Nitish Kumar Reddy Bhimavaram Bulls Captain in APL 2025: తెలుగు ఆటగాడు, భారత్ యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కెప్టెన్ అయ్యాడు. అయితే నితీశ్ రెడ్డి సారథి అయింది టీమిండియాకు కాదండోయ్.. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) 2025లో భీమవరం బుల్స్ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా నియమించబడ్డాడు. ఈ విషయాన్ని భీమవరం బుల్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. తాజాగా విశాఖలో జరిగిన వేలంలో నితీశ్ రెడ్డిని రూ. 10 లక్షలకు బుల్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
నితీశ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు. ఇప్పటికే మూడు టెస్టులు ఆడిన అతడు.. నాలుగో టెస్ట్ కోసం సిద్దమవుతున్నాడు. ఈ సిరీస్ ఆగష్టు 4న ముగుస్తుంది. ఆపై భీమవరం బుల్స్ జట్టులో చేరనున్నాడు. ఏపీఎల్ 2025 ఆగప్ట్ 8న ప్రారంభమై.. 24న ముగుస్తుంది. ఈ టోర్నీ విశాఖ స్టేడియంలో జరుగనుంది. ఇప్పటికే ఏపీఎల్‌లో మూడు సీజన్లు ముగియగా.. నాలుగో ఎడిషన్ త్వరలో ప్రారంభం కానుంది. లీగ్‌లో ఈసారి 7 జట్లు పాల్గొంటాయి. అమరావతి లయన్స్, భీమవరం బుల్స్, కాకినాడ కింగ్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్, తుంగభద్ర వారియర్స్, విజయవాడ సన్‌షైనర్స్ బరిలోకి దిగుతున్నాయి. కోస్టల్ రైడర్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్ ఛాంపియన్లుగా నిలిచాయి.
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున నితీశ్ కుమార్ రెడ్డి ఆడుతున్నాడు. అతడిని గత వేలంలో రూ. 6 కోట్లకు అట్టిపెట్టుకుంది. నితీశ్ భారత్ తరపున టీ20, టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు. నితీష్ రెడ్డి ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఆడుతున్నాడు. మొదటి రెండు మ్యాచ్‌లలో బ్యాటింగ్‌లో రాణించలేదు కానీ.. లార్డ్స్ టెస్ట్‌లో బౌలింగ్‌లో ప్రభావం చూపాడు. నితీశ్ తన నాయకత్వంలో భీమవరం బుల్స్ ఫ్రాంచైజీ కప్ అందిస్తాడేమో చూడాలి.
Also Read: IND vs ENG: ఆడే మ్యాచ్‌లను ఎంచుకోవడం ఏంటి?.. బుమ్రాపై భారత్ మాజీ కెప్టెన్ ఫైర్!
భీమవరం బుల్స్ టీమ్:
నితీష్ కుమార్ రెడ్డి (కెప్టెన్), హరి శంకర్ రెడ్డి, హేమంత్ రెడ్డి, సత్యనారాయణ రాజు, పిన్నిటి తేజస్వి, సాయి శ్రవణ్, టి వంశీ కృష్ణ, మునీష్ వర్మ, ఎం యువన్, కె రేవంత్ రెడ్డి, బి సాత్విక్, సాయి సూర్య తేజ రెడ్డి, శశాంక్ శ్రీవత్స్, సి రవితేజ, సిహెచ్ శివ, ఎన్ హిమాకర్, కశ్యప్ ప్రకాశ్, భస్వంత్ కృష్ణ, జె విష్ణు దత్తా, భువనేశ్వర్ రావు.