Minister Jagadish Reddy Fires on Union Government
విద్యుత్ సంస్కరణల పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుపై బీజేపీయేతర రాష్ట్రాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో.. సీఎం కేసీఆర్ విద్యుత్ సంస్కరణ బిల్లు విషయమై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాజాగా తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యుత్ మీదే ఆధారపడి వ్యవసాయ రంగం ఉండేదన్నారు. గతంలో చాలా ఇబ్బందులు ఉండేవని, గత ప్రభుత్వంలో విద్యుత్ చార్జీలు పెంచినప్పుడు తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడుతుందని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకటి మయం అవుతుందని గత పాలకులు విమర్శించారన్నారు.
రాష్ట్ర ఏర్పాటు జరిగిన కేవలం 5 నెలల్లోనే వ్యవసాయానికి మినహా 24 గంటల కరెంట్ ఇచ్చామని, మూడేళ్లలోపు వ్యవసాయనికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. గతంలో తలసరి విద్యుత్ 975 యూనిట్లు కాగా ఇప్పుడు 2,126 యూనిట్లుగా ఉందని, యూపీలో తలసరి విద్యుత్ వినియోగం 400 యూనిట్లు కూడా లేదన్నారు. దేశంలోనే తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది.. దీనికి విద్యుత్ వినియోగమే నిదర్శనం.. గుజరాత్ లో కూడా వ్యవసాయానికి 6 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నారని ఆయన వెల్లడించారు.