సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు ఓబులవారిపల్లెకు తరలించారు. ఓబులవారిపల్లె పీఎస్‌లో పోసానికి వైద్య పరీక్షలు చేశారు. ఓబులవారిపల్లి ప్రాథమిక వైద్య కేంద్రం వైద్యులు గురు మహేష్ పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. గురు మహేష్ స్టేట్‌మెంట్‌ను రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు నమోదు చేశారు. కాసేపట్లో రైల్వే కోడూరు కోర్టులో పోసానిని హాజరుపరిచే అవకాశం ఉంది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని రాయదుర్గంలో పోసానిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ సహా పవన్ కల్యాణ్‌పై పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి రెండు రోజుల క్రితం ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జోగినేని మణి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. సినీ పరిశ్రమలో వర్గవిభేదాలు తలెత్తేలా రెచ్చగొట్టడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, వ్యవస్థీకృత నేరానికి పాల్పడడం వంటి అభియోగాలపై బీఎన్‌ఎస్‌లోని 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైంది. బుధవారం హైదరాబాద్ వచ్చిన పోలీసులు.. రాయదుర్గంలో మైహోమ్ భూజాలో పోసానిని అరెస్టు చేశారు.