గజ్వేల్ లో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై పై మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలు అనగానే చాలా మంది వచ్చి ఏదేదో మాట్లాడతారు.. మనల్ని మభ్య పెడతారు.. నవంబర్ 30 తరువాత గజ్వేల్ లో ఎవరు ఉండరు అని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ కేసీఆర్ పోటీ చేయకుంటే కట్టించిన బిల్డింగ్ లకు కూడా సున్నాలు కూడా వేయలేరు అని మంత్రి కామెంట్స్ చేశారు. ఒకప్పుడు గజ్వేల్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం ఆలోచించాలి.. సీఎం కేసీఆర్ ఇక్కడ ఉండటం గజ్వేల్ ప్రజల అదృష్టం.. సిద్దిపేట కంటే మంచి మెజార్టీ గజ్వేల్ ప్రజలు సీఎం కేసీఆర్ కి బహుమతిగా ఇవ్వాలి.. ఈ సారి గజ్వేల్ లో ప్రతిపక్ష పార్టీల డిపాజిట్ గల్లంతు అవ్వడం ఖాయం అంటూ హరీశ్ రావు వ్యాఖ్యనించారు.
అయితే, అంతకు ముందుకు గజ్వేల్ లో పర్యటించిన ఈటెల రాజేందర్ బీఆర్‌ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలు తన మీటింగులను అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నీచమైన పనే హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ ఆచరించిందని ఈటెల తెలిపారు. గజ్వేల్లో అడ్డగోలుగా డబ్బుల పంపిణీ అధిగమించి హుజురాబాద్‌లో ఎలాగైతే విజయం సాధించామో అలాగే ఇక్కడా గెలిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మన కడుపుకొట్టి, నోరు కొట్టి వేల కోట్ల రూపాయలు సంపాదించి, ఆ డబ్బుతో మన ఆత్మగౌరవాన్ని కొనే ప్రయత్నం చేస్తున్నారు అని ఈటెల రాజేందర్ అన్నారు.