Delhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆప్ అధికారానికి బ్రేకులు వేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ 48 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే, ప్రస్తుతం ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్ర మోడీ ఈ వారం అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాతే ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 13న ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఉంది. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడంతో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఎన్డీయే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన నేతలు హాజరవుతారని తెలుస్తోంది.
Read Also: BJP Celebrations: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా ఢిల్లీ విజయోత్సవ సంబరాలు
దేశ రాజధానిలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ఈ సాయంత్రం కొత్తగా ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. నిన్న సాయంత్రం బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డాలు ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణస్వీకార కార్యక్రమం గురించి చర్చించారని తెలుస్తోంది.
బీజేపీ ఇప్పటికీ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేదానిని ప్రకటించినప్పటికీ, న్యూఢిల్లీలో కేజ్రీవాల్‌ని ఓడించిన పర్వేష్ వర్మ ముందు వరసలో ఉన్నట్లు తెలుస్తోంది. పశ్చిమ ఢిల్లీ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన వర్మకు గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా అవకాశం ఇవ్వలేదు. వ్యూహాత్మకంగా ఢిల్లీ అసెంబ్లీ రేసులో నిలిపింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ని పర్వేష్ వర్మ 4000 ఓట్ల తేడాతో ఓడించారు. పర్వేష్ వర్మ ఢిల్లీ మాజీ సీఎం, దివంగత సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు.