ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి:
రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం చెందారు. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొన్న ఘటనలో సాబ్జీకి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. ఏలూరు నుంచి భీమవరం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ మృతి చెందగా.. సీసీకి గాయాలయ్యాయి. గన్‌మెన్‌కి కూడా గాయాలు కాగా.. భీమవరం ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నట్లు తెసులుస్తోంది.
సిద్దిపేట కలెక్టర్ గన్‌మెన్ ఆత్మహత్య:
మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఆత్మహత్య ఘటన మరువకముందే.. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. నరేష్ తన భార్య, ఇద్దరు చిన్న పిల్లలను హత్య చేసి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం విధులకు హాజరు కాకపోవడంతో అనుమానంతో ఇంటికి వెళ్లి చూసే సరికి అందరూ షాక్ అయ్యారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన చిన్నకోడూరు మండలం రమలో చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునికి చెందిన ఆకుల నరేష్ ప్రస్తుతం కలెక్టర్ వద్ద పీఎస్‌వోగా పనిచేస్తున్నారు.
సీఎం జగన్ ఓటమిని అంగీకరిస్తున్నారు:
ఎన్నికలు జరగకముందే సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డి ఓటమిని అంగీకరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామక్రిష్ణ అన్నారు. 82 మంది ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఎందుకు వచ్చిందో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కంటే జగన్ పెద్ద నియంత అని, వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఓడిపోతారని రామక్రిష్ణ పేర్కొన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టులో గేటు కొట్టుపోతే మరమ్మతులు చేయలేని అసమర్ధ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది అని విమర్శించారు.
ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్:
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి ఇవాల ఉదయం 11 గంటలకు డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి కేసీఆర్ నేరుగా బంజారాహిల్స్‌లోని నందినగర్‌లోని తన ఇంటికి పయనం అయ్యారు. తుంటి మార్పిడి శస్త్రచికిత్స కారణంగా కేసీఆర్ యశోద ఆసుపత్రిలో వారం రోజులుగా ఉన్నారు. చికిత్స అనంతరం కేసీఆర్ కొద్దిగగా కోలుకోవడంతో వైద్యులు ఈరోజు డిశ్చార్జి చేశారు. వేద పండితుల పూజల అనంతరం కేసీఆర్ ఆసుపత్రిని నుంచి బయలుదేరారు. కేసీఆర్‌తో పాటు యశోద ఆస్పత్రి నుంచి కేటీఆర్, హరీశ్ రావులు బయలుదేరారు. కేసీఆర్ మరో నాలుగైదు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ నెల 8వ తేదీ రాత్రి కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో జారి పడిపోయిన సంగతి తెలిసిందే.
ఎమ్మెల్యే ఫండ్ 7 కోట్లకు పెంపు:
ఢిల్లీ ప్రభుత్వం ఎమ్మెల్యే నిధిని రూ.4 కోట్ల నుంచి రూ.7 కోట్లకు పెంచింది. అదే సమయంలో ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలు రూ.10 కోట్లకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు శుక్రవారం ఎమ్మెల్యే నిధులను పెంచుతూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రి సౌరభ్ భరద్వాజ్ సభలో ఎమ్మెల్యే నిధులను పెంచడంపై సమాచారం అందించారు. ఎమ్మెల్యే నిధులను రూ.4 కోట్ల నుంచి రూ.7 కోట్లకు పెంచినందుకు సభ ద్వారా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతామన్నారు.
‘రుధిరాక్ష’ గ్రాండ్ లాంచ్:
యంగ్ డైనమిక్ ఆది సాయికుమార్ హీరోగా, వెర్సటైల్ యాక్టర్స్ జె.డి చక్రవర్తి, సత్యరాజ్ ప్రధాన పాత్రలలో 9 స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో తెరకెక్కనున్న పాన్ ఇండియా చిత్రం ‘రుధిరాక్ష’. శివ శంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజు జువ్వల నిర్మిస్తున్నారు. డార్క్, థ్రిల్లర్ నేపధ్యంలో రూపొందనున్న ఈ చిత్రానికి సంబధించిన పూజా కార్యక్రమం రామానాయడు స్టూడియోలో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి సముద్రఖని క్లాప్ కొట్టగా రామ్ తాళ్లూరి కెమరా స్విచాన్ చేశారు. ఫస్ట్ షాట్ కు డైరెక్టర్ దేవ్ దర్శకత్వం వహించారు.
అప్పుడు గాలిశీను… ఇప్పుడు అంజిగాడు:
కింగ్ నాగార్జున హీరోగా నటిస్తున్న నా సామిరంగ సినిమాలో అల్లరి నరేష్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నారు. అంజిగాడు అనే పాత్రలో నటిస్తున్న నరేష్ కి సంబందించిన ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేసారు. ‘మాటోచ్చేత్తాది అంటూ’ నరేష్ ఈ 55 సెకండ్ల ప్రోమోలో చేసిన అల్లరి అంతాఇంతా కాదు. ఈమధ్య కాలంలో మిస్ అయిన నరేష్ ని ఒక్క ప్రోమోతో మళ్లీ గుర్తు చేసింది నా సామిరంగ సినిమా. సింపుల్ గా చెప్పాలి అంటే.. అప్పుడు గాలిశీను, ఇప్పుడు అంజిగాడు అనేలా ఉంది నా సామిరంగ ప్రోమో.