లీపై దాడి జరుగుతోందని, రేపు ఏ రాష్ట్రంలోనైనా జరగొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. దేశ రాజధానిలోని పరిపాలన సేవలపై నియంత్రణను లెఫ్టినెంట్ గవర్నర్‌కి అప్పగించేలా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చినప్పటి నుంచి ఢిల్లీ ప్రభుత్వం దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విపక్షాలను కూటగట్టే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ సహా పలు విపక్షపార్టీలు కేజ్రీవాల్‌కు మద్దతు తెలిపాయి. ఢిల్లీ పరిపాలన సేవల బిల్లు లోక్‌సభకు చేరిన నేపథ్యంలో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఢిల్లీలో గ్రూపు-ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలకు గాను ‘నేషనల్ కేపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ’ ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఆప్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. డిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై నియంత్రణాధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని మే 11న తీర్పు వెలువడింది. ఆ నేపథ్యంలో అదే నెల 19న కేంద్రం ఆర్డినెన్సు జారీ చేసింది. ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతుండడంతో దానిని బిల్లు రూపంలో కేంద్రం ప్రవేశపెట్టింది.
*ఒకే వేదికపై మోడీ, శరద్, అజిత్.. బుద్ధుందా అంటూ శివసేన ఫైర్
ప్రతిపక్ష కూటమిలో సీనియర్ నాయకుల్లో ఒకరైన శరద్ పవార్ ఈరోజు మహారాష్ట్రంలో జరిగిన ఒక ఈవెంట్‌లో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి వేదిక పంచుకున్నారు. పూణేలోని లోక్‌మాన్య తిలక్ స్మారక మందిర్ వారు మోడీకి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును బహూకరించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శరద్ పవార్ హాజరయ్యారు. ఇదే వేదికపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్‌సీపీని చీల్చి బిజెపితో చేతులు కలిపిన శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పవార్ మాట్లాడుతూ.. దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం తీసుకురావాలని లోకమాన్య తిలక్ కోరుకున్నారన్నారు. అయితే.. బ్రిటీష్ నుంచి స్వాతంత్రం పొందాలంటే, ప్రజల్ని ఏకం చేయాలని ఆయన గ్రహించారన్నారు. అప్పుడు ఆయన జర్నలిస్ట్‌గా మారి.. కేసరి, మరాఠా వారాపత్రికల్ని లాంచ్ చేశారన్నారు. బ్రిటీష్‌కి వ్యతిరేకంగా పోరాడారన్నారు. జర్నలిజంపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండకూడదని తిలక్ చెబుతుండేవారని పవార్ గుర్తు చేశారు. మరోవైపు.. వచ్చే ఏడాది జాతీయ ఎన్నికల్లో అధికార బీజేపీని ఎదురించడమే లక్ష్యంగా 26 పార్టీలు కలిసి ‘INDIA’ కూటమిని ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత ప్రధాని మోడీతో శరద్ పవార్ వేదికని పంచుకోవడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా.. శివసేన పార్టీ పవార్ ఈ ఈవెంట్‌కి వెళ్లకుండా ఉండాల్సిందని సూచించింది. శివసేనకు చెందిన ‘సామ్నా’ అనే సంపాదకీయం.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అవినీతికి పాల్పడిందని, అనంతరం పార్టీలో చీలికకు శ్రీకారం చుట్టి మహారాష్ట్ర రాజకీయాలపై బురద జల్లే ప్రయత్నం చేసిందని మోడీ ఆరోపించారని పేర్కొంది. అటు.. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదని, అయినా ఒకే వేదికపై నవ్వుకుంటూ ఎలా కూర్చుంటారంటూ శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీదేనని నిలదీశారు. మీకసలు విజ్ఞత ఉందా? ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే, ఒకే వేదికపై ఎలా కూర్చుంటారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
*వాట్సాప్‌లో హార్ట్ సింబల్ పంపితే చిక్కులే.. ఐదేళ్ల జైలు, భారీ జరిమానా.
ఇది స్మార్ట్‌ఫోన్ల కాలం.. ప్రతీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే.. అందులో సోషల్ మీడియా యాప్‌లకు కొదవే లేదు.. ఇక, స్మార్ట్‌ఫోన్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది వాట్సాప్ అనేలా తయారైంది పరిస్థితి.. ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకునే వీలు ఉండడంతో పాటు.. వాయిస్, వీడియో కాలింగ్ సదుపాయాలు.. రోజుకో కొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడూ తన యూజర్లను కట్టిపడేస్తోంది వాట్సాప్.. అయితే, వాట్సాప్‌లో గుట్టుగా చాటింగ్ చేసుకుంటూ.. ఇష్టం వచ్చిన ఎమోజీలు పెడుతున్నారు.. అయితే, మీరు వాట్సాప్‌లో లేదా ఏదైనా సైట్‌లో హార్ట్ ఎమోజీని కూడా ఉపయోగిస్తుంటే, మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే, కువైట్‌లో వాట్సాప్ లేదా ఏదైనా ఇతర సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా ఒక అమ్మాయికి హార్ట్ ఎమోజీని పంపడం ఇప్పుడు అసభ్యతను ప్రేరేపించే నేరంగా పరిగణించబడుతుంది.. ఇది చట్టం ప్రకారం నేరం, శిక్ష తప్పదు. కువైట్ న్యాయవాది హయా అల్ షాలాహి ప్రకారం, ఈ నేరానికి పాల్పడిన వారికి రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటు 2,000 కువైట్ దినార్లకు మించకుండా జరిమానా విధించవచ్చు. అదేవిధంగా వాట్సాప్‌లో ‘రెడ్ హార్ట్’ ఎమోజీని పంపడం వల్ల పొరుగున ఉన్న సౌదీ అరేబియాలో జైలు శిక్ష పడుతుంది. ఇప్పటికే సౌదీలో అమల్లో ఉన్న చట్టం ప్రకారం, ఎవరైనా ఈ చర్యకు పాల్పడినట్లు తేలితే వారికి రెండు నుండి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, అలాగే 100,000 సౌదీ రియాల్స్ జరిమానా విధించబడుతుంది. సౌదీ సైబర్ క్రైమ్ నిపుణుడి ప్రకారం, వాట్సాప్‌లో రెడ్ హార్ట్‌లను పంపడం వేధింపుగా పరిగణించబడుతుంది. సౌదీ అరేబియాలోని యాంటీ-ఫ్రాడ్ అసోసియేషన్ సభ్యుడు అల్ మోటాజ్ మాట్లాడుతూ.. ఆన్‌లైన్ సంభాషణల సమయంలో కొన్ని చిత్రాలను పంపి తమ భావ వ్యక్తీకరణను తెలియజేయడంపై దావా వేస్తే వేధింపుల నేరంగా మారవచ్చు అని వార్నింగ్ ఇచ్చారు. ఇక, పదే పదే ఉల్లంఘించిన సందర్భాల్లో, జరిమానా 300,000 సౌదీ రియాల్‌లకు గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు. ప్రస్తుతానికి మన దేశంలో దీనిపై ఎలాంటి ఆంక్షలు లేకపోయినా.. భవిష్యత్‌లో ఆంక్షలు పెడతారేమో? శిక్షలు తప్పవేమో..? జరిమానాలు విధిస్తారేమో..? అతిగా చాటింగ్ చేస్తూ.. ఇష్టం వచ్చిన ఎమోజీలు పెట్టే నెట్ బాబులు జాగ్రత్త మరి.
*నేను బరువు తగ్గడానికి నా బాయ్ ఫ్రెండ్ కారణం.. ?
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది రాశీ ఖన్నా. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకున్న ఈ భామ .. ఆ తరువాత విజయాల పరంపరను కొనసాగించలేకపోయింది. స్టార్ హీరోల సరసన నటించినా కూడా అమ్మడికి ఆశించిన ఫలితం దక్కలేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక టాలీవుడ్ సెట్ అవలేదేమో అని కోలీవుడ్ కు వెళ్ళింది. అక్కడ కూడా బ్యాడ్ లక్ ఎదురవడంతో బాలీవుడ్ కు వెళ్ళింది. ఇక ఒక వెబ్ సిరీస్ ద్వారా అమ్మడికి మంచి పేరు వచ్చింది. మొదటి నుంచి ముద్దుగా బొద్దుగా ఉండే ఈ భామ ఒక్కసారి జీరో సైజ్ కు వచ్చి షాక్ ఇచ్చింది. ఎప్పుడైతే జీరో సైజ్ కు వచ్చిందో అందాల ఆరబోతకు సిద్దమయ్యింది. బాలీవుడ్ లో లిప్ లాక్ లు, ఇంటిమెంటెడ్ సీన్స్ తో రెచ్చిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రాశీ.. తన వెయిట్ లాస్ సీక్రెట్ ను బయటపెట్టింది. తాను బరువు తగ్గడానికి తన బాయ్ ఫ్రెండ్ కారణమని చెప్పుకొచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశీ మాట్లాడుతూ.. ” కొన్ని అనారోగ్య సమస్యలు కారణంగా నేను బరువు పెరిగాను. తగ్గడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ, నా వలన కాలేదు. ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యాను. ఆ సమయంలో నాకు ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. అతనితో డేటింగ్ ప్రారంభించాను. అప్పటినుంచి నేను బరువు తగ్గడం మొదలుపెట్టాను. బరువు తగ్గడానికి మానసిక ప్రశాంతతకు చాలా సంబంధం ఉంది. ఎవరైనా మానసికంగా సంతోషంగా ఉంటే, అది వారి శరీరాకృతిపై ప్రతిబింబిస్తుంది” అని చెప్పుకొచ్చింది. ఇక రాశీ చెప్పిన ఆ వ్యక్తి ఎవరా అని అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు.