*పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం
పాలమూరు జిల్లా ప్రజల కల సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించి తెలంగాణ ప్రజలకు అంకితం చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి అప్రోచ్ కాల్వ ద్వారా నార్లాపూర్ ఇన్‌టేక్ వెల్‌కు చేరుకునే కృష్ణా జలాలను.. నార్లపూర్ దగ్గర ఏర్పాటు చేసిన తొలి పంప్ హౌస్ స్విచ్ ను ఆయన నొక్కడం ద్వారా 104 మీటర్లు పైకి ఎత్తి సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి పోసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నార్లపూర్ పంప్ హౌస్ దగ్గర ఏర్పాటు చేసిన పైలాన్ ను కేసీఆర్ ఆవిష్కరించారు. నార్లాeపూర్ రిజర్వాయర్ లోకి చేరిన కృష్ణా జలాలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ద్వారా 6 జిల్లాల్లో 12 లక్షల 30 వేల ఎకరాలకు సాగు, 1226 గ్రామాలకు తాగునీరు సౌకర్యం లభించనుంది. మొత్తం ఈ ప్రాజెక్ట్ యొక్క నిల్వ సామర్థ్యం 67.52 టీఎంసీలుగా కాగా.. 672 మీటర్ల లిఫ్ట్, 61.57 కిలో మీటర్ల. సొరంగం, 915 కి.మీ. ప్రాథమిక కాలువ నిర్మాణం చేపట్టారు. తొలి పంప్ హౌస్ లోని మొదటి పంపు సిద్ధంగా ఉంది.. భూగర్భంలో పంప్ హౌస్ ఏర్పాటు చేశారు. కంట్రోలింగ్ సెంటర్ నుంచి ఎత్తిపొతలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సాయంత్రం కొల్లపూర్ సింగోటం చౌరస్తాలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కాగా, సాయంత్రం 5 గంటలకు కొల్లాపూర్‌లోని పాలమూరు యూనివర్సిటీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
*బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. మాడవీధులలో గ్యాలరీలో 2 లక్షల మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు. ఆన్‌లైన్‌లో లక్షా 30 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేశామని ఆయన పేర్కొన్నారు. ప్రతి నిత్యం సర్వదర్శనం భక్తులకు 24 వేల ఉచిత దర్శన టికెట్లు కేటాయిస్తామన్నారు. అన్నప్రసాద సముదాయంలో నిత్యం లక్ష మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. 3500 మంది పోలీసులు, 1200 మంది విజిలెన్స్ సిబ్బందితో భధ్రతా ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. 6 లక్షల లడ్డూలు నిల్వ ఉంచడంతో పాటు నిత్యం 4 లక్షల లడ్డూలు తయారు చేసేలా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. ఘాట్ రోడ్డులో 24 గంటల పాటు వాహనాలు అనుమతించేలా ఏర్పాట్లు చేశామన్నారు. నడకదారిలో ఆంక్షలు కొనసాగుతాయని ఆయన ప్రకటించారు. తిరుమలలో 17వ తేదీన వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. 18వ తేదీన ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 18వ తేదీన శ్రీవారికి పట్టు వస్ర్తాలను సీఎం జగన్ సమర్పించనున్నారు. 22వ తేదీన గరుడ వాహన సేవ, 23వ తేదీన స్వర్ణ రథ ఊరేగింపు జరగనున్నాయి. 27వ తేదీన ధ్వజాఅవరోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
*వైసీపీ ప్రభుత్వం వద్దనుకుంటే.. మీ పీక మీరు కోసుకోవడమే..
శ్రీకాకుళంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. మహిళలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆయన.. వైసీపీని వ్యతిరేకించడం అంటే గొప్ప అనుకోకండి.. వైసీపీ ప్రభుత్వం వద్దనుకుంటే మీ పీక మీరు కోసుకోవడమే, మీచేతిని మీరు నరుక్కొవడమే అన్నారు.. సీఎం వైఎస్ జగన్ ఓడిపోతే ఆడవాళ్లకి ఎంత చేశాడు, అడోళ్లు ఆడోళ్లు అనుకొని చచ్చాడురా అంటారు. తరువాత వచ్చిన ప్రభుత్వం ఆడవాళ్లని పట్టించుకోదన్నారు. సమాజంలో మహిళలకు ఇంత గౌరవం ఇచ్చిన ప్రభుత్వాన్ని వద్దనుకుంటే ఏం చేయాలి.? అని ప్రశ్నించారు. నూనె ,గ్యాస్ , కరెంట్ పెరగాయంటూ మాట్లాడుతున్నారు.. దేశం మొత్తం పెరిగాయి , మనవద్దే కాదని తెలిపారు.. ధరలు పెరిగినా తట్టుకునేలా మీ ఎకౌంట్స్ లో డబ్బు జమచేస్తున్నాం. ఇతర రాష్ర్టాలలో , గత ప్రభుత్వాలలో ఇలాజరగలేదు కదా? అని ప్రశ్‌నించారు.. మహిళలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు మంత్రి ధర్మాన. మరోవైపు.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన.. చంద్రబాబు నాయుడు ఏదో ఒక పేరు పెట్టి… వాళ్లకి రూ.371 కోట్లు డబ్బు ఇచ్చాడు. చంద్రబాబు చెప్పిన సంస్థకు కాకుండా బోగస్ సంస్థకు ఆ డబ్బు వెళ్ళిందనీ కేంద్ర ప్రభుత్వ సంస్థ దాన్ని పట్టుకుందన్నారు. బోగస్ సంస్థ నుండి సెల్ కంపెనీలకు.. అక్కడ నుండి ఆ డబ్బు చంద్రబాబు పీఏ, లోకేష్ పీఏ అకౌంట్లకి వచ్చాయని పట్టుకున్నారని.. వాళ్లని పట్టుకుందామనీ వెళ్తే ఒకడు దుబాయికి, ఇంకొకడు అమెరికాకి పారిపోయారని వెల్లడించారు.. వాళ్లని పట్టుకుంటే ఈ డబ్బు ఎక్కడికెళ్లిందో తేలిపోతుందన్నారు. ఇక, ప్రజా జీవితంలో ఉన్నవాడు డబ్బులు ఇలా తినేస్తే ఊరుకోరు అని హెచ్చరించారు ధర్మాన.. మేమందరం కోర్టుమందు విచారణకు నిలబడిన వాళ్ళమే గతంలో.. ప్రజా ధనం దుర్వినియోగం అయ్యిందని ఒక సంస్థ చెబితే నమ్మేస్తారు.. నువ్వు జనం ముందు దబాయించటం కాదు.. కోర్టులో రుజువు చేసుకోవాలని సలహా ఇచ్చారు. అప్పటి ప్రభుత్వంలో డబ్బంతా ఇతరుల అకౌంట్లకు వెళ్లి తిరిగి వాళ్ల అకౌంట్లకి వచ్చేది అని ఆరోపించారు. మా ప్రభుత్వంలో డబ్బంతా ప్రజల అకౌంట్లలోకి వెళ్తుందంటూ అభివర్ణించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. మరోవైపు.. మళ్లీ జగన్‌ను గెలిపిస్తామని ప్రజలు అంటున్నారు.. కానీ, మన గుర్తు ఏదంటే మాత్రం కొందరు సైకిల్ అని అంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.. వైసీపీ గుర్తుపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు మంత్రి ధర్మాన.
*ఉగ్రవాదుల భారీ కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ..
ఎన్ఐఏ అధికారులు ఇవాళ ఉదయం నుంచి తమిళనాడు, హైదరాబాద్ లో 22 చోట్ల సోదాలు చేసినట్లు తెలిపింది. ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల కోసం విస్తృత తనఖీలు చేసింది.. రెండు రాష్ట్రాల్లో 31 ప్రాంతాల్లో దాడులు చేయగా.. ఎన్ఐఏ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మొబైల్ ఫోన్లు, లాప్ టాప్ లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 60 లక్షల భారత కరెన్సీతో పాటు 18,200 అమెరికన్ డాలర్లను గుర్తించారు. కోయంబత్తూర్‌లోని 22 చోట్ల , చెన్నైలోని 3 ప్రాంతాలు తమిళనాడులోని తెన్‌కాసి జిల్లాలోని కడైయనల్లూర్‌లో ఒక చోట ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ , సైబరాబాద్ పరిధిలో 5 చోట్ల సోదాలు చేయగా.. మదర్సాల ముసుగులో ఐఎస్ఐఎస్ భావజాలాన్ని ఐసీస్ నూరిపోస్తుంది. మహ్మద్ హసన్ అజహర్ సిద్దికీ, సయ్యద్ మురాబాతుద్దీన్, ఖాజా తమీజుద్దీన్, మహ్మద్ నూరుల్లా హుస్సేన్, సయ్యద్ అబ్దుల్ జబ్బార్ లను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉగ్రవాదుల భారీ కుట్రను ఎన్ఐఏ అధికారులు భగ్నం చేశారు. ఈ సోదాల్లో కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు అరబిక్ భాషలో ఉన్న పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అరబిక్ క్లాసుల పేరుతో యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేస్తున్నారు.. రీజనల్ స్టడీ సెంటర్ల పేరుతో ప్రత్యేక శిక్షణ.. సోషల్ మీడియా వాట్సప్ టెలిగ్రామ్ ల ద్వారా ప్రత్యేక శిక్షణ తరగతులు.. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కిలాఫత్ ఐడియాలజీని వ్యాప్తి చేసేందుకు ఉగ్రవాదుల కుట్ర చేస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఒక గ్రూపుగా ఏర్పడి స్థానిక యువతను ఉగ్రవాదులు తమ సంస్థలోకి చేర్చుకుంటున్నారు. గత సంవత్సరం అక్టోబర్ 23న కోయంబత్తూర్ లో కారు పేలుడు చర్యకు పాల్పడిన ఉగ్రవాదులు.. ఐసిస్ కార్యకలాపాలను విస్తరించాలనుకుంటున్న యువతను టార్గెట్ చేసుకొని ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు.
*రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై ఈ నెల 19 వరకు హైకోర్టు స్టే
రంగారెడ్డి జిల్లా టీచర్ల పదోన్నతులపై తెలంగాణ హైకోర్టు ఈ నెల 19 వరకు స్టే విధించింది. రంగారెడ్డి జిల్లా స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల పదోన్నతులపై ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో సీనియారిటీ జాబితాపై ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్ల పిటిషన్లు దాఖలు చేశారు. జీవో 317 ద్వారా ఇతర జిల్లాల టీచర్లను రంగారెడ్డి జిల్లా కేటాయించారని పిటిషనర్లు వాదించారు. రంగారెడ్డి జిల్లా క్యాడర్ కన్నా ఎక్కువ టీచర్లను కేటాయించారని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాథమిక సీనియార్టీ జాబితాపై అభ్యంతరాలకు తగిన సమయం ఇవ్వకుండా పదోన్నతులకు సిద్ధమయ్యారు అని పిటిషనర్లు ఆరోపించారు. అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే తుది సీనియారిటీ జాబితా రూపొందిస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. తుది సీనియారిటీ జాబితా ఇవ్వకుండా పదోన్నతులు ఇవ్వబోమని ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. పూర్తి వివరాలు సమర్పించేందుకు ఈనెల 19 వరకు సమయం ఇవ్వాలని హైకోర్టు న్యాయమూర్తిని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది కోరారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి, డీఎస్ఈ, రంగారెడ్డి డీఈవోకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణ ఈనెల 19కి వాయిదా వేసింది. ప్రాథమిక సీనియార్టీ జాబితా ఆధారంగా పదోన్నతులు ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
*తన పుట్టిన రోజున దేశానికి పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్న ప్రధాని మోడీ.. ఏంటంటే?
తన 73వ పుట్టిన రోజు సందర్భంగా మోడీ దేశ ప్రజలకు ఓ కానుక ఇవ్వబోతున్నారు. సెప్టెంబర్ 17న ఢిల్లీలోని ద్వారకలో ‘యశోభూమి’ పేరుతో ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్‌ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అధికారికంగా దీని పేరు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (IICC). ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు 221 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆధునిక సాంకేతికతలు, ఫీచర్లతో కూడిన ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ హాళ్లలో ఒకటి. ఐసిసి-ద్వారకా సెక్టార్ 25 స్టేషన్ లోపల కొత్త మెట్రో స్టేషన్ కూడా ప్రారంభించబడుతుంది. ఈ కొత్త మెట్రో స్టేషన్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ లైన్‌కు అనుసంధానించబడుతుంది. ఇది న్యూఢిల్లీ మెట్రో స్టేషన్, ఐఐసిసి మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ మెట్రో ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌లో మెట్రో రైళ్లు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాయి. అయితే ఈ లైన్‌లోని రైళ్లు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయడం విశేషం. ఇప్పటి వరకు ఇదే గరిష్ట వేగం. దీని కారణంగా న్యూ ఢిల్లీ నుండి యశోభూమి ద్వారకా సెక్టార్ 25 వరకు మొత్తం ప్రయాణం కేవలం 21 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఫిబ్రవరి 2011లో ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్ ప్రారంభమైనప్పటి నుంచి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడుస్తున్నాయని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. అయితే ఇప్పుడు మెట్రో గరిష్టంగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.
*ఆ పార్టీ వాళ్ళు తిట్లలో పోటీ.. మనది కిట్లలో పోటీ
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఈ రోజు అమిత్ షా వచ్చి తిడుతారు.. రేపు ఖర్గే వచ్చి తిడుతారు అంటూ మంత్రి అన్నారు. వాళ్ళది తిట్లలో పోటీ.. మనది కిట్లలో పోటీ అని హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీది బట్ట కాల్చీ మీద వేసే సంస్కృతి.. ప్రతిపక్షాల పాలనకు మా పాలనకు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా ఉంది అని వైద్యారోగ్యమంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీది తన్నుల సంస్కృతి.. BRS పార్టీది టన్నుల పంట పండించే సంస్కృతి అంటూ మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భారతదేశానికి దిక్సుచిగా మారింది.. దేశంలో 3 శాతం జనాభా ఉన్న మన తెలంగాణ ఎన్నో అవార్డులు సాధించింది.. ధాన్యం ఉత్పత్తిలో హర్యానా, పంజాబ్ రాష్ట్రాలను దాటి కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ మారింది అని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసింది.. పాలమూరు ప్రాజెక్టు దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేస్తుంది.. దేశ వైద్య అవసరాలు తీర్చేందుకు డాక్టర్లును తయారు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. అదే విధంగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించాడు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి గెలిచినప్పటి నుంచి అందుబాటులో లేడు.. ఆ ఎమ్మెల్యే అడ్రస్ లేదు.. ఎక్కడున్నాడో తెలియదు.. నియోజకవర్గ ప్రజలకు ఫోన్ నెంబర్ తెలియని ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. కాంగ్రెస్ వాళ్లు గొప్పలు చెప్పి చెవిలో పువ్వులు పెడుతున్నారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ చేసేందేమి లేదు.. కాంగ్రెస్ వి వట్టి మాటలే.. కేసీఆర్ సర్కార్ చేతల ప్రభుత్వం.. కేసీఆర్ పక్క హిందూ.. కానీ కుల మతాలకు అతీతంగా పని చేసాడు.. సీఎం కేసీఆర్ అద్భుతాలు సృష్టిస్తున్నారు.. కాంగ్రెస్ వాళ్లు అబద్ధాలు చెబుతున్నారు అని హరీశ్ రావు విమర్శించారు.
*సెప్టెంబర్ 23న జమిలి ఎన్నికలపై తొలి సమావేశం..
‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’పై కేంద్రం నియమించిన కమిటీ తొలిసారిగా సమావేశం కాబోతోంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాతే రోజే సమావేశం జరగనుంది. సెస్టెంబర్ 23న జమిలి ఎన్నికలకు సంబంధించిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ భేటీ అవుతుంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశంపై వీలైనంత త్వరగా పరిశీలించి సిఫార్సులు చేసేందుకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని కేంద్రం నియమించింది. ఈ కమిటీకి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వం వహిస్తుండగా.. కమిటీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, గులాంనబీ ఆజాద్, ఆర్థిక సంఘం చైర్మన్ ఎస్కే సింగ్, మాజీ లోక్‌సభ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సమావేశాలకు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రత్యేక ఆహ్వానితుడు కాగా.. న్యాయవ్యవహారాల కార్యదర్శి నితేన్ చంద్ర ప్యానెల్ కి కార్యదర్శిగా వ్యవహారిస్తారు. జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగంలో సవరణలు, ప్రజాప్రాతినిధ్య చట్టం మొదలైన అంశాలపై సవరణలు, ఏదైనా ఇతర చట్టాలు, నియమాలను పరిశీలించి కమిటీ సిఫారసులు చేస్తుంది. సెప్టెంబర్ 18-22 మధ్య పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. కమిటీ నియామకం ముందు ఈ సమావేశాల్లో జమిలి ఎన్నికలపై బిల్లు పెడతారనే ఊహాగానాలు వినిపించాయి. పార్లమెంట్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత రోజే కేంద్రం జమిలి ఎన్నికలపై కమిటీని నియమించింది. అయితే జమిలి ఎన్నికలను కాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బీజేపీ మాత్రం జమిలితో ఖర్చులు తగ్గుతాయని వీటిని అభివృద్ధి, సంక్షేమం కోసం ఖర్చు పెట్టొచ్చని చెబుతోంది.
*ప్రపంచంలో ఎక్కువ మంది విడాకుల తీసుకునే దేశాలు ఇవే..
వివాహబంధం చాలా గొప్పది.. నూరేళ్లు కలిసి ఉంటామని పెళ్లి చేసుకుంటారు.. ఇది ఒకప్పటి మాట.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. పెళ్ళైన జంటలు కూడా నచ్చితే ఒకే.. లేకుంటే ఎవరిదారివారిది అంటున్నారు.. ఒకసారి వద్దనుకుంటే ఇక ఎవరి మాట వినరు.. విడాకులు తీసుకొని ఎవరిలైఫ్ వాళ్లు బ్రతుకుతున్నారు.. పాశ్చ్చాత్య దేశాలలో ఈ కల్చర్ ఎక్కువగా ఉంది.. పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే విడిపోతున్నారు.. ప్రపంచంలో అన్ని దేశాలు అలాగే ఉన్నాయి.. మన భారతదేశంలో విడాకుల రేటు తక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. సంబంధాలను కాపాడుకోవడంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న భారతదేశం ముందుంది.. అలాగే ప్రపంచవ్యాప్తంగా విడాకుల రేటు తక్కువగా ఉంది.. ప్రపంచవ్యాప్త గణాంకాలను విశ్లేషించే గ్లోబల్ ఇండెక్స్ నుండి వచ్చిన డేటా ప్రకారం, భారతదేశంలో విడాకుల రేటు కేవలం 1 శాతం మాత్రమే నమోదైంది. భారతదేశం తర్వాత, వియత్నాం రెండవ అత్యల్ప విడాకుల రేటు 7 శాతంగా పేర్కొంది.. ప్రపంచంలో అత్యధిక విడాకుల రేటు అంటే 94 శాతం పోర్చుగల్‌లో గమనించబడింది.. ఖండాల పరంగా, యూరప్ అత్యధిక విడాకుల రేటును నమోదు చేస్తుంది. పోర్చుగల్ తర్వాత స్పెయిన్ విడాకుల రేటు 85 శాతంగా ఉంది. లక్సెంబర్గ్, ఫిన్లాండ్, బెల్జియం, ఫ్రాన్స్ మరియు స్వీడన్‌తో సహా అనేక ఇతర యూరోపియన్ దేశాలు కూడా విడాకుల రేటును 50 శాతానికి మించి నమోదు చేశాయి.. ఇక యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా ఒకే విధమైన విడాకుల రేటును పంచుకుంటాయి, దాదాపు 50 శాతం వద్ద ఉన్నాయి.. భారతదేశంలో, విడాకులు జంటలకు సవాలుతో కూడిన ప్రయాణం. ఒకరి మతాన్ని బట్టి చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ మారుతూ ఉంటుంది. హిందువులు, బౌద్ధులు, జైనులు మరియు సిక్కుల కోసం, విడాకుల ప్రక్రియ 1955 నాటి హిందూ వివాహ చట్టం ద్వారా నిర్వహించబడుతుంది. అదే సమయంలో, ముస్లింలు 1939 నాటి ముస్లిం వివాహ రద్దు చట్టానికి కట్టుబడి ఉన్నారు.. పార్సీలకు, 1936 నాటి పార్సీ వివాహం మరియు విడాకుల చట్టం వర్తిస్తుంది, అయితే క్రైస్తవులు 1869 నాటి భారతీయ విడాకుల చట్టం ద్వారా మార్గనిర్దేశం చేయబడతారు. అంతర్-సంఘాల వివాహాలు, 1954 ప్రత్యేక వివాహాల చట్టం పరిధిలోకి వస్తాయి..