Vasantha Krishna Prasad: ఏపీలో పెన్షన్ పంపిణీ వ్యవహారం రాజకీయంగా కాకరేపుతోంది.. ఈ రోజు ఏకంగా ముగ్గురు వృద్ధులు పెన్షన్ కోసం బయటకు వెళ్లి వడదెబ్బతో మృతిచెందారని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.. అయితే, పెన్షన్ పంపిణీకి డబ్బు లేక వాయిదాలు వేశారని ఆరోపించారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం పర్యటనలో ఎన్నికల శంఖారావం సమీక్షా సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో వైసీపీలో ఉన్న మేం ఏర్పాటు చేసిన వారే వాలంటీర్లు అన్నారు. వైసీపీ కుటుంబ సభ్యులు కాబట్టే ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని ప్రభుత్వానికి 15 రోజుల ముందే ఎన్నికల కమిషన్ నోటీస్ పంపిందన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకి ఆపాదించి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.
Read Also: Mango production: ఈ ఏడాది మామిడి పంటకు తిరుగులేదు.. పెరగనున్న దిగుబడి..
ఇక, రాష్ట్రంలో సుమారు ఒక లక్షా యాభై వేల కోట్లు కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు ఉన్నాయి.. వారిలో కొంత మంది వద్ద కమీషన్లు తీసుకుని బిల్లులు క్లియర్ చేశారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. కాగా, గత ఎన్నికల్లో మైలవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాదించిన వసంత.. ఎన్నికల ముందు చోటు చేసుకున్న పరిణామాలతో వైసీపీకి గుడ్‌బై చెప్పి.. తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం విదితమే.. ఇక, మాజీ మంత్రి, సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావును పక్కనబెట్టి.. వసంత కృష్ణప్రసాద్‌కే టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ కేటాయించిన విషయం తెలిసిందే.