ప్రధాని మోడీ ప్రభుత్వం కామన్ మ్యాన్ ప్రభుత్వం కాదు, కార్పోరేట్ల ప్రభుత్వమంటూ మండిపడ్డారు మంత్రి కేటీఆర్. పెట్రో ధరలను తగ్గించకుండా, కార్పోరేట్ అయిల్ కంపెనీలకు విండ్ ఫాల్ టాక్స్ తగ్గించడంపైన మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కార్పొరేట్లకు వరం – సామాన్యులపై భారం..! అంటూ ఆయన వ్యాఖ్యానించారు. చమురు కంపెనీలకు లాభాలు-జనం జేబులకు చిల్లులు..! అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదే బీజేపీ ప్రభుత్వ విధానం అన్న కేటీఆర్.. ప్రజలపై పెట్రోభారం తగ్గించడమంటే స్పందించని మోడీ సర్కార్, కార్పొరేట్ కంపెనీలకు మాత్రం పన్నులు తగ్గిస్తున్నది అంటూ చురకలు అంటించారు. ప్రజల బాధలు తీర్చడం కంటే తనకు కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలే ముఖ్యమని తన నిర్ణయంతో కేంద్రం మరోసారి స్పష్టం చేసిందని, రష్యా నుంచి తక్కువ రేటుకు ముడిచమురు కొన్నా… పైసా మందం కూడా ప్రజలకు ప్రయోజనం కలగలేదన్నారు. 35 వేల కోట్ల రూపాయల ముడిచమురు పొదుపు అంతా మోడీ ప్రభుత్వ నిర్ణయంతో ఒకటి రెండు ఆయిల్ కంపెనీలకే దక్కిందన్నారు.
Also Read : Sanskrit: 2500 ఏళ్ల నాటి సంస్కృత గ్రామర్ సమస్యను పరిష్కరించిన 27 ఏళ్ల యువకుడు
ఈ కంపెనీల లాభాలు ఎవరి జేబుల్లోకి పోతున్నాయని ప్రశ్నించిన కేటీఆర్.. ఆ కంపెనీల లాభాలపై పన్ను తగ్గించి, కేంద్ర ప్రభుత్వం తన ప్రజావ్యతిరేక నైజాన్ని మరోసారి చాటుకుందన్నారు. మోడీ మిత్రులైన కార్పొరేట్ ఆయిల్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, కేంద్రం కార్పొరేట్ కంపెనీల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలన్నారు. 2014 నుంచి అడ్డగోలుగా పెంచిన సెస్సులను రద్దుచేసి పెట్రోల్ ధరలు తగ్గించాలని, ఇప్పటికే సెస్సుల రూపంలో 30 లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుంచి బీజేపీ ప్రభుత్వం దోచుకుందన్నారు. పెట్రో ధరల పెంపులో ఎలాంటి ప్రమేయం లేని తెలంగాణలాంటి రాష్ర్టాలపై దుష్ప్రచారాన్ని అపాలని ఆయన మండిపడ్డారు.