ప్రస్తుతం ఓటీటీల ప్రభావంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గుతున్న తరుణంలో, సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి చిత్రబృందాలు ప్రమోషన్ల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే, స్టార్ హీరోయిన్ నయనతార మాత్రం దశాబ్ద కాలంగా ఏ సినిమా ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొనకుండా ‘నో ప్రమోషన్’ పాలసీని పాటిస్తూ వస్తున్నారు. కానీ తాజాగా, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా కోసం ఆమె ఈ నిబంధనను పక్కన పెట్టడం ఇప్పుడు కోలీవుడ్‌లో పెను సంచలనంగా మారింది. ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి తో కలిసి ఆమె ప్రమోషనల్ వీడియోలో సరదాగా కనిపించడమే కాకుండా, స్వయంగా ప్రమోషన్ల గురించి అడగడం తమిళ సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Also Read : Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్ హీట్ పెంచిన దేవిశ్రీ
నయనతార తీసుకున్న ఈ నిర్ణయం తమిళ ప్రేక్షకులకు మరియు నిర్మాతలకు అస్సలు నచ్చడం లేదు. కోలీవుడ్‌లో ఎంతటి అగ్ర హీరోలతో నటించినా, కనీసం తన సొంత లేడీ ఓరియెంటెడ్ సినిమాల విడుదలప్పుడు కూడా కనిపించని నయన్, తెలుగు సినిమా కోసం ఇలా ముందుకు రావడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “తమిళ సినిమాలంటే మీకు తక్కాలి చట్నీ (టమాటా పచ్చడి) లాగా చులకనగా కనిపిస్తున్నాయా?” అంటూ నెటిజన్లు ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు. తమ సినిమాల ప్రమోషన్లకు రాకుండా కోలీవుడ్ నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న నయనతార, టాలీవుడ్ విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తోందని అక్కడి సినీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.