కేరళ స్టోరీ వివాదం.. ఉగ్రశక్తులతో కాంగ్రెస్ ఒప్పందం.. మోడీ ఆరోపణ
ఏ ముహూర్తాన ది కేరళ స్టోరీ టీజర్ రిలీజ్ చేశారో కానీ, అప్పటినుంచి ఆ సినిమా చుట్టూ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. కేరళలో కనిపించకుండా పోయిన 32 వేలమంది యువతుల కథగా బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ తెరకెక్కించాడు. హార్ట్ ఎటాక్ బ్యూటీ అదా శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నేడు రిలీజ్ అయ్యి.. వివాదాన్ని మరింత పెంచింది. కేరళలో విద్వేషాలు రగల్చడానికే ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారని రాజకీయ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ వివాదంపై పీఎం మోడీ సైతం స్పందించారు. ఈ సినిమా తీవ్రవాదుల కుట్రను, చేదు నిజాలను చూపించారని అన్నారు. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరించి, నిజానిజాలు తెలుసుకోవాలని తెలిపారు. “కొన్నిరోజులుగా నేను కూడా చూస్తున్నాను. ది కేరళ స్టోరీ సినిమాపై పెద్ద చర్చనే జరుగుతుంది. కేరళలో ఉన్న కొన్ని ఉగ్ర శక్తుల గురించి ఈ సినిమాలో చూపించారు.వారు చేసిన అక్రమాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమా ఉగ్రవాదం గురించి తెలియజేసింది.. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కాంగ్రెస్.. ఆ ఉగ్ర శక్తులకు సపోర్ట్ ఇస్తోంది. ఉగ్రశక్తులతో కాంగ్రెస్ ఒప్పుందం చేసుకుంది. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ తో జాగ్రత్తగా ఉండాలి” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్ నే అందుకుంది. థియేటర్ వద్ద గొడవలు జరగకుండా పోలీసులు గస్తీ కాస్తున్నారు. మరి రికార్డులు, కలెక్షన్స్ ఈ సినిమాకు ఎలా వస్తాయో చూడాలి.
నేను టికెట్స్ ఇప్పించినవాళ్ళే నాపై ఫిర్యాదు చేశారు
ఏపీ రాజకీయాల్లో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యే పై కూడా సీఎంకి ఫిర్యాదు చేయలేదు..మూడు జిల్లాలు తిరుగుతూ సొంత నియోజకవర్గ కార్యక్రమాలకు సమయం కేటాయించడం కుదరటం లేదనే కో ఆర్డినేటర్ బాధ్యతలు వద్దని చెప్పానన్నారు బాలినేని. నేను టికెట్స్ ఇప్పించిన వాళ్ళే నాపై ఫిర్యాదులు చేయిస్తున్నారు..వాళ్ళతో కావాలనే కొందరు అలా చేయిస్తున్నారు..నాకు ఇతర పార్టీల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు..జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిస్థితులు చూడలేకపోతున్నాను…కావాలనే నాపై ఫిర్యాదులు చేస్తున్నారు. నాపై ఆరోపణల వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు..అన్నిటికీ అధిష్టానం పరిష్కారం చూపిస్తుందని భావిస్తున్నా అన్నారు. నా కార్యకర్తల కోసం నా రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడ్డా వాళ్ల కోసం వెనుకే ఉంటా..పార్టీ మీద ప్రేమ లేని వెధవలు పార్టీని భ్రష్టుపట్టించాలని చూస్తున్నారు. అన్నీ అధిష్టానం దృష్టిలో ఉన్నాయి.. వాళ్ల మీద చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నా అన్నారు బాలినేని. ఇటీవల ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే.
కర్నాటకలో కాంగ్రెస్ ఓడిపోతే నాదే బాధ్యత
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నో రోజులు లేని పక్షంలో.. రాజకీయ పార్టీలు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాయి. ముఖ్యంగా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలైతే ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించాలని కృత నిశ్ఛయంతో కాంగ్రెస్ ఉందని, తీరక సమయం లేకుండా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని అన్నారు. ఒకవేళ కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోతే.. అందుకే తనదే పూర్తి నైతిక బాధ్యత అని ప్రకటించారు. ఈమేరకు ఆయన ఒక జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కర్ణాటక ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ఖర్గే.. ఈసారి కచ్చితంగా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తామని, ఈసారి హంగ్ వచ్చే పరిస్థితి ఉండదని అభిప్రాయపడ్డారు. తాను రోజూ నాలుగు ర్యాలీల్లో పాల్గొంటున్నానని, ఒక్కోసారి 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని తెలిపారు. బీజేపీని ఎలాగైనా ఓడించాలని అకింతభావంతో ఉన్నామని, అందుకే ఎన్ని సవాళ్లనైనా అధిగమిస్తున్నామని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ విస్పష్ట మెజారిటీతో పగ్గాలు చేపడుతుందని, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బల్లగుద్ది మరీ చెప్పారు. ఎన్నికల్లో గెలవాలనే సంకల్పం, నిబద్ధత ఉండాలని అన్నారు.
మోచా తుఫాన్ తీవ్రతపై యంత్రాంగం అప్రమత్తం
ఎండాకాలం వానాకాలంగా మారింది. ఒకవైపు పంటలు నష్టపోయిన రైతులు లబోదిబోమంటున్నారు. మండువేసవిలో తుఫాన్లు అలజడి రేపుతున్నాయి. ఐఎండి అంచనా ప్రకారం రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడనుంది దీని ప్రభావంతో ఎల్లుండి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. ఇది సోమవారం నాటికి వాయుగుండంగా మారి ఆతర్వాత ఉత్తరదిశగా మధ్య బంగాళాఖాతం వైపు కదులుతూ తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు. అయితే ప్రస్తుత సమాచారం మేర ఈతుఫాన్ బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల దిశగా వెళ్లే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈక్రమంలో ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి ముప్పు ఉండకపోవచ్చని వెల్లడించారు. అల్పపీడనం ఏర్పడిన తదుపరి ఐఎండి సమాచారం మేరకు ఇతర వివరాలు తెలియజేస్తామన్నారు. ఏదిఏమైప్పటికీ అల్పపీడనం ఏర్పడనున్న నేపధ్యంలో జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఆదివారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని, వేటకు వెళ్ళిన మత్స్యకారులు రేపటిలోగా తిరిగి రావాలని కోరారు. అత్యవసర సహయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070, 112, 18004250101 సంప్రదించాలన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్ల క్రింద నిలబడవద్దని విజ్ఞప్తి చేశారు.
అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా.. స్మారక చిహ్నం
ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం నాడు హుస్సేన్ సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరుగుతూ పనులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రధాన ద్వారం, ల్యాండ్ స్కేప్ ఏరియా, పార్కింగ్ ఏరియా, తెలంగాణ తల్లి విగ్రహం, ఫౌంటైన్ ఏరియా, గ్రానైట్ ఫ్లోరింగ్, ఫోటో గ్యాలరీ, ఆడియో, విజువల్ రూం, లిఫ్ట్ లు, ఎస్కలేటర్, కన్వెన్షన్ సెంటర్‌పై అంతస్థులో రెస్టారెంట్,నిరంతరం జ్వలించే జ్వాలలా ఉండే జ్యోతి ఆకృతి ఇలా అన్ని రకాల పనులు పరిశీలించారు. ఈ సందర్బంగా సీఎం కేసిఆర్ ఆదేశానుసారం అధికారులకు, నిర్మాణ సంస్థ కు పలు సూచనలు చేశారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలు ప్రతిబింబించేలా.. ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగర నడి బొడ్డున,హుస్సేన్ సాగర్ తీరాన ఈ నిర్మాణం చేపట్టారని అన్నారు. అరుదైన స్టెయిన్ స్టీల్ తో అన్ని రకాల అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో,సకల హంగులతో స్మారకాన్ని నిర్మించామని తెలిపారు. ప్రపంచంలోనే అరుదైన స్టెయిన్ లెస్ స్టీల్ తో నిర్మించిన అతిపెద్ద కట్టడం ఇదేనని అన్నారు. ఈ నిర్మాణం పూర్తి అయి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచమే అబ్బురపడి చూస్తుందని చెప్పారు. స్మారక ప్రాంగణానికి ఎవరు వచ్చినా అమరవీరుల త్యాగాలు గుర్తు చేసుకునే విధంగా ఈ నిర్మాణంలో ఏర్పాట్లు ఉండబోతున్నాయని అన్నారు.
వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్.. క్షణాల్లో లోన్ రెడీ
ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో డిజిటలైజేషన్ పెరుగుతోంది కాబట్టి.. ఫైనాన్స్ రంగం కూడా డిజిటల్‌గా మరిన్ని సేవలను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పుడు IIFL ఫైనాన్స్ సంస్థ వాట్సాప్‌లో వినియోగదారులకు రూ. 10 లక్షల వరకు వ్యాపార రుణాన్ని అందిస్తోంది. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. వాట్సాప్‌లో బిజినెస్ లోన్ అనేది MSME లెండింగ్ పరిశ్రమలో మొదటి-రకం చొరవ అని ఆ సంస్థ తెలిపింది. మన భారతదేశంలో ఉన్న 45 కోట్లకు పైగా వాట్సాప్ వినియోగదారులు.. ఈ IIFL ఫైనాన్స్ నుండి 24×7 ఎండ్-టు-ఎండ్ డిజిటల్ లోన్ సదుపాయాన్ని పొందవచ్చని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఒక శక్తివంతమైన ఏఐ-బాట్ వాట్సాప్‌లో రుణ ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది. ఇది వినియోగదారుల ఇన్‌పుట్‌లను లోన్ ఆఫర్‌కు సరిపోల్చి, అప్లికేషన్‌ను సులభతరం చేస్తుంది. వాట్సాప్ వినియోగదారులు 9019702184 అనే నంబర్‌కు కేవలం “హాయ్” అనే మెసేజ్ పంపితే.. IIFL ఫైనాన్స్ నుంచి నేరుగా లోన్ పొందవచ్చు. కాగితరహిత ప్రక్రియను త్వరగా పూర్తి చేసి.. ఖాతాలో డబ్బులు పొందవచ్చు. IIFL ఫైనాన్స్‌లో బిజినెస్ హెడ్ భరత్ అగర్వాల్ మాట్లాడుతూ.. “IIFL ఫైనాన్స్ సంక్లిష్టమైన లోన్ అప్లికేషన్‌ను సులభతరం చేసింది. వాట్సాప్ ద్వారా పేపర్‌లెస్ రుణ దరఖాస్తుని అందుబాటులోకి తీసుకొచ్చింది. చిరు వ్యాపారవేత్తలపైనే మేము ప్రధానంగా దృష్టి సారించాం. ఈ వాట్సాప్ ద్వారా తక్షణమే వ్యాపార రుణం అందిస్తాం’’ అంటూ చెప్పుకొచ్చారు.
విలువలతో కూడిన రాజకీయం నా ఎజెండా
రాజకీయాల్లో మొదటి నుంచి విలువలతో కూడిన రాజకీయాలు చేశానన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. 1987 నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి రాజకీయాల్లో ఉన్నా..మొదటి నుంచి విలువలతో కూడిన రాజకీయాలు చేశా..1999 వైఎస్ఆర్ రాజకీయ బిక్షతో ఎమ్మెల్యే అయ్యా..2009లో వైఎస్ఆర్ క్యాబినెట్ లో మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు..వైఎస్ఆర్ మరణం తర్వాత మంత్రి పదవి పోతుందని తెలిసి కూడా జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొన్నా అన్నారు. మంత్రి పదవి, ఎమ్మెల్యే వదులుకుని వైసీపీలోకి వచ్చి పోటీ చేసి గెలిచానన్నారు. జిల్లాలోని ప్రతీ నియోజకవర్గంలో నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు..ఈ మధ్య కాలంలో చెన్నై హవాలా అంటారు..ఎవరెవరో ఏదేదో నాపై మాట్లాడుతున్నారు..గోనె ప్రకాశరావు ఆరోపణల్లో అర్థం లేదు..వైవీ సుబ్బారెడ్డి మంచివాడు.. నేను చెడ్డవాన్ని అంటాడు..సీఎం జగన్, భారతమ్మ జైలుకి వెళ్లటం ఖాయం అంటారు.. వైవీ సుబ్బారెడ్డి మంచివాడు అంటారు..తెలంగాణకు సంబందించిన ఆయనకు ఇక్కడి రాజకీయాలతో ఏం పని..నాపై ఎమ్మెల్యేలతో సీఎంకి ఫిర్యాదులు చేయిస్తారు..మంచి చేయటానికి రాజకీయాల్లోకి వచ్చా తప్ప దోచుకోవటానికి కాదు..భరించలేనంతగా నాపై ఆరోపణలు చేస్తున్నారు..
హిమోగ్లోబిన్ పెరగాలంటే.. ఈ ఆహారాలను తినండి
రక్తహీనత అనేది రక్తంలో హిమోగ్లోబిన్, ఎర్ర రక్త కణాల లోపం ఉన్నప్పుడు సంభవించే వ్యాధి. శరీరంలో ఐరన్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల ఇది సంభవిస్తుంది. ఇది అలసట, బలహీనతను కలిగిస్తుంది. అయితే ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మహిళలు, పిల్లల్లో ఈ ఐరన్ లోపం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రోజూ ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెట్టడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చు. హిమోగ్లోబిన్ ఉత్పత్తికి అవసరమైన అనేక ఆహారాలు లేదా మూలికలలో ఐరన్ లభిస్తుంది… అని నిపుణులు చెబుతున్నారు. వాటిలో.బీట్‌రూట్ : బీట్‌రూట్‌లో ఐరన్, కాపర్, ఫాస్పరస్, మెగ్నీషియం మరియు విటమిన్లు బి1, బి2, బి6, బి12 మరియు సి పుష్కలంగా ఉన్నాయి. దుంపలలోని అనేక పోషకాలు మీ శరీరంలో ఎర్ర రక్త కణాల (RBCs) ఉత్పత్తిని ప్రేరేపించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. బీట్‌రూట్‌ను జ్యూస్‌తో లేదా లేకుండా తినవచ్చు.ఎండు ద్రాక్ష : ఎండుద్రాక్షలో ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్ ఎ మరియు సి పుష్కలంగా ఉన్నాయి. ఎండుద్రాక్ష రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు ఇనుము శోషణను ప్రోత్సహిస్తుంది.నువ్వులు : నువ్వులలో ఐరన్, కాపర్, జింక్, సెలీనియం, విటమిన్లు బి6, ఇ మరియు ఫోలేట్ ఉంటాయి. ప్రతిరోజూ నల్ల నువ్వులను తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయని మరియు ఐరన్ శోషణను ప్రోత్సహిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
‘హను-మాన్’ వాయిదా.. కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే?
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి చిత్రం ‘హను-మాన్’. టాలెంటెడ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. టీజర్ లో చూపిన విధంగా, ‘హను-మాన్’ టాప్-నాచ్ విజువల్ ఎఫెక్ట్స్ తో రాబోతోంది. ఈ చిత్రాన్ని మొదట వేసవిలో మే 12న విడుదల చేయాలని భావించారు. అయితే, అది వాయిదా పడింది. హ్యూజ్ వీఎఫ్ ఎక్స్ వర్క్ ఈ ఆలస్యానికి కారణమని మేకర్స్ చెబుతున్నారు. దీని గురించి మాట్లాడుతూ, “టీజర్ కు ట్రెమండస్ రెస్సాన్స్ వచ్చింది. వీఎఫ్ ఎక్స్ హాలీవుడ్ సినిమాలతో సమానంగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. టీజర్ లో ప్రేక్షకులు చూసింది ఫైనల్ ప్రోడక్ట్ కి సాంపిల్ మాత్రమే. ఇటీవల వచ్చిన ఆర్ట్‌వర్క్ తో కూడిన హనుమాన్ చాలీసా కూడా భారీ స్పందన వచ్చింది” అని అన్నారు. ‘హనుమాన్’ టీజర్‌పై ప్రేక్షకులు చూపించిన అపరిమితమైన ప్రేమ తమ మనసుని హత్తుకుందని, దీంతో సినిమా విషయంలో తమ పై బాధ్యత మరింత పెరిగిందని, అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునేలా, హనుమంతుడి స్ఫూర్తికి అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామ’ని దర్శక నిర్మాతలు హామీ ఇస్తున్నారు.