నెల్లూరు జిల్లాలో పరిశ్రమలు, విమానాశ్రయ ఏర్పాటుపై వివిధ శాఖల అధికారులతో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ పొంగూరు నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు నగరం చుట్టూ ఉన్న రైస్ మిల్లులను ఇతర ప్రాంతాలకు తరలించాలని భావిస్తున్నామన్నారు. ఒకప్పుడు నగర శివార్లలో ఉన్న ఈ మిల్లులు.. నగరం విస్తరించడంతో నడిబొడ్డులోకి వచ్చాయని తెలిపారు. కృష్ణపట్నం పోర్టు లేదా కిసాన్ ఎస్.ఈ.జెడ్‌లోకి మార్చాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. అందుకోసం.. రైస్ మిల్ అసోసియేషన్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. జిల్లాకు ఎంతో అవసరమైన దగదర్తి విమానాశ్రయ పనులు కూడా త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. జిల్లాలో కృష్ణపట్నం, రామయ్యపట్నం పోర్టులు, జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్‌లు ఉన్నాయి.. వీటికి అనుబంధంగా పరిశ్రమలు రానున్నాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వీటికి విమానాశ్రయం ఎంతో అవసరం.. విమానాశ్రయానికి 13 వందల 79 ఎకరాలు అవసరమని గుర్తించారని అన్నారు. కొంత భూమికి పరిహారం ఇచ్చారు.. ఇంకా భూమిని సేకరించాల్సి ఉందన్నారు. ఈ విషయం పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చిస్తాం.. త్వరలోనే ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ప్రతినిధులు వచ్చి పరిశీలన చేస్తారని మంత్రి తెలిపారు.
Read Also: BC Caste Enumeration : బీసీ కులాల సర్వే ప్రజావాణి సోమవారం నుంచి ప్రారంభం..?
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డా.పొంగూరు నారాయణ మాట్లాడుతూ.. నెల్లూరుకు విమానాశ్రయం ఎంతో అవసరం అని అన్నారు. టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.. వైసీపీ హయాంలో విమానాశ్రయం గురించి పట్టించుకోలేదని తెలిపారు. వేరే ప్రదేశానికి తరలించాలని చూశారు.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత దగదర్తిలోనే పెట్టాలని నిర్ణయించారన్నారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చించాను.. భూసేకరణ చేస్తే వెంటనే పనులు మొదలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారని అన్నారు. త్వరలోనే ఒక కమిటీని పంపుతామని చెప్పారని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
Read Also: Bomb Threat: విజయవాడలోని ఓ హోటల్‌కు బాంబు బెదిరింపు..