టీమిండియా పేసర్, హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ సింగర్ జనై భోస్లేతో డేటింగ్ చేస్తున్నట్లు నెట్టింట వార్తలొచ్చాయి. ఇటీవల ముంబైలోని బాంద్రాలో జనై 23వ పుట్టినరోజు వేడుకలు జరగగా.. సిరాజ్ హాజరయ్యాడు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను బాలీవుడ్ సింగర్ తన ఇన్‌స్టాలో పోస్టు చేయగా.. ఓ ఫొటోలో ఇద్దరూ (జనై, సిరాజ్) కాస్త సన్నిహితంగా ఉన్నట్లు ఉంది. దాంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు పలు వెబ్ సైట్‌లు వార్తలు రాసుకొచ్చాయి.
జనై భోస్లేతో డేటింగ్ వార్తలు మహ్మద్ సిరాజ్ వద్దకు చేరాయి. దాంతో సిరాజ్ ఓ క్లారిటీ ఇచ్చాడు. జనై తనకు చెల్లెలు లాంటిదని, దయచేసి అసత్య ప్రచారాలు చేయొద్దని ఇన్‌స్టా స్టోరీలో సిరాజ్ పేర్కొన్నాడు. ‘జనై భోస్లే నాకు సోదరి. ఆమె లేకుండా నేను ఎక్కడా ఉండాలనుకోను. నక్షత్రాలతో చంద్రుడు ఉన్నట్లే ఆమె వెయ్యి మందిలో ఒకరు’ అని సిరాజ్ పోస్టు చేశాడు. సిరాజ్ తనకు సోదరుడని జనై కూడా ఇన్‌స్టా స్టోరీలో తెలిపింది. లెజండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలే ఈ జనై. మరోవైపు సిరాజ్ విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.