విజయవాడలో ఈ నెల 7వ తేదీన ఇందిరా గాంధీ స్టేడియంలో వైసీపీ బీసీ నేతలతో భారీ సభ నిర్వహించనున్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో సభ ఏర్పాట్లను వైసీపీ మంత్రులు, ఎంపీ విజయసాయిరెడ్డి, ఇతర నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా వైసీపీ బీసీ మహాసభ పోస్టర్‌ను మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేశ్, చెల్లుబోయిన వేణు, ఎంపీ విజయ సాయిరెడ్డి, ఇతర నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 7వ తేదీన జయహో బీసీ మహా సభ నిర్వహిస్తున్నామని, 84 వేల మంది బీసీ నేతలను ఆహ్వానిస్తున్నామన్నారు. ఉదయం 8 గంటలకు బ్రేక్ ఫాస్ట్ తో సభ ప్రారంభం అవుతుందని, 10 గంటల నుంచి నేతల ప్రసంగాలు ఉంటాయన్నారు. 16 మంది నేతలు మాట్లాడతారని, మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు ముఖ్యమంత్రి జగన్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. నాయకులు అందరినీ వ్యక్తిగతంగా ఆహ్వానాలు వెళతాయన్నారు. ఈ మహా సభ అనంతరం రీజనల్, జిల్లా, నియోజకవర్గాల వారీగా సమావేశాలు కొనసాగుతాయని, వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఈ ప్రక్రియ అంతా పూర్తి అవుతుందన్నారు.
Also Read : SAM BAHADUR: 365 రోజుల తర్వాత రిలీజ్ కానున్న విక్కీ కౌశల్ సినిమా
అంతేకాకుండా.. ఇదేం ఖర్మ బాబు అని రాష్ట్ర ప్రజలు అందరూ చంద్రబాబు గురించి అనుకుంటున్నారని ఆయన విమర్శించారు. మాది పేదల ప్రభుత్వం, రాష్ట్రంలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ఏం సాధించారో ఆత్మ విమర్శ చేసుకోవాలని, తన సామాజిక వర్గానికి, తన అనుచరులకు మినహా సమాజానికి చేసింది శూన్యమన్నారు. చంద్రబాబుది ధనికుల ప్రభుత్వమని, కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుకు జెడ్ ప్లస్ క్యాటగిరీ ఇచ్చిందని, అయినా చంద్రబాబు ఎందుకు డ్రామాలు ఆడుతున్నాడు?? కేంద్ర బలగాల మీద చంద్రబాబుకు నమ్మకం లేదా?? అని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. ఇవే చంద్రబాబుకు, టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు అని, లోకేష్ పాదయాత్ర కాదు పొర్లు దండాలు పెట్టినా ఎటువంటి ప్రయోజనం లేదన్నారు విజయసాయిరెడ్డి. లోకేష్ రాజకీయ అవగాహన లేని వ్యక్తి అని, చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ సైకోలే అన్న విజయసాయిరెడ్డి.. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ పార్టీ ఉండదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read : Border Dispute: కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు వివాదం.. జెండా పట్టుకున్నందుకు తోటి విద్యార్థిపై దాడి