Neeraj Chopra on India Medals: పతకాల సంఖ్యను పోల్చడం ఏమత్రం సరికాదని గోల్డెన్ బాయ్, భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఒలింపిక్స్‌లో నాలుగో స్థానం సాధించడం సామాన్యమైన విషయం కాదన్నాడు. పారిస్‌లో భారత ఆటగాళ్లు సాధించన దాన్ని తక్కువ చేసి చూడటానికి వీల్లేదన్నాడు. క్రీడా సంస్కృతిలో మనకంటే మెరుగ్గా కొన్ని దేశాలు ఉన్నాయని నీరజ్ పేర్కొన్నాడు. టోక్యో ఒలింపిక్స్ పతకాలతో పోలిస్తే పారిస్ ఒలింపిక్స్ 2024లో తగ్గినట్లు వాదనలు వస్తున్న వేళ భారత్ ఒలింపిక్ బృందానికి మద్దతుగా స్పందించాడు.
జావెలిన్ త్రో అర్హత పోటీల అనంతరం నీరజ్ చోప్రా మాట్లాడుతూ… ‘పారిస్ ఒలింపిక్స్ 2024లో మన బృందం బాగా ఆడుతోంది. విశ్వక్రీడల్లో నాలుగో స్థానంలో నిలిచిన వారిని మనం ఏమాత్రం విస్మరించలేం. ఒలింపిక్స్‌లో పాల్గొనడం, ఫైనల్స్ ఆడటం సాధారణ విషయం కాదు. మనకే కాదు మిగిలిన దేశాలకు కూడా ఇది పెద్ద అంశమే. క్రీడా సంస్కృతిలో మనకంటే మెరుగ్గా ఉన్న కొన్ని దేశాలు ఉన్నాయి. టోక్యో’తో పతకాల పట్టికతో పోలుస్తున్నారని విన్నా. అలా చేయకూడదు. ప్రతిచోటా భిన్న పరిస్థితులు ఉంటాయి. మనలాగే ఇతరులూ సిద్దమవుతారు. ఆటల్లో కొన్ని దేశాలు భారత్ కంటే ముందున్నాయనే వాస్తవాన్ని ఒప్పుకోవాలి. ఆట మెరుగుపర్చుకొనే కొద్దీ పతకాల పట్టికలో భారత్ కూడా ముందుకు వస్తుంది’ అని అన్నాడు.
Also Read: Bitthiri Sathi: భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన బిత్తిరి సత్తి!
ఆగష్టు 6న జరిగిన క్వాలిఫయర్స్‌లో నీరజ్ చోప్రా గ్రూప్-బీ విభాగంలో తొలి ప్రయత్నంలోనే 89.34 మీటర్ల దూరం బల్లెం విసిరి టాప్ ప్లేస్‌లో నిలిచాడు. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ నేటి రాత్రి 11.55 గంటలకు జరగనుంది. అయితే ఫైనల్లో మనోడికి గట్టి పోటీ ఎదురుకానుంది. ఫైనల్ ప్రత్యర్థులు ముగ్గురు నీరజ్ అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన (89.94 మీటర్లు) కన్నా మెరుగైన రికార్డును కలిగి ఉన్నారు. అయితే పోటీల రోజు పరిస్థితుల్లో ఎవరు ఉత్తమ ప్రదర్శన చేస్తారన్నదే కీలకం. నేటి రాత్రి జరిగే ఫైనల్ పోరులోనూ నీరజ్ పసిడి గెలవాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.