Andhra Pradesh: అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలంతా పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. తొలి రోజునే సభలో వైసీపీ చేసిన ఆందోళనను పలువురు సభ్యులు ప్రస్తావించారు. జగన్ సహా వైసీపీ సభ్యులు ఫ్రస్ట్రేషనులో ఉన్నారని ఇంకొందరు సభ్యులు భేటీలో పేర్కొన్నారు. పోలీసులపై ఈ స్థాయిలో విరుచుకుపడి తనలోని అసహనాన్ని జగన్ బయటపెట్టుకున్నారన్న పలువురు జనసేన ఎమ్మెల్యేలు ప్రస్తావించినట్లు తెలిసింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించొద్దంటూ ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. ఇసుక జోలికి ఎవ్వరూ వెళ్లొద్దని ఆయన సూచించగా.. ఇసుక ధరల విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని పలువురు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు తెలిపారు. మూడు పార్టీల మధ్య కో-ఆర్డినేషన్ అంశాన్ని ప్రస్తావించిన నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తాను.. తన పార్టీ ఎమ్మెల్యేలం సపోర్ట్ చేస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Read Also: BAC Meeting: ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీలో ఖరారు
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..”శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తన మన అనే విషయాన్ని కూడా చూడను. నన్నే జైలుకు పంపారు.. కక్ష సాధింపు చేయాలనుకుంటే నేనూ చేయగలను. కానీ కక్ష సాధింపు వ్యవహరాన్ని నేను పట్టించుకోవడం లేదు.. ఎమ్మెల్యేలూ కక్ష పూరితంగా వ్యవహరించొద్దు. రాజకీయ ప్రతీకారాలకు పోవద్దు. శాంతి భద్రతల విషయంలో నిష్కర్షగా ఉంటా. ఇసుక జోలికి ఎవ్వరూ వెళ్లొద్దు. ఇసుక విధానాన్ని మరింత పారదర్శకంగా అమలు చేస్తాం. ఇసుక విధానంపై మరిన్ని సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి. ప్రభుత్వం వచ్చి నెల రోజుల కాలేదు.. అప్పుడే జగన్ విమర్శలు మొదలు పెట్టేశారు. జగన్ సహజ ధోరణి వీడలేదు. గవర్నర్ ప్రసంగాన్ని తొలి రోజునే అడ్డుకోవడం కరెక్టేనా.? తప్పులు చేయడం.. పక్క వారిపై నెట్టేయడం జగనుకు అలవాటు. వివేకా మర్డర్ విషయంలో వేరే వాళ్లకు మీదకు నెట్టే ప్రయత్నం చేశారు. వినుకొండలోనూ ఇదే జరుగుతోంది. గతంలో ప్రభుత్వ వ్యవస్థలు పని చేయడం మానేశాయనడానికి మదనపల్లె ఘటనే నిదర్శనం. అర్థరాత్రి ప్రమాదం జరిగితే మర్నాడు వరకు జిల్లా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం సరిగా స్పందించలేదు. డబ్బుల్లేవని పనులు చేయలేం అని చెప్పలేం. నిధులతో ఇబ్బందులున్నా పనులు చేయాలి. ముందుగా రోడ్లకు పడిన గుంతలు పూడ్చే కార్యక్రమం చేపడదాం.” అని ఆయన పేర్కొన్నారు.